SRH: కమిన్స్‌కు షాక్‌.. కెప్టెన్‌గా ఇషాన్‌ కొనసాగింపు! | End Of SRH Captaincy For Cummins; Harbhajan's Ishan Remark Stirs Debate | Sakshi
Sakshi News home page

SRH: కమిన్స్‌కు షాక్‌.. కెప్టెన్‌గా ఇషాన్‌ కొనసాగింపు!

Apr 23 2026 2:31 PM | Updated on Apr 23 2026 3:26 PM

End Of SRH Captaincy For Cummins; Harbhajan's Ishan Remark Stirs Debate

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు పూర్వ వైభవం తెచ్చిన ఘనత ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌కు దక్కుతుంది. మూడు సీజన్లుగా చతికిల పడిన ఎస్‌ఆర్‌హెచ్‌కు కమిన్స్‌ తన అద్భుతమైన కెప్టెన్సీతో జీవం పోశాడు. అతడి సారథ్యంలో 2024లో సన్‌రైజర్స్‌ ఫైనల్‌కు చేరింది.

వెన్నునొప్పితో..
ఇక గతేడాది పద్నాలుగింట ఆరు విజయాలతో.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో ముగించింది ఎస్‌ఆర్‌హెచ్‌. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది వెన్నునొప్పి కారణంగా కమిన్స్‌ సన్‌రైజర్స్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్‌, టీ20 ప్రపంచకప్‌ విజేత ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) కమిన్స్‌ స్థానంలో కెప్టెన్సీ చేపట్టాడు.

ఐపీఎల్‌-2026లో ఇషాన్‌ సారథ్యంలో ఏడు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్‌ నాలుగు గెలిచింది. ముఖ్యంగా సొంతమైదానం ఉప్పల్‌లో హ్యాట్రిక్‌ విజయాలతో సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లలో ఇషాన్‌ కెప్టెన్సీకి మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉంటే.. ఫిట్‌నెస్‌ సమస్యలను అధిగమించి కమిన్స్‌ (Pat Cummins) ఇటీవలే జట్టుతో చేరాడు.

ఈ క్రమంలో శనివారం రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌తో సన్‌రైజర్స్‌ తరఫున కమిన్స్‌ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ అంశం చర్చనీయాంశంగా మారగా.. టీమిండియా మాజీ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ ఇషాన్‌నే సారథిగా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు.

ఇషాన్‌ కిషన్‌నే కొనసాగించాలి
ఇక టీమిండియా స్పిన్‌ దిగ్గజం హర్భజన్‌ సింగ్‌ కూడా తాజాగా ఇషాన్‌కే మద్దతుగా నిలిచాడు. జియోహాట్‌స్టార్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘ప్యాట్‌ కమిన్స్‌ తిరిగి వచ్చినా ఇషాన్‌ కిషన్‌నే సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా కొనసాగించాలి. యువ నాయకుడికి మద్దతుగా నిలబడాలని యాజమాన్యం భావిస్తే ఇలా చేయడమే సరైంది.

కారణం ఇదే
కమిన్స్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ను 2024లో ఫైనల్‌కు చేర్చిన మాట నిజమే. అయితే, ప్రస్తుతం ఇషాన్‌ నాయకత్వంలోనూ జట్టు మంచి ఫలితాలు సాధిస్తోంది. బౌలర్లు, ఇతర ఆటగాళ్లకు అతడితో మంచి సమన్వయం కుదిరింది. కాబట్టి ఇషాన్‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తే సన్‌రైజర్స్‌కు ప్రయోజనం చేకూరుతుంది’’ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు. 

కాగా చాన్నాళ్లుగా గాయం వల్ల ఆటకు దూరమైన కమిన్స్‌ పునరాగమనం చేయనున్నాడు. దీంతో అతడిపై కెప్టెన్సీ రూపంలో అదనపు భారం పడకుండా మేనేజ్‌మెంట్‌ చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.

చదవండి: BCCI: డబ్బు కక్కుర్తి.. టీమిండియా ప్లేయర్లను ‘చంపేస్తారా’?

Advertisement
 
Advertisement
Advertisement