‘పీఎస్‌ఎల్‌ నిర్వహణ కష్టమే.. కానీ ముగిసిపోలేదు’

Shoaib Akhtar Hints At Economic Crisis in Pakistan Super League - Sakshi

ఇస్లామాబాద్ ‌: పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)పై మాజీ ఫాస్ట్‌బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ సంచన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో  పీఎస్‌ఎల్‌ నిలదొక్కుకోవడం కష్టమేనన్నారు. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు తమ జట్లును అమ్ముకోడానికి సిద్దంగా ఉన్నాయని తెలిపాడు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మార్చిలో జరగాల్సిన ఈ లీగ్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సెప్టెంబర్‌ వరకు పూర్తిస్థాయిలో క్రికెట్‌ కార్యకలాపాలు జరిగే అవకాశాలు లేవని, దీంతో మరో 16 నుంచి 18 నెలల లోపు పీఎస్‌ఎల్‌ నిర్వహించడం సాధ్యం కాదని తేల్చిచెప్పాడు. (వధువు లేని పెళ్లిలా ఉంటుంది... ఆ ఆట!)

ఆర్థికంగా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పటికీ పీఎస్‌ఎల్‌ ఫ్రాంచైజీలను డబ్బులు అడిగే సాహసం చేయదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే పీఎస్‌ఎల్‌ కథ సమాప్తం కానివ్వనని, ఈ లీగ్‌ సజావుగా సాగేందుకు అవసరమైన ఆర్థిక, ఇతరాత్ర సాయం అందించేందుకు సిద్దంగా ఉన్నానని అక్తర్‌ పేర్కొన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌ నిర్వహణ అనేది ఐసీసీ, క్రికెట్‌ ఆస్ట్రేలియా, బీసీసీఐ చేతుల్లో లేదని ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉందని తెలిపాడు. అయితే ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రజల ఆరోగ్యానికే ఆసీస్‌ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని భావిస్తున్నానని అక్తర్‌ పేర్కొన్నాడు. (‘ధోనిని మిస్సవుతున్నా.. మళ్లీ ఆ రోజులు రావాలి’)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top