‘మమ్మల్ని ఆపడం ఎవరివల్లా కాదు’ | Tilak Varma on his batting in gujarat titans match | Sakshi
Sakshi News home page

‘మమ్మల్ని ఆపడం ఎవరివల్లా కాదు’

Apr 22 2026 1:03 AM | Updated on Apr 22 2026 1:03 AM

Tilak Varma on his batting in gujarat titans match

కలిసికట్టుగా రాణిస్తే ముంబైని ఆపలేరన్న తిలక్‌వర్మ

పరిస్థితులకు తగ్గట్లు ఆడటం వల్లే సెంచరీ సాధించానని వ్యాఖ్య  

న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్‌ జట్టులో చాలా మంది ప్రపంచకప్‌ విజేతలు ఉన్నారని... వారు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే తమ జట్టును ఆపడం ఎవరి వల్లా కాదని మిడిలార్డర్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ అన్నాడు. ఐపీఎల్‌లో భాగంగా సోమవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జయభేరి మోగించడంలో తిలక్‌ వర్మ కీలక పాత్ర పోషించాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన ఈ హైదరాబాదీ లెఫ్ట్‌ హ్యాండర్‌... ఆ తర్వాత భారీ షాట్‌లతో రెచ్చిపోయి అజేయ సెంచరీతో ముంబై జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఆ తర్వాత బౌలర్లు సమష్టి కృషితో సత్తాచాటడంతో గుజరాత్‌పై ముంబై ఘనవిజయం సాధించింది. 

మ్యాచ్‌ అనంతరం తిలక్‌ మాట్లాడుతూ... ‘ఈ ప్రదర్శన నాకు, జట్టుకు ఎంతో ముఖ్యమైంది. గత నాలుగైదు మ్యాచ్‌ల్లో ఏదీ కలిసిరాలేదు. ఎక్కువ సమయం క్రీజులో గడిపేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో గుజరాత్‌తో మ్యాచ్‌లో పరిస్థితులకు తగ్గట్లు ఆడాలని అనుకున్నా... అది ఫలితాన్నిచ్చింది’ అని అన్నాడు. ఈ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిన ముంబై ఇండియన్స్‌... తిలక్‌ మెరుపులతో తిరిగి గెలుపు బాట పట్టింది. 

తిలక్‌ వర్మకు ఐపీఎల్‌లో ఇదే తొలి శతకం కాగా... ఈ జోరు సీజన్‌ మొత్తం కొనసాగించాలనుకుంటున్నట్లు అతడు వెల్లడించాడు. ‘అహ్మదాబాద్‌ వేదికగా ముంబై మ్యాచ్‌ ఎప్పుడు జరిగినా... ఇలాంటి పిచ్‌పైనే సాగుతుంది. ఇతర పిచ్‌లతో పోల్చుకుంటే అది కాస్త నెమ్మదిగా ఉంది. బంతి తక్కువ ఎత్తులో వస్తుండటంతో స్ట్రెయిట్‌గా ఆడాలని నిర్ణయించుకున్నా. దీంతో సులువుగా పరుగులు రాబట్టగలిగా. సాధారణంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేయడాన్ని ఇష్టపడతా. 

కానీ జట్టుకు అవసరమైనప్పుడు పరిస్థితులకు తగ్గట్లు ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. చిన్నప్పటి నుంచి దీని కోసం ఎంతో సాధన చేశా. ఎక్కువ ఆలోచించడం లేదు. చిన్నచిన్న లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని అందుకోవడమే మా పని. ఒక్కో మ్యాచ్‌పైనే దృష్టి పెట్టాం. మా సామర్థ్యం ఏంటో మాకు తెలుసు. జట్టులో చాలా మంది ప్రపంచకప్‌ గెలిచిన ప్లేయర్లు ఉన్నారు. అనుభవం, నైపుణ్యానికి కొదవలేదు. 

మేమంతా కలిసికట్టుగా రాణిస్తే... ముంబై ఇండియన్స్‌ను ఆపడం ఎవరి తరం కాదు. బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో హార్దిక్‌ పాండ్యా ఉత్సాహపరిచాడు. ‘నువ్వు చేయగలవు’ అని పదే పదే చెప్తూ నాలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఆ సమయంలో ‘ప్రశాంతంగా ఉండు... మిగిలిందంతా నేను చూసుకుంటా’ అని చెప్పాను. మొత్తానికి ఈ విజయం జట్టులో జోష్‌ నింపింది’ అని తిలక్‌ వివరించాడు. 

Advertisement
 
Advertisement
Advertisement