టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి బ్రాండ్ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ ద్వారా కీర్తిని గడించిన ఈ ఢిల్లీ స్టార్.. వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. స్వయంగా ఎన్నో బ్రాండ్లు కూడా కలిగి ఉన్నాడు. వన్8 కమ్యూన్ ద్వారా ఆతిథ్య రంగంలోనూ కోహ్లి అడుగుపెట్టాడు.
దేశ వ్యాప్తంగా
దేశ వ్యాప్తంగా ఈ రెస్టారెంట్ చైన్ వ్యాపించి ఉంది. ఢిల్లీ, గురుగ్రామ్, పుణె, కోల్‌కతా, నోయిడా, హైదరాబాద్ వంటి సిటీల్లో వన్8 కమ్యూన్‌కు శాఖలు ఉన్నాయి. అయితే, బెంగళూరులో ఉన్న వన్8 కమ్యూన్ బ్రాంచీ కోర్టు ఆదేశాలతో మూతపడింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం..
అద్దె కట్టకుండా..
బెంగళూరులో చిన్నస్వామి స్టేడియానికి సమీపంలో వన్8 కమ్యూన్ రెస్టారెంట్ ఉంది. ట్రియో హిల్స్ హాస్పిటాలిటీ దీనిని నిర్వహిస్తూ కోహ్లితో భాగస్వామ్యంలో ఉంది. అయితే, గత ఆర్నెళ్లుగా అద్దె చెల్లించడంలో ట్రియో హిల్స్ విఫలమైంది. మెయింటెనెన్స్ కూడా బాకీ పడింది. దీంతో సదరు భవన నిర్మాణ యజమాని ఈ విషయమై సివిల్ కోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో అద్దె చెల్లించి, యజమానితో సమస్యలు పరిష్కారం చేసుకునేంత వరకు రెస్టారెంట్‌ను మూసివేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. వివిధ నిబంధనల ఉల్లంఘన కారణంగా బృహత్ బెంగళూరు మహానగర పాలికే కూడా ఇప్పటికే ఈ రెస్టారెంట్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
బంధం తెంచుకున్న కోహ్లి
ఈ రెస్టారెంట్ అగ్రి పమాద భద్రతకు సంబంధించి నిరభ్యంతర పత్రం (NOC) కూడా పొందలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి ఇప్పటికే తన బ్రాండ్ పేరును తొలగించాల్సిందిగా ట్రియో హిల్స్‌కు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కస్టమర్ల రాక తగ్గిపోయి ఆర్థికంగానూ సదరు రెస్టారెంట్ నష్టాల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్-2026తో బిజీగా ఉన్నాడు. ఆర్సీబీ తరఫున ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్‌లలో కలిపి 247 పరుగులు సాధించాడు. మరోవైపు.. ఆర్సీబీ ఆరింట నాలుగు విజయాలతో జోరు మీద ఉంది.


