SRH vs DC: ఆ రెండు తప్పులే మా కొంపముంచాయి | Cost Us Dearly: Axar Patel Criticize KL Rahul DC Star Blunders After Loss SRH | Sakshi
Sakshi News home page

SRH vs DC: ఆ రెండు తప్పులే మా కొంపముంచాయి

Apr 22 2026 10:08 AM | Updated on Apr 22 2026 10:33 AM

Cost Us Dearly: Axar Patel Criticize KL Rahul DC Star Blunders After Loss SRH

అక్షర్‌ పటేల్‌ (PC: BCCI)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో పరాజయంపై ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ స్పందించాడు. అభిషేక్‌ శర్మ విషయంలో తాము చేసిన ఫీల్డింగ్‌ తప్పిదాలే కొంపముంచాయని పేర్కొన్నాడు. ఐపీఎల్‌-2026లో భాగంగా ఉప్పల్‌ వేదికగా ఢిల్లీ మంగళవారం సన్‌రైజర్స్‌తో తలపడింది.

సొంతమైదానంలో టాస్‌ ఓడిన సన్‌రైజర్స్‌ ఢిల్లీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ అజేయ సెంచరీ (68 బంతుల్లో 135)తో చెలరేగగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌ మెరుపులు (13 బంతుల్లో 37 నాటౌట్‌) మెరిపించాడు. ఫలితంగా సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది.

రెండుసార్లు మిస్‌
అయితే, తొమ్మిదో ఓవర్‌లో అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో తొలి బంతికి అభిషేక్‌ను రనౌట్‌ చేసే అవకాశం రాగా.. ఢిల్లీ వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ ఛాన్స్‌ మిస్‌ చేశాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్‌.. 14వ ఓవర్లో నటరాజన్‌ బౌలింగ్‌లో బంతిని గాల్లోకి లేపగా.. నితీశ్‌ రాణా క్యాచ్‌ మిస్‌ చేశాడు.

ఆ రెండు తప్పులే మా కొంపముంచాయి
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 195 పరుగులే చేసింది. దీంతో 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ఢిల్లీ సారథి అక్షర్‌ పటేల్‌ మాట్లాడుతూ.. ‘‘అభిషేక్‌ను రనౌట్‌ చేసే అవకాశం వదులుకున్నాం. క్యాచ్‌ కూడా జారవిడిచాము. ఈ రెండు తప్పిదాల వల్లే మేము మూల్యం చెల్లించాల్సి వచ్చింది.

ఒకవేళ ఈ రెండింటిలో ఒక్క సందర్భంలో మేము అవకాశం సద్వినియోగం చేసుకుంటే పరిస్థితి వేరుగా ఉండేది. అయితే, అతడు మా తప్పిదాలను తనకు అనుకూలంగా మలచుకుని పరుగులు రాబట్టాడు. మేము ఇంకాస్త మెరుగ్గా ఫీల్డింగ్‌ చేయాల్సింది. కానీ ఈరోజు అలా చేయలేకపోయాము’’ అని అక్షర్‌ పటేల్‌ విచారం వ్యక్తం చేశాడు.

చదవండి: ‘మమ్మల్ని ఆపడం ఎవరివల్లా కాదు’

Advertisement
 
Advertisement
Advertisement