
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
కై లాస్‌నగర్: గిరిజన మహిళా రైతు మృతికి కారకులైన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సాత్నాల మండలం పలాయితండా వాసులు శనివారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పోలీసుల సమాచారంతో వారి వద్దకు వచ్చిన ఆర్డీవో స్రవంతికి సమస్యను వివరించారు. గ్రామానికి చెందిన చౌహాన్ కమలబాయి సర్వేనంబర్ 102లో ఆరెకరాల వ్యవసాయ భూమిని 1986లో ఇతర కులస్తుల వద్ద కొనుగోలు చేసినట్లు చెప్పారు. అయితే ఆ భూమి విక్రయించిన వ్యక్తి మనుమండ్లు ఆరుగురు అది తమ భూమి అంటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతో ఆర్‌ఐ, సర్వేయర్ ఎలాంటి నోటీసు ఇవ్వకుండా సదరు రైతును విచారించేందుకు వచ్చారు. దీంతో భయాందోళనకు గురైన రైతు బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురై మృతి చెందినట్లు తెలిపారు. అధికారుల అత్యుత్సాహంతోనే రైతు మృతి చెందినట్లు ఆరోపించారు. బాధిత కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు భూమిని సాగు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో లంబాడా జేఏసీ నాయకులు పాల్గొన్నారు.