ట్రంప్‌ కశ్మీర్‌ సమస్యను పరిష్కరిస్తే... | Pak FAA Sartaj Aziz likely to visit India | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ కశ్మీర్‌ సమస్యను పరిష్కరిస్తే...

Nov 16 2016 12:15 PM | Updated on Mar 23 2019 8:23 PM

ట్రంప్‌ కశ్మీర్‌ సమస్యను పరిష్కరిస్తే... - Sakshi

ట్రంప్‌ కశ్మీర్‌ సమస్యను పరిష్కరిస్తే...

‘అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌ గనుక కశ్మీర్‌ సమస్యను పరిష్కరిస్తే.. ఆయనకు నోబెల్‌ పురస్కారం దక్కాల్సిందే’

ఇస్లామాబాద్‌: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ గెలుపుతో రిపబ్లికన్లకంటే మిన్నగా సంబురాలు జరుపుకొన్న పాకిస్థాన్‌.. మరోసారి కశ్మీర్‌ విదాదాన్ని ట్రంప్‌ పరిష్కరిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఏడున్నర దశాబ్ధాల కశ్మీర్‌ వివాదంలో మూడో వ్యక్తి ప్రమేయాన్ని వ్యతిరేకిస్తున్న భారత్‌ ను ట్రంప్‌ దారికి తెస్తాడని, ఆ విధంగా పాకిస్థాన్‌ పంతం నెగ్గుతుందని గడిచిన కొద్ది రోజులుగా దాయాది దేశంలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఈ వార్తలపై పాక్‌ విదేశీ వ్యవహారాల మంత్రి, ప్రధాని సలహాదారు అయిన సర్తాజ్‌ అజీజ్‌ మంగళవారం తొలిసారిగా స్పందించారు.

ఇస్లామాబాద్‌ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సర్తాజ్‌ అజీజ్‌ మాట్లాడుతూ..‘అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌ గనుక కశ్మీర్‌ సమస్యను పరిష్కరిస్తే.. ఆయనకు నోబెల్‌ పురస్కారం దక్కాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. కశ్మీర్‌ అంశంలో ఐక్యరాజ్యసమితి లేదా ఎవరో ఒకరు జోక్యం చేసుకోవాలని పాక్‌ మొదటి నుంచి కోరుకుంటున్నదని అజీజ్‌ గుర్తుచేశారు. గత అక్టోబర్‌ లో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌.. అధ్యక్షుడిగా గెలిస్తే, ఇండియా, పాకిస్థాన్‌ ల మధ్య నలుగుతోన్న కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానని వ్యాఖ్యానించడం తెలిసిందే.

కాగా, తాను త్వరలోనే భారత్‌ లో పర్యటించనున్నట్లు పాక్‌ విదేశాంగ మంత్రి సర్తాజ్‌ అజీజ్‌ మరో సంచలన ప్రకటన చేశారు. ఉడీ ఉగ్రదాడి, ప్రతీకారంగా భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ తరువాత భారత్‌, పాకిస్థాన్‌ ల మధ్య సంబంధాలు దాదాపు క్షీణించడం, అటు అంతర్జాతీయ సమాజంలో పాక్‌ ఏకాకిగా మారుతున్న నేపథ్యంలో అజీజ్‌ ఇలాంటి ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

డిసెంబర్‌ 3న భారత్‌ (అమృత్‌ సర్‌) వేదికగా జరుగనున్న ‘హార్ట్‌ ఆఫ్‌ ఆసియా’ సదస్సుకు తాను హాజరవుతున్నట్లు వెల్లడించిన సర్తాజ్‌ అజీజ్.. తన పర్యటనతో ఇరుదేశాల మధ్య నెలకొన్ని ఉద్రిక్తతలు సడలుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉడీ ఘటన తర్వాత పాక్‌ ఉన్నతస్థాయి వ్యక్తులు ఇండియాకు రానుండటం ఇదే మొదటిసారి. భారత్‌ తో ఎల్లప్పుడూ సత్పంబంధాలనే కోరుకుంటామన్న ఆయన.. ‘హార్ట్‌ ఆఫ్‌ ఆసియా’ ప్రధాన ఉద్దేశం అఫ్ఘానిస్థాన్‌ పునర్నిర్మాణమే కాబట్టి భారత అధికారులతో ప్రత్యేకంగా చర్చలు జరపబోనని తెలిపారు.

హార్ట్‌ ఆఫ​ ఏషియా: అఫ్ఘానిస్థాన్‌
అమెరికా తలపెట్టిన పాశవిక యుద్ధంతో కకావికలమైన అఫ్ఘానిస్థాన్‌ ను పునర్మించడంలో భాగంగా 2011 నుంచి హార్ట్‌ ఆఫ​ ఏషియా సదస్సులు నిర్వహిస్తున్నారు. భారత్‌ సహా మొత్తం 14 దేశాలు(పాకిస్థాన్‌, రష్యా, చైనా, ఇరాన్‌, కజకిస్థాన్‌, అఫ్ఘాన్‌, కర్గీజ్‌, తజకిస్థాన్‌, తుర్క్‌ మెనిస్థాన్‌, సౌదీ అరేబియా, యూఏఈ, అజర్‌ బైజాన్‌, టర్కీలు) ఈ కూటమిలో భాగస్వాములు. దీనికి యూఎస్‌, యూకే, ఆస్ట్రేలియా, డెన్మార్క్‌, కెనడా, ఈజిప్ట్‌, ఫిన్‌ లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, ఇరాక్‌, జపాన్‌, నార్వే, పోలండ్‌, స్పెయిన్‌, స్విడన్‌ ల మద్దతు కూడా ఉంది. ‘హార్ట్‌ ఆఫ్‌ ఏషియా’ను ఐక్యరాజ్య సమితి సహా నాటో, సార్క్‌, షాంఘై సహకార సమితి, ఇస్లామిక్‌ సహకార కూటములు గుర్తించాయి. డిసెంబర్‌ 3న అమృత్‌ సర్‌ లో జరగనున్నది హార్ట్‌ ఆఫ్‌ ఏసియా ఏడో శిఖరాగ్ర సమావేశం.

Advertisement
 
Advertisement
Advertisement