ఉచితమైనా.. భారమే! | - | Sakshi
Sakshi News home page

ఉచితమైనా.. భారమే!

Sep 1 2025 2:46 AM | Updated on Sep 1 2025 2:46 AM

ఉచితమైనా.. భారమే!

ఉచితమైనా.. భారమే!

‘గతంలో ట్రాక్టర్‌ ఇసుకకు ప్రభుత్వ పనులకు రూ.500, వ్యక్తిగత పనులకు రూ.700గా నిర్ణయించాం.. అయితే ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు దృష్టిలో ఉంచుకుని ఆ రెండు పనులకు ఒకే రేటు రూ.400గా నిర్ణయించాం.. ఆ మొత్తం చెల్లించి స్థానిక తహసీల్దార్ల నుంచి అనుమతి తీసుకుని అన్ని పని దినాల్లో దిగుమతి చేసుకోవచ్చు.. ఇందిరమ్మ ఇళ్లకు మాత్రం ఇసుక ఉచితంగా అందిస్తాం..’ ఇది కలెక్టర్‌ రాజర్షి షా గత నెల 27న జారీ చేసిన ప్రకటన. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. దాదాపు రూ.2,500 నుంచి 3,500 చెల్లించనిదే ట్రాక్టర్‌ ఇసుక రాని పరిస్థితి ఉండడం గమనార్హం.

ఇందిరమ్మ లబ్ధిదారులకు తప్పని ఇసుక ఇక్కట్లు అధికమవుతున్న ట్రాన్స్‌పోర్టు, కూలీ వ్యయం ట్రాక్టర్‌ ట్రిప్పు రూ.2,200 పైమాటే.. ఇతర నిర్మాణదారులపై మరింత అదనపు భారం

కై లాస్‌నగర్‌: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఇటీవల పుంజుకున్నాయి. అలాగే ప్రైవేట్‌ ఇళ్ల నిర్మాణాలు, ప్రభుత్వ భవన నిర్మాణాలు సైతం అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. నిర్మాణ పనులకు ఇసుక తప్పనిసరి కావడంతో డిమాండ్‌ ఏర్పడింది. వర్షాకాలం కావడంతో పూర్తిస్థాయిలో లభించని పరిస్థితి. ఈక్రమంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు ఉచితంగా, ప్రభుత్వ, ప్రైవేట్‌ పనులకు రూ.400కే ట్రాక్టర్‌ ఇసుక అందిస్తామని అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయం ఓకే అయినా క్షేత్రస్థాయిలో మాత్రం ఇబ్బందులు తప్పని పరిస్థితి.

ఇదీ పరిస్థితి...

జిల్లాలో పెన్‌గంగ పరీవాహక ప్రాంతాలైన తాంసి, భీంపూర్‌, జైనథ్‌, బేల, భోరజ్‌ మండలాల్లో ప్రధానంగా ఇసుక లభ్యత ఉంది. ఆయా ప్రాంతాల నుంచి ఇందిరమ్మ లబ్ధిదారులు ఉచితంగా ఇసుక తీసుకోవచ్చు. ప్రభుత్వ పనులు చేపట్టేవారు. ప్రైవేట్‌ ఇంటి నిర్మాణాలు చేపట్టినవారు సంబంధిత తహసీల్దార్లకు రూ.400 చెల్లించి వారి నుంచి టోకెన్‌ తీసుకోవాలి. వీరు ఆయా మండలాల్లోని ఇసుక లభించే గ్రామాల్లోని పెన్‌గంగకు వెళ్లి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయా ప్రాంతాలకు ట్రాక్టర్లతో వెళ్లినా ఇసుక నింపేందుకు కూలీలకు రూ.1400 నుంచి రూ.1800 చెల్లించాల్సి వస్తుంది. అలాగే ట్రా క్టర్‌ ట్రాన్స్‌పోర్టు చార్జీ రూ.800 నుంచి రూ.1,200 వరకు ఉంటుంది. వీటిని పరిగణలోకి తీసుకుంటే ఒక్కో ట్రాక్టర్‌ ఇసుక రూ.2,600 నుంచి రూ.3400 వరకు ఖర్చవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సొంతంగా ట్రాక్టర్‌ కలిగిన వారికి ట్రాన్స్‌పోర్టు చార్జి ఉండదు. కూలీ మాత్రం చెల్లించక తప్పదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రూ.400లకే ట్రాక్టర్‌ ఇసుక అంటున్నా.. ఖర్చు మాత్రం రూ.3వేలు దాటుతుందని పలువురు పెదవి విరుస్తున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులు సైతం పేరుకే ఉచితం తప్ప ఆర్థిక భారం తప్పడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జాడలేని ఇసుక బజార్‌లు..

ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక భారం కాకుండా ఉండేలా వివిధ ప్రాంతాల్లో ఇసుక బజార్‌లు ఏర్పాటు చేసి తక్కువ ధరకు అందించేలా చూడాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఆదేశాలు జారీ అయి రెండు నెలలు దాటినా జిల్లాలో వాటి ఏర్పాటు జాడ కానరావడం లేదు. ఇటీవల జరిగిన దిశా సమావేశంలో ఎంపీ నగేశ్‌ సైతం ఇసుక బజార్‌లపై మైనింగ్‌ అధికారులను ప్రశ్నించారు. అయినా ఇప్పటి వరకు ఏ ఒక్క చోట కూడా వాటిని ఏర్పాటు చేయలేదు. ఆ దిశగా ప్రయత్నాలు సైతం ప్రారంభించలేదు. ఫలితంగా ఇందిరమ్మ లబ్ధిదారులు ప్రైవేట్‌ ఇసుక వ్యాపారుల నుంచే కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.3500 నుంచి రూ.4500వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఇది తమకు భారంగా మారుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి తమపై భారం తగ్గేలా చూడాలని కోరుతున్నారు.

ఈ విషయమై సంబంధిత అధికారులను వివరణ కోరగా.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుకను సరఫరా చేస్తున్నట్లుగా పేర్కొనడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement