ఐపీఎల్‌ వదిలి ఇక్కడికి వచ్చెయ్‌: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ | Jacob Bethell should leave IPL play County instead: Alastair Cook Know Why | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ వదిలి ఇక్కడికి వచ్చెయ్‌: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

Apr 23 2026 4:33 PM | Updated on Apr 23 2026 6:38 PM

Jacob Bethell should leave IPL play County instead: Alastair Cook Know Why

టీ20 ప్రపంచకప్‌-2026లో ఇంగ్లండ్‌ తరఫున సత్తా చాటాడు యువ క్రికెటర్‌ జేకబ్‌ బెతెల్‌. టీమిండియాతో సెమీ ఫైనల్లో 105 పరుగులతో దుమ్ములేపాడు. ఓ దశలో సూర్యకుమార్‌ సేన నుంచి మ్యాచ్‌ లాగేసుకున్నట్లు అనిపించినా.. ఆఖరికి భారత్‌ పైచేయి సాధించింది.

బెంచ్‌కే పరిమితం
ఇక ఈ టోర్నీ తర్వాత బెతెల్‌ ఐపీఎల్‌-2026 కోసం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టుతో చేరాడు. ఇప్పటికి ఆర్సీబీ ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లకు నాలుగు గెలిచింది. అయితే, ఇంత వరకు బెతెల్‌కు మాత్రం ఆడే అవకాశం రాలేదు. తుదిజట్టులో అతడికి ఒక్కసారి కూడా చోటు ద​‍క్కనేలేదు.

కాగా బెతెల్‌ సాధారణంగా టాపార్డర్‌లో ఆడతాడు. ఆర్సీబీలో ఇప్పటికే ఓపెనర్లుగా దిగ్గజ విరాట్‌ కోహ్లి, ఫిల్‌ సాల్ట్‌ పాతుకుపోయారు. ఇతర స్లాట్లు కూడా ఖాళీగా లేవు. ఇక విదేశీ ఆటగాళ్ల జాబితాలో సాల్ట్‌, టిమ్‌ డేవిడ్‌, రొమారియో షెఫర్డ్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌లకే ఆర్సీబీ ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో బెతెల్‌ బెంచ్‌కే పరిమితం అవుతున్నాడు.

ఓపెనర్‌గా బెస్ట్‌
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ బెతెల్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌ను వీడి ఇంగ్లండ్‌ దేశీ క్రికెట్‌ ఆడేందుకు తిరిగి రావాలని సూచించాడు. ‘‘సిడ్నీలో బౌలర్ల అటాక్‌ను ఎదుర్కొని టాపార్డర్‌లో అతడు అదరగొట్టాడు.

ఓపెనర్‌గా లేదంటే వన్‌డౌన్‌ బ్యాటర్‌గా రాణించగల సత్తా అతడికి ఉంది. కానీ అక్కడ ఏం జరుగుతోంది? బెతెల్‌కు ఓపెనింగ్‌ చేసే అవకాశం రావడం లేదు. అతడు బెంచ్‌ మీదే ఉండాల్సిన పరిస్థితి. పూర్తిగా ఖాళీగా ఉంటున్నాడు.

తిరిగి వచ్చెయ్‌
స్వదేశానికి తిరిగి వచ్చి కౌంటీ చాంపియన్‌షిప్‌లో వర్విక్‌షైర్‌ తరపున ఆడితే బాగుంటుంది’’ అని అలిస్టర్‌ కుక్‌ ఓ పాడ్‌కాస్ట్‌లో భాగంగా తన అభిప్రాయం పంచుకున్నాడు. టెస్టులకు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేందుకు ఈ ప్రాక్టీస్‌ ఉపయోగపడుతుందన్నాడు.

కాగా బెతెల్‌ ఇంగ్లండ్‌ దేశీ టోర్నీలో వర్విక్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ టోర్నీలో వర్విక్‌షైర్‌ మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని డివిజన్‌ వన్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది.   

చదవండి: SRH: కమిన్స్‌కు షాక్‌.. కెప్టెన్‌గా ఇషాన్‌ కొనసాగింపు!

Advertisement
 
Advertisement
Advertisement