టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ. టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లను అతడి సారథ్యంలోనే భారత్ గెలుచుకుంది. దిగ్గజ కెప్టెన్‌గా ఎదిగిన రోహిత్‌కు.. కెరీర్ ఆరంభంలో ఒకానొకనాడు జట్టులో చోటే కరువైంది.
ముఖ్యంగా 2011 వన్డే వరల్డ్‌కప్ సమయంలో సెలక్టర్లు రోహిత్ శర్మను పక్కనపెట్టారు. ఈ విషయం గురించి టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాడు రోహిత్‌ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు వెల్లడిస్తూ.. అతడిని క్షమాపణలు కోరాడు.
బాధపడుతూనే ఉన్నాను
‘‘ప్రతి ఇంటర్వ్యూలో తాను 2011 వరల్డ్‌కప్ ఆడటం మిస్సయ్యానని రోహిత్ చెబుతూ ఉన్నాడు. నిజంగా అతడి విషయంలో ఆరోజు జరిగిన దానిపట్ల నేటికీ నేను బాధపడుతూనే ఉన్నాను. గతేడాది అతడిని కలిసి.. ‘సారీ బాస్.. ఆనాడు మేము ఉద్దేశపూర్వకంగా ఏదీ చేయలేదు’ అని చెప్పాను.
అప్పుడు మేము ఆల్‌రౌండ్ ప్రతిభ గల వాళ్లకే పెద్దపీట వేయాలని భావించాము. 1983 మాదిరే ఈ టోర్నీలో ఆడించాలనే ఆలోచనతో ఉన్నాము. మేము ఊహించినట్లుగానే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నిలిచాడు.
అందుకే రోహిత్‌ను పక్కనపె ట్టాల్సి వచ్చింది
కొన్ని మ్యాచ్‌లలో హాఫ్ ఆల్‌రౌండర్లు కూడా రాణించారు. సెహ్వాగ్, సచిన్, సురేశ్ రైనా కూడా కొన్ని ఓవర్లు బౌలింగ్ చేశారు. యూసఫ్ పఠాన్ సైతం హాఫ్ ఆల్‌రౌండరే. ఈ హాఫ్ ఆల్‌రౌండర్ కాన్సెప్టులో పడి రోహిత్ శర్మను పక్కనపెట్టాల్సి వచ్చింది.
పాపం అతడికి జట్టులో చోటు దక్కలేదు. నిజానికి 2011 వరల్డ్‌కప్ టోర్నీలో ఆడేందుకు అతడు అర్హుడే. కానీ జట్టు ప్రయోజనాల దృష్ట్యా అతడిని ఎంపిక చేయలేకపోయాము’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు. కాగా 2011లో ధోని సారథ్యంలో టీమిండియా టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే.


