అఫ్గనిస్తాన్ మాజీ క్రికెటర్ షాపూర్ జద్రాన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అత్యవసర విభాగంలో ఉంచి అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నిరంతరం పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ ఆరోగ్యం పెద్దగా మెరుగుపడటం లేదని తెలుస్తోంది.
‘ఆర్థిక సాయం వద్దు
ఈ నేపథ్యంలో షాపూర్ తమ్ముడు ఘామీ జద్రాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తమకు ఆర్థిక సాయం అక్కర్లేదని.. తన సోదరుడి ఆరోగ్యం బాగుపడేలా ప్రార్థిస్తే చాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఆ దేవుడి దయ వల్ల ఆర్థికంగా మా కుటుంబం పటిష్టంగానే ఉంది. మాకు ఎలాంటి ఆర్థిక సహాయం అక్కర్లేదు.
దయచేసి అందరూ ప్రార్థించండి
మా అన్నయ్య బతకాలని దయచేసి అందరూ ప్రార్థించండి. మీ ప్రార్థనల్లో తనకూ చోటు ఇవ్వండి’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా షాపూర్ జద్రాన్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. తెల్ల రక్తకణాల సంఖ్య పూర్తిగా పడిపోయింది. అతడి రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఈ క్రమంలో అఫ్గన్ నుంచి భారత్‌కు తీసుకువచ్చి అత్యాధునిక చికిత్స అందిస్తున్నారు.
ఇక్కడి వైద్యులు అద్భుతం
ఈ విషయం గురించి ఘామి జద్రాన్ మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్‌లో ఉన్న మా డాక్టర్.. మా అన్నయ్యను భారత్‌కు తీసుకువెళ్తే ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని చెప్పారు. అందుకే ఢిల్లీకి తీసుకువచ్చాము. భారత్‌లో అత్యుత్తమ వైద్య సదుపాయాలు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. అందుకే మేము ఇక్కడికి వచ్చాము.

ఇక్కడి వైద్యులు మా అన్నయ్యను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అతడిని హీరోగా అభివర్ణిస్తూ సానుకూల దృక్పథం నింపుతున్నారు. వాళ్లంతా అనుభవజ్ఞులైన వైద్యులు. ఇక్కడి ఆస్పత్రి గొప్పగా ఉంది. డాక్టర్లకు ధన్యవాదాలు’’ అని తెలిపాడు.
వాళ్లంతా అండగా ఉన్నారు
ఇక అఫ్గనిస్తాన్ క్రికెట్ బృందం తమకు అండగా ఉందన్న ఘామీ జద్రాన్.. ‘‘రాయీస్ అహ్మద్‌జాయ్, నవ్రోజ్ మంగళ్, మొహ్మద్ నబీ అందరూ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అన్నయ్య గురించి సమాచారం తెలుసుకుంటున్నారు. ప్రపంచకప్ సమయంలో రషీద్ ఖాన్, ఇతర జట్టు సభ్యులు ఆస్పత్రికి వచ్చి అన్నయ్యను చూసి వెళ్లారు.
రషీద్ ఖాన్ ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నాడు. ఢిల్లీ, ముంబైలలో ఐపీఎల్ మ్యాచ్‌లు ఉన్నపుడు అల్లా ఘజన్‌ఫర్ కూడా ఆస్పత్రికి వచ్చి వెళ్లాడు. అతడు ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు. ఒకవేళ అవసరమైతే మా అన్నయ్యను అంబానీ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిద్దాం అని చెప్పాడు. అఫ్గనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కూడా ఫోన్ చేసి మాతో మాట్లాడారు’’ అని తెలిపాడు.
చదవండి: లారాను గుర్తు చేస్తున్నాడు.. కానీ అది నేర్చుకోకుంటే కష్టమే: ఆసీస్ దిగ్గజం


