BCCI: టీమిండియా ప్లేయర్లను ‘చంపేస్తారా’? | Stop This outrageous You Dont Need Money: Lalit Modi Lambasts BCCI | Sakshi
Sakshi News home page

BCCI: డబ్బు కక్కుర్తి.. టీమిండియా ప్లేయర్లను ‘చంపేస్తారా’?

Apr 23 2026 1:26 PM | Updated on Apr 23 2026 2:36 PM

Stop This outrageous You Dont Need Money: Lalit Modi Lambasts BCCI

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీరుపై ఐపీఎల్‌ సృష్టికర్త లలిత్‌ మోదీ మండిపడ్డాడు. ‘డబ్బు కోసం కక్కుర్తి పడి.. ఆటగాళ్లను చంపకండి’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. బోర్డు మెదడుతో కాకుండా మనసుతో స్పందించి తమ ఆటగాళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.

బిజీ షెడ్యూల్‌
కాగా గత కొన్నేళ్లుగా టీమిండియా బిజీ షెడ్యూల్‌తో తలమునకలై ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్‌-2026 ముగిసిన వెంటనే స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో టెస్టు మ్యాచ్‌ తర్వాత ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఆ తర్వాత ఐర్లాండ్‌, జింబాబ్వే తదితర టూర్లు.

ఇక ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌ మే 31న ముగియనుండగా.. జూన్‌ 6న అఫ్గన్‌తో టెస్టు మ్యాచ్‌ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir) బిజీ షెడ్యూల్‌పై గుర్రుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ‘‘జట్టులోని చాలా మంది ఆటగాళ్లు మే 31 వరకు ఐపీఎల్‌తోనే బిజీగా గడపుతారు.

స్వల్ప వ్యవధిలోనే జాతీయ జట్టు తరఫున విధుల్లో చేరడం ఒత్తిడిని పెంచుతుంది’’ అని గంభీర్‌ బోర్డు వద్ద తన వాదనను వినిపించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్తను ఓ యూజర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. లలిత్‌ మోదీ తీవ్రంగా స్పందించాడు.

టీమిండియా ప్లేయర్లను ‘చంపేస్తారా’?
‘‘గంభీర్‌ వాదనతో నేను ఏకీభవిస్తాను. విరామం లేని షెడ్యూల్‌తో బీసీసీఐ తమ ఆటగాళ్లను చంపినంత పని చేస్తోంది. ఇలాంటి భయంకరమైన విధానాన్ని ఆపేయండి. ఆటగాళ్లను కాస్త ఊపిరి తీసుకోనివ్వండి. వాళ్లకు కూడా కుటుంబాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కాస్త ఆనందంగా గడపనివ్వండి.

భారీ ఆదాయానికి బీజం వేశాను
అయినా మీకు ఇప్పుడు అంతగా డబ్బు అవసరం ఏముంది? నేను ఇప్పటికే ఐపీఎల్‌ ద్వారా ఏడాదికి కావాల్సినంత ఆదాయం వచ్చేలా బీజం వేశాను కదా! ప్రపంచంలో అందరి కంటే బీసీసీఐ సంపన్న బోర్డు కావడానికి ఇదో కారణం. కాబట్టి మీరు డబ్బు గురించి బెంగ పడకండి.

ఆటగాళ్ల క్షేమం గురించి కూడా ఆలోచించండి. ప్రొఫెషనల్‌ సీఈఓను నియమించండి. భారీగా జీతం ఇచ్చి HRను పెట్టుకోండి. ఆటగాళ్ల సెల్ఫ్‌ డెవలప్‌మెంట్‌పై కూడా కొంచెం ఖర్చు చేయండి. స్టేడియాలను మరింత గొప్పగా తీర్చిదిద్దండి. ప్రేక్షకులకు వరల్డ్‌క్లాస్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించండి.

మనసుతో ఆలోచించండి
ఆటగాళ్లేమీ యంత్రాలు కాదు. మీరు మెదడుతో కాకుండా మనసుతో కూడా ఆలోచించండి’’ అని ఎక్స్‌ వేదికగా లలిత్‌ మోదీ బీసీసీఐ తీరును తూర్పారబట్టాడు. 

కాగా లలిత్‌ మోదీ ఆలోచనతో 2008లో ఐపీఎల్‌ రూపుదిద్దుకోగా.. లీగ్‌ తొలి చైర్మన్‌గా అతడే వ్యవహరించాడు. కానీ కొన్నేళ్లకే మనీ లాండరింగ్‌ ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్నాడు. ఆర్థిక నేరగాడిగా ముద్రపడి.. లండన్‌కు పారిపోయి దశాబ్దకాలానికిపైగా అక్కడే నివాసం ఉంటున్నాడు. 

చదవండి: ఇప్పటికీ బాధపడుతున్నా: రోహిత్‌కు మాజీ కెప్టెన్‌ క్షమాపణలు

Advertisement
 
Advertisement
Advertisement