
నకిలీ దందా
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అల్పపీడన ప్రభావంతో పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది.
ఆదిలాబాద్‌టౌన్: బ్రాండెడ్ కంపెనీల వస్తువులను పోలిన నకిలీవి తయారు చేస్తూ కొందరు అందినకాడికి దండుకుంటున్నారు. తక్కువ ధరకు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి బ్రాండెడ్ కంపెనీ ధర కు ప్రజలకు అంటగడుతూ అక్రమ దందా సాగిస్తున్నారు. అదేలేబుల్ ఉండడంతో గుర్తుపట్టలేక జనం మోసపోతున్నారు. జిల్లాలో గతంలో నకిలీ చాయ్‌పత్తి, జండుబామ్, తదితర వస్తువులతో పాటు ఏటా నకిలీ విత్తనాలు, పురుగుల మందులు, ఇలా అనేక వస్తువులు విక్రయాలు జరుగుతున్నాయి. మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలు స్తోంది. ఆదివారం ఇదే తరహా మోసానికి పాల్ప డిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఘడి కంపెనీకి సంబంధించి నకిలీ డిటర్జంట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రెచ్చిపోతున్న మోసగాళ్లు..
జిల్లాలో కొందరు వ్యాపారులు బ్రాండెడ్ పేర్లతో ఉన్న వాటిని నకిలీవి తయారు చేసి కిరాణ షాపులు, వారసంతలు, సూపర్ మార్కెట్లు, గ్రామాల్లో తిరుగుతూ విక్రయిస్తున్నారు. ఆఫర్ పేరిట ఆకర్షిస్తుండడంతో ప్రజలు తక్కువ ధరకు వచ్చిందని కొనుగోలు చేస్తున్నారు. తీరా నకిలీ అని తేలడంతో లబోదిబోమంటున్నారు. గతంలో ఆదిలాబాద్ పట్టణంలో జెమిని చాయ్‌పత్తికి సంబంధించి నకిలీవి తయారు చేసిన ఘటనలో కేటుగాళ్లు పట్టుబడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి ప్యాకెట్‌పై ఉన్న ఎంఆర్‌పీకి, ఒక ప్యాకెట్ కొంటే మరో ప్యాకెట్ ఉచితం.. ఇలా విక్రయాలు జరుపుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ దందా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఖరీఫ్ సీజన్‌లో నకిలీ విత్తనాలు తయారు చేసి రైతులకు విక్రయించడం ఏటా పరిపాటిగా మారింది. వీటిని కొనుగోలు చేసిన రైతులు అవి మొలకెత్తకపోవడంతో నష్టపోతున్నారు. ఈ సీజన్‌లో జిల్లా అధికారులు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కొరడా ఝుళిపించారు. పలువురిపై కేసులు నమోదు చేసి కటకటాలకు పంపించారు.
బ్రాండెడ్ కంపెనీ పేరుతో..
బ్రాండెడ్ కంపెనీకి సంబంధించి నకిలీవి తయారు చేస్తూ కొందరు ఈ దందాకు పాల్పడుతున్నారు. ఆదిలాబాద్‌కు చెందిన రూపేష్ అగర్వాల్ మహా రాష్ట్రలోని అమరావతి నుంచి నకిలీ ఘడి డిటర్జంట్ తీసుకొచ్చాడు. ఈ సరుకును ఆదిలాబాద్, మహారా ష్ట్రలోని జివితి ప్రాంతంలో వ్యాపారులకు విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో టూటౌన్ పోలీసులకు సమాచారం అందగా తాంసి బస్టాండ్ వద్ద శనివారం దాడిచేసి బొలెరో వాహనాన్ని పట్టుకున్నారు. వాహనంలో 60 బ్యాగుల్లో దాదాపు 15 క్వింటాళ్ల డిటర్జంట్‌ను సీజ్ చేశారు. నలుగురిపై కేసు నమోదు చేయగా, మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన శివాజీ ఎన్.జవాలే, జివితికి చెందిన రామ్‌రావు వన్‌కంటి ఇంగాలే, ఆదిలాబాద్ పట్టణంలోని రాణిసతీజి కాలనీకి చెందిన రూపేష్ అగర్వాల్‌ను అరెస్టు చేశారు. హమాలీవాడకు చెందిన అఫ్సర్ సలత్ పరారీలో ఉన్నాడు.
పోలీసులకు సమాచారం అందించాలి
ఎవరైనా నకిలీ వస్తువులు విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఘడి నకిలీ డిటర్జంట్‌ను శనివారం మహారాష్ట్రకు తరలిస్తుండగా దాడిచేసి 15 క్వింటాళ్ల మేర సరుకును స్వాధీనం చేసుకున్నాం. ముగ్గురిని అరెస్టు చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు.
– ఎల్.జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ