బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌తో బిజీగా ఉంది. కివీస్‌తో సొంతగడ్డపై బంగ్లా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే రెండు వన్డేలు పూర్తి కాగా కివీస్, బంగ్లా తలా ఒక మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి.
ఫామ్‌లో ఉన్న వాళ్లకు విశ్రాంతి?
ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తమ జట్టును తాజాగా ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టు నుంచి నహీద్ రాణా, ముస్తాఫిజుర్ రహమాన్, టస్కిన్ అహ్మద్‌లను తప్పించింది. అబ్దుల్ గఫార్ సక్లెయిన్ అనే అన్‌క్యాప్డ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌కు మాత్రం తొలిసారి జట్టులో చోటు కల్పించింది.
అదే విధంగా.. ఆసియా క్రీడలు-2023లో బంగ్లాకు ఆడిన రిపర్ మొండాల్‌కు కూడా మళ్లీ పిలుపునిచ్చారు సెలక్టర్లు. ఈ జట్టుకు లిటన్ దాస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. మొహమ్మద్ సైఫ్ హసన్ వైస్ కెప్టెన్.
పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్ బోర్డు
బంగ్లా పేసర్ నహీద్ రాణా ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. కివీస్‌తో తొలి వన్డేలో ఒక వికెట్ తీయగలిగిన 23 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్.. రెండో వన్డేలో ఐదు వికెట్లతో చెలరేగాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించి బంగ్లాకు గెలుపు అందించాడు.
అలాంటి ఆటగాడిని బంగ్లా బోర్డు టీ20 జట్టు నుంచి తప్పించడం గమనార్హం. కాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఆడేందుకే నహీద్‌కు జాతీయ జట్టు నుంచి విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. కాగా పీఎస్‌ఎల్-2026లో నహీద్ రాణా పెషావర్ జెల్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
జాతీయ జట్టును కాదని.. PSL వైపు మొగ్గు
ఇప్పటికే ఆ జట్టు తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడి ఏడు వికెట్లు తీశాడు. అయితే, వన్డే సిరీస్ ఆడేందుకు స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఇదిలా ఉంటే.. పెషావర్ జెల్మీ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరింది. ఈ నేపథ్యంలోనే టీ20 సిరీస్‌ను కాదని మరీ.. పీఎస్‌ఎల్ కోసం నహీద్‌ను పాకిస్తాన్‌కు పంపనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ముస్తాఫిజుర్ విషయంలోనూ ఇదే జరిగినట్లు సమాచారం. కాగా చమురు సంక్షోభం కారణంగా పీఎస్‌ఎల్‌ను స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB).
ఇక సీజన్ ఆరంభానికి ముందు అఫ్గనిస్తాన్‌పై పాక్ దాడుల నేపథ్యంలో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు నెలకొనగా విదేశీ ఆటగాళ్లు ఇక్కడికి వచ్చేందుకు భయపడ్డారు. ఈ క్రమంలో కరాచీ, లాహోర్ వేదికలకు మాత్రమే మ్యాచ్‌లను పరిమితం చేసింది. ఇలాంటి సమయంలో నహీద్ రాణా వంటి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను పంపడం ద్వారా పీఎస్‌ఎల్‌కు కాస్త ఊరట దక్కేలా చేసింది బంగ్లా బోర్డు.
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు
లిటన్ దాస్ (కెప్టెన్), మొహమ్మద్ పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తాంజిద్ హసన్ తమీమ్, మొహమ్మద్‌సైఫ్ హసన్ (వైస్ కెప్టెన్), షమీమ్ హొస్సేన్ పట్వారీ, తౌహిద్ హృదయ్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, రిషాద్ హొసేన్, షోరిఫుల్ ఇస్లాం, తాంజిమ్ హసన్ సకీబ్, రిపన్ మొండాల్, మొహమ్మద్ సైఫుద్దీన్, అబ్దుల్ గఫార్ సక్లెయిన్.


