మ్యాచ్‌ ఫిక్సింగ్‌ల్లో ఇది వేరయా...

Special Story About SA VS England Test Match 2000 In Centurion - Sakshi

అనూహ్యంగా ముగిసిన దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ టెస్టు

ఆడకుండానే ఇన్నింగ్స్‌లు డిక్లేర్‌ చేసిన ఇరు జట్లు

ఆపై మ్యాచ్‌ ఫిక్స్‌ అయినట్లుగా వెల్లడి

సరదాగా గల్లీ క్రికెట్‌ ఆడుకుంటున్నప్పుడు చీకటి పడిపోతుందనుకుంటే ఆటగాళ్లంతా అన్ని నిబంధనలు పక్కన పెట్టేస్తారు. ఎవరూ బాధపడకూడదు కాబట్టి అందరికీ బ్యాటింగ్‌ వచ్చేలా చేద్దాం, గెలుపోటములను పక్కన పెట్టి అందరం తలా కొద్దిసేపు ఆడుకుందాం, బాగా ఆడినా ఆడకపోయినా అదో తృప్తి..! ఇలా అనుకుంటూ చేతులు కలుపుకోవడం మామూలే. కానీ అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లోనూ ఇలాగే జరిగితే? సరిగ్గా ఇలాగే కాకపోయినా దాదాపు ఇదే తరహాలో ఇరు జట్లు ఒప్పందపు టెస్టు ఆడాయి. చివరకు అది మ్యాచ్‌ ఫిక్సింగ్‌గా తేలింది. ఇదంతా 2000లో సెంచూరియన్‌ పార్క్‌ వేదికగా జరిగిన దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ టెస్టు మ్యాచ్‌ గురించే. మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో దోషిగా నిలిచిన హాన్సీ క్రానేయే ఈ మొత్తం వ్యవహారానికి కేంద్రంగా నిలిచాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదం కొత్త కాదు. అనేక మంది ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడటం... ఆపై నిషేధాలు ఎదుర్కోవడం, శిక్షకు గురికావడం జరిగాయి. అయితే 2000లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఫిక్స్‌ అయిన ఒక మ్యాచ్‌ మాత్రం అనూహ్యం. ‘కొత్త తరహా, ఆసక్తికర వ్యూహం’ పేరుతో సాగిన ఈ వ్యవహారం అసలురంగు కొద్ది రోజుల తర్వాత బయటపడటంతో క్రికెట్‌ ప్రపంచం విస్తుపోయింది.  

ఏం జరిగింది... 
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా 2000 జనవరి 14న దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ మధ్య చివరి టెస్టు ప్రారంభమైంది. అప్పటికే సఫారీలు 2–0తో సిరీస్‌ సొంతం చేసుకున్నారు. తొలి రోజు దక్షిణాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 155 పరుగులు చేసిన దశలో భారీ వర్షం వచ్చింది. వాన తగ్గకపోవడంతో వరుసగా మూడు రోజులపాటు ఒక్క బంతి కూడా పడలేదు. దాంతో ‘డ్రా’ ఖాయమనుకొని చివరి రోజు ఏదో మొక్కుబడిగా మైదానంలోకి దిగేందుకు ఆటగాళ్లు సిద్ధమయ్యారు.  

క్రానే ప్రతిపాదన... 
ఈ దశలో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ హాన్సీ క్రానే తన ప్రత్యర్థి, ఇంగ్లండ్‌ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ ముందు ఒక అనూహ్య ప్రతిపాదన ఉంచాడు. ప్రేక్షకులను నిరాశపర్చడం ఎందుకు? మనం ఏదైనా కొత్తగా చేసి వారికి అందించవచ్చు కదా! నా వద్ద ఒక ఆలోచన ఉంది అంటూ వివరించాడు. ముందు హుస్సేన్‌ షాక్‌కు గురైనా... సహచరులతో చర్చించి ఓకే అన్నాడు. దీని ప్రకారం చివరి రోజు సఫారీలు తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన తర్వాత ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క బంతి కూడా ఆడదు. ఆపై దక్షిణాఫ్రికా కూడా రెండో ఇన్నింగ్స్‌ను అస్సలు ఆడకుండా ఫోర్‌ఫీట్‌ చేస్తుంది. ఇంగ్లండ్‌ ముందు ఊరించే లక్ష్యాన్ని విధిస్తుంది (ఇది కూడా ఇంగ్లండ్‌కు అనుకూలంగానే సాగింది). దీని ప్రకారం చర్చోపచర్చల తర్వాత దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 248 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. దాంతో ఇంగ్లండ్‌ లక్ష్యం 76 ఓవర్లలో 249గా మారింది. చివరకు ఆ రోజు మరో ఐదు బంతులు మిగిలి ఉండగా 75.1 ఓవర్లలో 8 వికెట్లకు 251 పరుగులు చేసి 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ గెలిచింది. మొత్తానికి ఈ పర్యటనలో ఓ మ్యాచ్‌లో నెగ్గామని హుస్సేన్‌ బృందం సంబరపడింది.

అసలు విషయమిది... 
ఆ సమయంలో క్రానేకు అద్భుతమైన కెప్టెన్‌గా గుర్తింపు ఉంది. అతని వ్యూహాలు, ప్రణాళికలు కొత్తగా ఉంటాయి కాబట్టి అదే కోవలో దీనిని చేర్చి అంతా ప్రశంసించారు. తాను టెస్టు క్రికెట్‌ను బతికించేందుకే ఇలా చేశానని అతను కూడా చెప్పుకున్నాడు. అయితే సరిగ్గా మూడు నెలల తర్వాత ఏప్రిల్‌లో భారత్‌తో సిరీస్‌ సందర్భంగా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో క్రానే పేరు బయటకు వచ్చిన తర్వాత ఈ మ్యాచ్‌ కూడా ఫిక్స్‌ అయినట్లు తేలింది. నిజానికి నాలుగో రోజు సాయంత్రమే క్రానేను ఒక బుకీ కలిశాడు. మ్యాచ్‌ ‘డ్రా’ అయితే తాను భారీగా నష్టపోతానని, ఎలాగైనా ఫలితం రావాలని అతను కోరాడు. దాంతో క్రానే ‘డిక్లరేషన్‌’ ఎత్తుగడతో ముందుకు వచ్చాడు. హుస్సేన్‌ అంగీకరించిన తర్వాతే మ్యాచ్‌ జరుగుతోందని బుకీకి మెసేజ్‌ పంపించాడు.

మ్యాచ్‌ ముగిశాక క్రానేకు బుకీ 5 వేల బ్రిటిష్‌ పౌండ్లు, ఒక లెదర్‌ జాకెట్‌ బహుమతిగా ఇచ్చాడు (నిజానికి ఇది ఈ మ్యాచ్‌ కోసం కాదు. భవిష్యత్తులోనూ సహకారం కోరుకుంటూ చిన్న గిఫ్ట్‌ అంటూ జాకెట్‌లో డబ్బులు పెట్టి ఇచ్చాడు). నిజం బయటపడిన రోజు ప్రపంచమంతా విస్తుపోయింది. ఈ మ్యాచ్‌లో భాగంగా ఉన్న ఆటగాళ్లంతా షాక్‌కు గురయ్యారు. నిజానికి సిరీస్‌ ఫలితం తేలిపోయింది కాబట్టి క్రానే దృష్టిలో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత లేకపోయింది. ఎవరు గెలిచినా ఫలితం రావడం ముఖ్యం కాబట్టి దక్షిణాఫ్రికా చివరి వరకు గెలిచేందుకు ప్రయత్నించిందే తప్ప కావాలని ఓడిపోకపోవడం గమనార్హం. అయితే కారణమేదైనా చరిత్రలో ఒక    చేదు ఘటనగా ఈ టెస్టు మిగిలిపోయింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top