breaking news
Heart of Asia conference
-
పాకిస్థాన్‌కు గట్టి ఝలక్ ఇచ్చిన అఫ్ఘాన్
అమృత్సర్: అమృత్‌సర్‌లో జరుగుతున్న ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ సదస్సు వేదికగా పాకిస్థాన్‌పై అఫ్ఘానిస్థాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. తమ దేశంపై పాక్ అప్రకటిత యుద్ధం చేస్తున్నదని, తాలిబన్ సహా పలు ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు రహస్యంగా సాయం చేయడం ద్వారా తమ దేశాన్ని నాశనం చేస్తున్నదని అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ మండిపడ్డారు. అదే సమయంలో అఫ్ఘాన్‌లో పెరిగిపోతున్న భారత్ ప్రమేయాన్ని ఆయన సమర్థించారు. అఫ్ఘాన్ పునర్నిర్మాణంలో భారత్ పాత్ర పెరుగుతుండటంలో ఎలాంటి రహస్య ఒప్పందాలు లేవని స్పష్టం చేశారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, అక్రమ కార్యకలాపాల ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారో తేల్చడానికి ఆసియా స్థాయిలో లేదా అంతర్జాతీయ స్థాయిలో యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాల్సిందేనని, ఇందులో ఎలాంటి దోబుచులాటలకు తావులేదని అష్రఫ్ స్పష్టం చేశారు. పాక్‌తో తాము ద్వైపాక్షిక, అంతర్జాతీయ సంబంధాలు కోరుకుంటుండగా.. ఆ దేశం మాత్రం తమపై అప్రకటిత యుద్ధం చేస్తున్నదని, 2014లో జరిగిన బ్రస్సెల్స్ సదస్సు నుంచి ఈ అప్రకటిత యుద్ధం ముమ్మరమైనదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అఫ్ఘాన్ పునర్నిర్మాణానికి పాక్ ఇవ్వజూపిన 500 మిలియన్ డాలర్ల (రూ. 3400 కోట్ల) సాయాన్ని కూడా అష్రఫ్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. తమకు ఇవ్వజూపిన డబ్బేదో ఉగ్రవాద నిర్మూలనకు ఉపయోగించాలని, అంతేకానీ ఒకవైపు డబ్బు ఇస్తూ మరోవైపు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తే ఎలాంటి ప్రయోజన ఉండదని పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న ఉగ్రవాద సంస్థలు ఆ దేశ భూభాగంలో ఉన్నాయని, పాక్ మద్దతు లేకుంటే తాము ఒక్క నెల కూడా మనలేమని తాలిబన్లే స్వయంగా చెప్తున్నారని ఆయన స్పష్టం చేశారు. భారత్ మద్దతు, ప్రధాని నరేంద్రమోదీ వెన్నుదన్నుతోనే అఫ్ఘాన్ అధినేత అష్రఫ్ ఘనీ పాక్‌కు వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు. -
ట్రంప్ కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తే...
ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ గెలుపుతో రిపబ్లికన్లకంటే మిన్నగా సంబురాలు జరుపుకొన్న పాకిస్థాన్.. మరోసారి కశ్మీర్ విదాదాన్ని ట్రంప్ పరిష్కరిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఏడున్నర దశాబ్ధాల కశ్మీర్ వివాదంలో మూడో వ్యక్తి ప్రమేయాన్ని వ్యతిరేకిస్తున్న భారత్ ను ట్రంప్ దారికి తెస్తాడని, ఆ విధంగా పాకిస్థాన్ పంతం నెగ్గుతుందని గడిచిన కొద్ది రోజులుగా దాయాది దేశంలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఈ వార్తలపై పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి, ప్రధాని సలహాదారు అయిన సర్తాజ్ అజీజ్ మంగళవారం తొలిసారిగా స్పందించారు. ఇస్లామాబాద్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సర్తాజ్ అజీజ్ మాట్లాడుతూ..‘అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ గనుక కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తే.. ఆయనకు నోబెల్ పురస్కారం దక్కాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. కశ్మీర్ అంశంలో ఐక్యరాజ్యసమితి లేదా ఎవరో ఒకరు జోక్యం చేసుకోవాలని పాక్ మొదటి నుంచి కోరుకుంటున్నదని అజీజ్ గుర్తుచేశారు. గత అక్టోబర్ లో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్.. అధ్యక్షుడిగా గెలిస్తే, ఇండియా, పాకిస్థాన్ ల మధ్య నలుగుతోన్న కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానని వ్యాఖ్యానించడం తెలిసిందే. కాగా, తాను త్వరలోనే భారత్ లో పర్యటించనున్నట్లు పాక్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ మరో సంచలన ప్రకటన చేశారు. ఉడీ ఉగ్రదాడి, ప్రతీకారంగా భారత్ సర్జికల్ స్ట్రైక్స్ తరువాత భారత్, పాకిస్థాన్ ల మధ్య సంబంధాలు దాదాపు క్షీణించడం, అటు అంతర్జాతీయ సమాజంలో పాక్ ఏకాకిగా మారుతున్న నేపథ్యంలో అజీజ్ ఇలాంటి ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. డిసెంబర్ 3న భారత్ (అమృత్ సర్) వేదికగా జరుగనున్న ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ సదస్సుకు తాను హాజరవుతున్నట్లు వెల్లడించిన సర్తాజ్ అజీజ్.. తన పర్యటనతో ఇరుదేశాల మధ్య నెలకొన్ని ఉద్రిక్తతలు సడలుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉడీ ఘటన తర్వాత పాక్ ఉన్నతస్థాయి వ్యక్తులు ఇండియాకు రానుండటం ఇదే మొదటిసారి. భారత్ తో ఎల్లప్పుడూ సత్పంబంధాలనే కోరుకుంటామన్న ఆయన.. ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ ప్రధాన ఉద్దేశం అఫ్ఘానిస్థాన్ పునర్నిర్మాణమే కాబట్టి భారత అధికారులతో ప్రత్యేకంగా చర్చలు జరపబోనని తెలిపారు. హార్ట్ ఆఫ ఏషియా: అఫ్ఘానిస్థాన్ అమెరికా తలపెట్టిన పాశవిక యుద్ధంతో కకావికలమైన అఫ్ఘానిస్థాన్ ను పునర్మించడంలో భాగంగా 2011 నుంచి హార్ట్ ఆఫ ఏషియా సదస్సులు నిర్వహిస్తున్నారు. భారత్ సహా మొత్తం 14 దేశాలు(పాకిస్థాన్, రష్యా, చైనా, ఇరాన్, కజకిస్థాన్, అఫ్ఘాన్, కర్గీజ్, తజకిస్థాన్, తుర్క్ మెనిస్థాన్, సౌదీ అరేబియా, యూఏఈ, అజర్ బైజాన్, టర్కీలు) ఈ కూటమిలో భాగస్వాములు. దీనికి యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, డెన్మార్క్, కెనడా, ఈజిప్ట్, ఫిన్ లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇరాక్, జపాన్, నార్వే, పోలండ్, స్పెయిన్, స్విడన్ ల మద్దతు కూడా ఉంది. ‘హార్ట్ ఆఫ్ ఏషియా’ను ఐక్యరాజ్య సమితి సహా నాటో, సార్క్, షాంఘై సహకార సమితి, ఇస్లామిక్ సహకార కూటములు గుర్తించాయి. డిసెంబర్ 3న అమృత్ సర్ లో జరగనున్నది హార్ట్ ఆఫ్ ఏసియా ఏడో శిఖరాగ్ర సమావేశం.