
నిబంధనల ప్రకారం భూసేకరణ చేపట్టాలి
జైపూర్: సింగరేణి పరిధిలో భూసేకరణ ప్రక్రి య నిబంధనల ప్రకారం చేపట్టాలని సింగరేణి సంస్థ సిబ్బంది, పరిపాలన, సంక్షేమ విభాగ డైరెక్టర్ గౌతమ్ పొట్రు అన్నారు. జైపూర్ మండల కేంద్రంలోని ఎస్టీపీపీ ప్రాణహిత అతిథి గృహంలో శనివారం మంచిర్యాల కలెక్టర్ కుమార్‌దీపక్, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్లు, ఎస్టేట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ భూయాజమానులు, సింగరేణి సంస్థ సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా భూసేకరణ ప్రకియ నిర్వహించాలన్నారు.
నీటమునిగిన శ్మశానవాటిక
ఖానాపూర్: పట్టణంలోని గోదావరితీరంలో మున్సిపల్ నూతన కార్యవర్గం ఏర్పటయ్యాక రూ.50 లక్షలతో నిర్మించిన శ్మశనవాటిక ఏటా వర్షాకాలంలో నీట మునుగుతోంది. పాలకుల అనాలోచిత నిర్ణయాలతో ఏటా వరదలు తగ్గాక మరమ్మతు చేయడం పరిపాటిగా మారింది. శనివారం పట్టణంలోని 5వ వార్డులో ద్యావతి గంగాధర్(55) అనారో గ్యంతో మృతి చెందాడు. గోదావరి తీరంలో గల శ్మశానవాటికకు తీసుకెళ్లాల్సి ఉండగా ఉండగా కుటుంబ సభ్యులు అత్యంత దూరభారమైనప్పటికీ గాంధీనగర్ శివారులోని తర్లపాడ్ వెళ్లే రహదారి వరకు తీసుకెళ్లి ఖననం చేశారు. ఇప్పటికై నా శ్మశానవాటిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
మరమ్మతుల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు
ఆదిలాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రైలు పట్టాలను సరిచేస్తున్న నేపథ్యంలో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ డివిజన్ పరిధిలోని భిక్కనూరు–తల్మాడ సెక్షన్, అక్కన్నపేట–మెదక్ సెక్షన్‌లో రైలు పట్టాలపై భారీగా వరద నీరు ప్రవహించడంతో అక్కడ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని తిరుపతి–ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను శనివారం చర్లపల్లి–ఆదిలాబాద్ మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు. పర్లి–ఆదిలాబాద్ మధ్య నడిచే 77615 రైలు సర్వీస్, ఆదిలాబాద్–పూర్ణ మధ్య నడిచే 77616 రైల్ సర్వీసులు సెప్టెంబర్ 1న రద్దు చేసినట్లు వివరించారు. ఈ విషయాన్ని రైలు ప్రయాణికులు గమనించాలని సూచించారు.

నిబంధనల ప్రకారం భూసేకరణ చేపట్టాలి