ప్రత్యర్థిని చంపి.. శవం వద్ద డాన్సులు | gangsters kill financier, dance near body | Sakshi
Sakshi News home page

ప్రత్యర్థిని చంపి.. శవం వద్ద డాన్సులు

Feb 17 2017 8:44 AM | Updated on Oct 2 2018 4:31 PM

నిందితుడు దల్వీందర్ సింగ్ - Sakshi

నిందితుడు దల్వీందర్ సింగ్

పంజాబ్‌లో ఘోరం జరిగింది. సంగ్రూర్ సమీపంలోని లోంగోవాల్ పట్టణంలో గల ప్రధాన మార్కెట్లో పట్టపగలు ఓ ఫైనాన్స్ వ్యాపారిని కాల్చి చంపిన గ్యాంగ్‌స్టర్లు.. అతడి శవం వద్ద డాన్సులు చేసి, వీడియో కూడా తీసుకున్నారు.

పంజాబ్‌లో ఘోరం జరిగింది. సంగ్రూర్ సమీపంలోని లోంగోవాల్ పట్టణంలో గల ప్రధాన మార్కెట్లో పట్టపగలు ఓ ఫైనాన్స్ వ్యాపారిని కాల్చి చంపిన గ్యాంగ్‌స్టర్లు.. అతడి శవం వద్ద డాన్సులు చేసి, వీడియో కూడా తీసుకున్నారు. దల్వీందర్ సింగ్ అలియాస్ బబ్లీ రణ్‌ధవా నేతృత్వంలోని ఐదుగురు గ్యాంగ్‌స్టర్లు ఈ దారుణానికి ఒడిగట్టారు. దల్వీందర్ ఇటీవలే వేరే కేసులో బెయిల్ పొంది జైలు నుంచి విడుదలయ్యాడు. హర్‌దేవ్ సింగ్ అనే ఫైనాన్స్ వ్యాపారి దల్వీందర్‌కు రూ. 5 లక్షలు అప్పు ఇచ్చాడు. ఆ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. హర్‌దేవ్ తలలోకి ఐదు బుల్లెట్లు కాల్చడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత అతడి శవం వద్ద డాన్సులు చేస్తూ వాళ్లు సంబరాలు చేసుకున్నారు. పోలీసులు దమ్ముంటే తనను పట్టుకోవాలని సవాలు కూడా చేశాడు. దాంతో ఆ ప్రాంతంలో అంతా వణికి పోయారు. దుకాణాల షట్టర్లు మూసేసుకున్నారు. వీళ్లంటే పోలీసులకు కూడా భయమేనని, ఇక వాళ్లు తమకు రక్షణ ఎక్కడ కల్పిస్తారని దుకాణదారులు అడుగుతున్నారు. 
 
ఈ నేరం చేసిన తర్వాత.. రణ్‌ధవా తన ఫేస్‌బుక్ పేజీలో నాలుగు వీడియోలు పోస్ట్ చేశాడు.  'మారే హిక్ విచ్ ఫైర్ జాట్ నే' (ఆ జాట్ గుండెల్లో కాల్చాడు) అనే పాట పాడుకుంటూ.. హత్య చేసింది తానేనని ఆ వీడియోలో చెప్పాడు. చేతిలో తుపాకి కూడా పట్టుకుని కనిపించాడు. హర్‌దేవ్‌ను ఎందుకు చంపిందీ మరో వీడియోలో తెలిపాడు. ఈ హత్యలో అతడితో పాటు అతడి అనుచరులు అమన్ సింగ్, నాన్సీ, వరీందర్ సింగ్, సుర్జా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. 
 
నిందితులను అరెస్టు చేసేవరకు తన కొడుకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడానికి వీల్లేదని మృతుడి తండ్రి సజన్ సింగ్ పట్టుబట్టారు. పట్టపగలు పది గంటల సమయంలో ఇలా జరిగినా ఇంతవరకు ప్రధాన నిందితుడిని ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. నిందితుడు బబ్లీ స్థానిక హిస్టరీ షీటర్ అని, ఇది చాలా హేయమైన నేరమని.. అతడిని పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నామని సీనియర్ ఎస్పీ ఇందర్‌బీర్ సింగ్ తెలిపారు. అతడు ఎక్కడి నుంచి ఫేస్‌బుక్‌లో వీడియోలు అప్‌లోడ్ చేశాడో గుర్తించే ప్రయత్నంలో ఉన్నామన్నారు.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement