సాకేత్ జోడికి రెండో డబుల్స్ టైటిల్ | Delhi ATP Challenger: Sanam Singh out, Yuki Bhambri in doubles second round | Sakshi
Sakshi News home page

సాకేత్ జోడికి రెండో డబుల్స్ టైటిల్

Feb 23 2014 1:35 AM | Updated on Sep 2 2017 3:59 AM

సాకేత్ జోడికి రెండో డబుల్స్ టైటిల్

సాకేత్ జోడికి రెండో డబుల్స్ టైటిల్

నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యువతార సాకేత్ మైనేని వరుసగా రెండో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

న్యూఢిల్లీ: నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యువతార సాకేత్ మైనేని వరుసగా రెండో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. తన భాగస్వామి సనమ్ సింగ్‌తో కలిసి గతవారం కోల్‌కతాలో తొలి ఏటీపీ చాలెంజర్ టైటిల్ నెగ్గిన సాకేత్ అదే ఫలితాన్ని ఢిల్లీలోనూ పునరావృతం చేశాడు.
 
  శనివారం జరిగిన ఫైనల్లో సాకేత్-సనమ్ ద్వయం 7-6 (7/5), 6-4తో రెండో సీడ్ సంచాయ్ రాటివటానా-సొంచాట్ రాటివటానా (థాయ్‌లాండ్) జోడిని బోల్తా కొట్టించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట ఆరు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మరోవైపు రాటివటానా బ్రదర్స్ ఏకంగా ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. విజేతగా నిలిచిన సాకేత్ జోడికి 6,200 డాలర్ల ప్రైజ్‌మనీతోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
 
 ఫైనల్లో సోమ్‌దేవ్
 పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ ప్లేయర్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో సోమ్‌దేవ్ 6-4, 6-2తో ఎవగెని డాన్‌స్కాయ్ (రష్యా)పై గెలిచాడు. మరో సెమీఫైనల్లో టాప్ సీడ్ అలెగ్జాండర్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్థాన్) 4-6, 7-6 (7/3), 6-3తో ఇలిజా బొజాల్‌జాక్ (సెర్బియా)ను ఓడించి సోమ్‌దేవ్‌తో ఆదివారం జరిగే ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు. కెరీర్‌లో మూడుసార్లు ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించిన సోమ్‌దేవ్ రెండుసార్లు విజేతగా నిలిచి మరోసారి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement