
పింఛన్‌దారుల ఎదురుచూపు!
తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం కొలువుదీరింది. అధికారం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం కొలువుదీరింది. అధికారం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు. టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సామాజిక పింఛన్లలో వృద్ధాప్య, వితంతువులు తదితర కేటగిరీల వారికి నెలకు రూ.1000 చొప్పున పింఛన్ పంపిణీ చేస్తామని, అదేవిధంగా వికలాంగులకు రూ.1500 చొప్పున ఇస్తామని స్పష్టం చేసింది. తాజాగా ఆ పార్టీ అధికారంలోకి రావడంతో.. మాటకు కట్టుబడి పింఛన్ మొత్తం పెంపుదల చేసి అందజేస్తుందని లబ్ధిదారులు ఆశతో ఉనారు.
లబ్ధిదారులు 2.63లక్షలు...
జిల్లాలో సామాజిక పింఛన్లలో భాగంగా 2,63,145 మంది లబ్ధి పొందుతున్నారు. వీరిలో వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులకు ప్రతి నెల రూ.200 చొప్పున పంపిణీ చేస్తుండగా, వికలాంగులు, అభయహస్తం లబ్ధిదారులకు మాత్రం నెలకు రూ.500 చొప్పున పింఛన్ చెల్లిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా ప్రతినెల రూ. 6.52కోట్లు పింఛన్ల కింద పంపిణీ అవుతున్నాయి. కాగా, అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం అంతకుముందు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో పింఛన్ల మొత్తాన్ని భారీగా పెంచనున్నట్టు ప్రకటించింది.
వికలాంగులకు నెలకు రూ.1500 ఇస్తామని, అదేవిధంగా వృద్దాప్య, వితంతు కేటగిరీలకు రూ.1000 చొప్పున ఇస్తామని పేర్కొంది. చేనేత, కల్లుగీత కార్మికులను ఇందులో ప్రస్తావించనప్పటికీ.. గతంలో ఇతర కేటగిరీలకు సమానంగా ఇస్తున్న రూ.200ను రూ.1000కు పెంచే అవకాశం ఉంది.
నెలవారీ భారం రూ.21.38 కోట్లు
సామాజిక పింఛన్లకు సంబంధించి టీఆర్‌ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టో అమలుకు ఉపక్రమించింది. ఇందుకు సంబంధించి అధికారులు లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. అతి త్వరలో పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తామని అధికారవర్గాలు చెబుతున్నాయి.కొత్త పింఛన్ విధానం అమల్లోకి వస్తే.. జిల్లాలోని లబ్ధిదారులకు ప్రస్తుతం నెలకు రూ.6.52 కోట్లు పంపిణీ చేస్తుండగా, తాజా పెంపుతో రూ.27.90 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన జిల్లాపై నెలకు రూ.21.38కోట్ల భారం పడనుంది.