
రవాణా చెక్‌పోస్ట్‌ల తొలగింపు
జీవో జారీ చేసిన ప్రభుత్వం సిబ్బందికి మొబైల్ స్క్వాడ్ బాధ్యతలు ఆరు నెలల పాటు నిర్వహించాలని ఆదేశం
సాక్షి, ఆదిలాబాద్: సరిహద్దులో రవాణాశాఖ చెక్‌పోస్టులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జీవో ఎంఎస్ నంబర్ 58ని ఈ నెల 28న జారీ చేసింది. తదనుగుణంగా సరిహద్దుల్లోని రవాణా చెక్‌పోస్టులను తొలగించారు. అయితే ఇప్పటికే అక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ఆరు నెలల పాటు మొబైల్ స్క్వాడ్ విధులు కేటాయించారు. ప్రధానంగా పన్ను చెల్లించకుండా రాష్ట్రంలోకి సరుకు వాహనాలు రాకుండా చూడటమే వీరి విధి. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటికే అమల్లో ఉన్న ఆన్‌లైన్ వాహన్ సాఫ్ట్‌వేర్‌ను రాష్ట్రంలో కూడా అమల్లోకి తీసుకువచ్చారు. తద్వారా ఇప్పటి వరకు ఆయా చెక్‌పోస్టుల్లో లభించే వివిధ రకాల సేవలను ఇకపై ఆన్‌లైన్‌లో జారీ చేసేలా ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగపడనుంది. అలాగే వాహన డ్రైవర్లకు అవగాహన కల్పించేందుకు గాను మొబైల్ స్క్వాడ్ సరిహద్దులో ఆరు నెలల పాటు సేవలందించనుంది. ఆ శాఖ కమిషనర్ తదుపరి ఆదేశాల మేరకు సిబ్బంది సేవలపై స్పష్టత రానుంది.
ఉమ్మడి జిల్లాలో...
ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్‌లో భోరజ్, ఆసిఫా బాద్‌లో వాంకిడి, నిర్మల్‌లోని భైంసాలో మహారాష్ట్ర కు సరిహద్దుగా రవాణా శాఖ చెక్‌పోస్టులు ఇప్పటి వరకు సేవలందించాయి. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఆయా చెక్‌పోస్టులను తొలగించారు. అయి తే మొదటి ఆరు నెలలు మొబైల్ స్క్వాడ్ సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తారు. పన్ను చెల్లించని సరుకు వాహనాలను రాష్ట్రంలోకి రాకుండా చూస్తారు. ఇదిలా ఉంటే భోరజ్‌లో 10 మంది, వాంకిడిలో ఎనిమిది, భైంసాలో ముగ్గురు సిబ్బంది సేవలందిస్తున్నారు. తాజాగా వారిని మొబైల్ స్క్వాడ్ డ్యూటీలోకి మార్చారు.
సేవలు ఇలా...
రవాణాశాఖ పరంగా చెక్‌పోస్టుల్లో అందించే సేవలను ఇకపై వాహన్ సాఫ్ట్‌వేర్ ద్వారా స్వచ్ఛంద పన్ను ఆన్‌లైన్‌లో చెల్లించేలా డ్రైవర్లకు అవగాహన కల్పించాలి. తాత్కాలిక పర్మిట్, వాలంటరీ ట్యాక్స్, స్పెషల్ పర్మిట్ ఈ సేవలను ప్రజలు ఇకపై ఆన్‌లైన్ ద్వారా పొందాల్సి ఉంటుంది.
భోరజ్ చెక్‌పోస్టు (ఫైల్)

రవాణా చెక్‌పోస్ట్‌ల తొలగింపు