‘లారాను గుర్తు చేస్తున్నాడు.. కానీ అది నేర్చుకోకుంటే కష్టమే’ | I See Glimpses Of Brian Lara But: Vaibhav Sooryavanshi Wows Allan Border | Sakshi
Sakshi News home page

లారాను గుర్తు చేస్తున్నాడు.. కానీ అది నేర్చుకోకుంటే కష్టమే: ఆసీస్‌ దిగ్గజం

Apr 23 2026 5:57 PM | Updated on Apr 23 2026 7:03 PM

I See Glimpses Of Brian Lara But: Vaibhav Sooryavanshi Wows Allan Border

భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీపై ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్‌ బోర్డర్‌ ప్రశంసలు కురిపించాడు. ఇంత చిన్న వయసులో అతడు అంతలా బంతిని బాదడం తనను ఆశ్చర్యపరుస్తోందన్నాడు. ఇంత వరకు తాను ఇలాంటి ఆటగాడిని చూడలేదంటూ కొనియాడాడు. అయితే, అదే సమయంలో వైభవ్‌ చేస్తున్న తప్పును కూడా బోర్డర్‌ ఎత్తి చూపాడు.

పరుగుల వరద
పద్నాలుగేళ్ల వయసులోనే వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అద్భుతాలు సృష్టించిన సంగతి తెలిసిందే. బిహార్‌కు చెందిన ఈ పిల్లాడు దేశీ క్రికెట్‌లో పరుగుల వరద పారించి ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో రాజస్తాన్‌ రాయల్స్‌ గతేడాది రూ. 1.10 కోట్లకు వైభవ్‌ను కొని అరంగేట్రం చేయించింది.

విధ్వంసకర భారీ సెంచరీ
యాజమాన్యం నమ్మకం నిలబెట్టుకుంటూ పద్నాలుగేళ్లకే ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ (35 బంతుల్లో) చేసి.. అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. ఆ తర్వాత భారత్‌ అండర్‌-19 జట్టు తరఫునా అదరగొట్టాడు. ముఖ్యంగా వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌పై విధ్వంసకర భారీ సెంచరీ (175)తో రాణించి జట్టుకు ట్రోఫీ అందించాడు.

ఇక ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ తరఫున ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ విధ్వంస కొనసాగుతోంది. జస్‌ప్రీత్‌ బుమ్రా వంటి వరల్డ్‌క్లాస్‌ బౌలర్‌ను కూడా చితక్కొడుతూ... ఇప్పటికి ఏడు మ్యాచ్‌లలో 254 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌లలో టాప్‌-5లో కొనసాగుతున్నాడు.

అత్యద్భుతమైన ఆటగాడు
ఈ నేపథ్యంలో ఆసీస్‌ బ్యాటింగ్‌ దిగ్గజం అలెన్‌ బోర్డర్‌ వైభవ్‌ సూర్యవంశీని ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌ను చూస్తే తనకు వెస్టిండీస్‌ లెజెండ్‌ బ్రియన్‌ లారా గుర్తుకువస్తున్నాడని తెలిపాడు.

‘‘అతడు అత్యద్భుతమైన ఆటగాడు. గొప్ప ప్రతిభ. 14-15 ఏళ్ల వయసులోనే బంతిని ఇంత గొప్పగా బాదిన ఆటగాడిని నేను ఇంత వరకు చూడలేదు. అతడొక పవర్‌ హిట్టర్‌. అయితే, ఇప్పుడే అతడి భవిష్యత్తు గురించి అంచనా వేయలేము.

లారాను గుర్తు చేస్తున్నాడు.. కానీ
టెస్టు క్రికెటర్‌గా విజయవంతం అవుతాడా? లేడా? అనేది చెప్పలేను. అయితే, అతడిని చూస్తే మాత్రం నాకు బ్రియన్‌ లారా గుర్తుకువస్తున్నాడు. వైభవ్‌ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. మైదానంలో నలువైపులా అతడు బంతిని బాదగలగాలి. అంతేకాదు.. డిఫెన్స్‌ను మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది’’ అని అలెన్‌ బోర్డర్‌ మిడ్‌-డేతో పేర్కొన్నాడు.

చదవండి: ఐపీఎల్‌ వదిలి ఇక్కడికి వచ్చెయ్‌: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

Advertisement
 
Advertisement
Advertisement