
నవరాత్రోత్సవ ఏర్పాట్లపై అసంతృప్తి
కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలో గణేశ్ నవరాత్రోత్సవ ఏర్పాట్ల నిర్వహణపై హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన సమావేశాన్ని బహిష్కరించి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఆర్డీవో స్రవంతి ఆధ్వర్యంలో ఆయా మండపాల నిర్వాహకులు, హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు, వివిధ మతాల పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ఆమె వివరించారు. మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారులు తాము చేపట్టిన ఏర్పాట్లను వివరిస్తుండగా ఉత్సవ సమితి ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశాల్లో చెప్పిన అంశాలు కాగితాలకే పరితమవుతున్నాయే తప్ప సౌకర్యాల కల్పనలో అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేడుకల ప్రారంభానికి ముందు నిర్వహించిన సమావేఽశంలో తాము ప్రస్తావించిన ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేని పేర్కొంటూ సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. ఆర్డీవో నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. ఈ సందర్భంగా ఉత్సవ సమితి అధ్యక్షుడు హన్మాండ్లు మాట్లాడుతూ.. ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి అధికారుల నుంచి సహకారం కరువైందన్నారు. చాలా చోట్ల చెట్ల కొమ్మలు తొలగించకపోవడంతో పలు విగ్రహాలు దెబ్బతిన్నాయని, అలాగే రోడ్ల గుంతలు పూడ్చలేదని, వీధి దీపాలు సైతం వెలగడం లేదన్నారు. రూ.16లక్షల నిధులు కేటాయించినట్లు చెబుతున్నా వాటిని ఎక్కడ, ఎలా ఖర్చు చేస్తున్నారో తెలియడం లేదన్నారు. 1న కలెక్టర్, ఎస్పీల సమక్షంలో జరిగే సమావేశం వరకు సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.