ఢిల్లీ, ముంబైలకు తప్పిన పెనుముప్పు  | Dawood ISI nexus exposed 9 arrested | Sakshi
Sakshi News home page

ఢిల్లీ, ముంబైలకు తప్పిన పెనుముప్పు 

May 30 2026 3:04 PM | Updated on May 31 2026 5:15 AM

Dawood ISI nexus exposed 9 arrested

ఐఎస్‌ఐ, దావూద్‌ ముఠా ఉగ్ర కుట్ర ఛేదించిన ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ 

మూడు ప్రాంతాల్లో 8 మంది అరెస్ట్‌ 

మత స్థలాలు, కీలక కట్టడాలపై దాడులకు స్కెచ్‌ 

భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతోపాటు వాణిజ్య రాజధాని ముంబైకి పెను ముప్పు తప్పింది. కీలక ప్రాంతాల్లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు పన్నిన కుట్ర భగ్నమైంది. పాకిస్తాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ, ముంబై మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం ముఠా, గ్యాంగ్‌స్టర్‌ షహజాద్‌ భట్టి కలిసి విధ్వంసానికి వేసిన పథకాన్ని ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు భగ్నం చేశారు. 

పంజాబ్, హరియాణాల్లోనూ వీరు పేలుళ్లు, విధ్వంసానికి ప్రయత్నిస్తున్నట్లు తేలింది. ఇందులో పాలుపంచుకున్న 8 మంది ఉగ్రవాదులను శనివారం అరెస్ట్‌ చేశారు. పెద్ద సంఖ్యలో ఆయుధాలు, హ్యాండ్‌ గ్రెనేడ్లు, అత్యాధునిక పేలుడు పదార్థాలను స్వాదీనం చేసుకున్నారు. ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించడంతోపాటు దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలి్పంచడమే వీరి లక్ష్యమని అధికారులు తెలిపారు. తాజా అరెస్టులతో దేశ రాజధానికి పెను ముప్పు తప్పినట్లయిందని వెల్లడించారు. ఈ పరిణామం నేపథ్యంలో దేశంలోని సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

ఉగ్రమాడ్యూల్‌పై నిఘా కన్ను 
పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ సూచనల మేరకు ఢిల్లీ, ముంబై, ఇతర ముఖ్య నగరాల్లోని కీలక కట్టడాలు, భద్రతా బలగాల స్థావరాలు, ప్రముఖ ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా భారీ విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు పథకం వేసినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో, చాలా కాలంగా నిఘా వర్గాలు ఈ ఉగ్ర మాడ్యూల్‌ కదలికలపై ఓ కన్నేసి ఉంచాయి. దాడులకు సమాయత్తమవుతున్నట్లు ఉప్పందడంతో స్పెషల్‌ సెల్‌ రంగంలోకి దిగింది. పక్కా ప్రణాళికతో ఆకస్మికంగా దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుంది. ఇంకెవరికైనా ఈ మాడ్యూల్‌తో సంబంధాలున్నాయా అన్న కోణంలోనూ స్పెషల్‌ సెల్‌ పోలీసులు విచారణ చేపట్టారు.   
మున్నా జింగ్రా ప్రమేయం 
ఈ కేసులో దావూద్‌ ఇబ్రహీం, ఛోటా షకీల్‌ల ప్రధాన అనుచరుడైన మున్నా జింగ్రా కీలకంగా ఉన్నట్లు తేలడంతో పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. నిందితులకు, అండర్‌వరల్డ్‌కు మధ్య సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నారు. జింగ్రా పాకిస్తాన్‌లో ఉంటూ సయ్యద్‌ ముదస్సర్‌ హుస్సేన్‌ పేరుతో ఉగ్ర కార్యకలాపాలను నడుపుతున్నట్లు భావిస్తున్నారు. 2000 సంవత్సరంలో ఛోటా రాజన్‌పై జరిగిన దాడిలో ఇతడి ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement