‘నాకు చిర్రెత్తుకొచ్చి.. ఆసీస్‌ను సవాల్‌ చేశా’

Ashwin Remembers Sledging Australia Opener Matt Renshaw - Sakshi

మూడేళ్ల నాటి మ్యాచ్‌ను గుర్తు చేసుకున్న అశ్విన్‌

వంద పరుగులు కూడా చేయలేరని చాలెంజ్‌ చేశా

న్యూఢిల్లీ: దాదాపు మూడేళ్ల క్రితం జరిగిన ఘటనను టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌  రవిచంద్రన్‌ అశ్విన్‌ గుర్తు చేసుకున్నాడు. భారత్‌ పర్యటనకు ఆస్ట్రేలియా వచ్చిన క్రమంలో ఆ దేశ ఆటగాడు మ్యాట్‌ రెన్‌షాతో జరిగిన స్లెడ్జింగ్‌ను నెమరువేసుకున్నాడు. బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో రెన్‌ షా తనను రెచ్చగొట్టాడని, దానికి ప్రతిగా సమాధానం చెప్పి తన పంతం నెగ్గించుకున్నానని అశ్విన్‌ తెలిపాడు. ‘ ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌ హోరాహోరీగా సాగింది. ఆ మ్యాచ్‌ తొలి  అంచె అంతా ఆసీస్‌దే పైచేయి అయ్యింది. కానీ తర్వాత మేము పుంజుకుని ఆసీస్‌ను కంగుతినిపించాం. ఈ క్రమంలోనే రెన్‌ షాతో​ తీవ్ర స్థాయిలో  వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ వాగ్వాదంలో రెన్‌ షాకు సవాల్‌ విసిరాను. అందుకు కారణం ఉంది. రెన్‌ షా నన్ను రెచ్చగొట్టాడు. మేమే టాప్‌లో ఉన్నామంటూ నోటికి పని చెప్పే యత్నం చేశాడు. దాంతో నాకు ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది. (అతనొక మూర్చ రోగి: పీసీబీ మాజీ చైర్మన్‌)

అప్పటికి నేను వికెట్లు సాధించకపోవడంతో కోపం డబుల్‌ అయ్యింది. రెన్‌ షాకు సమాధానం ఇస్తూ.. ఇక పరుగులు చేయడం ఆపేస్తే మంచిది అన్నాను. మీరు పైచేయిగా ఉన్నప్పుడు పరుగులు చేయాల్సిన అవసరం ఏమిటి అని అడిగా. రెండో ఇన్నింగ్స్‌లో మీకు చుక్కలు చూపిస్తా అన్నా. తొలి ఇన్నింగ్స్‌లో మీరు సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయకపోతే..  రెండో ఇన్నింగ్స్‌లో వంద పరుగులు కూడా చేయనివ్వం అని చాలెంజ్‌ చేశా. ఒకవైపు ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయాన్‌ చెలరేగుతుంటే, నాకు వికెట్లు దక్కలేదు. దాంతో నాలో  అసహనం ఎక్కువైంది. ఆ సమయంలో ప్రధాన కోచ్‌గా ఉన్న అనిల్‌ కుంబ్లే నాకు కొన్ని సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు. అనిల్‌ భాయ్‌తో ఒక విషయం చెప్పా. ఓపిక పడదాం.. ఏమీ కాదు.. బంతి స్పిన్‌ కావడానికి సమయం పట్టొచ్చు అన్నాను. కుంబ్లే కూడా నాతో ఏకీభవించాడు. నేను ఎటువంటి ఒత్తిడి తీసుకురావడం లేదని చెప్పారు. దాంతో నాపై ఎటువంటి ఒత్తిడి పడకపోవడంతో స్వేచ్ఛగా బంతులు వేసి ఆసీస్‌ను సత్తాచూపెట్టా. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు సాధించి ఆసీస్‌ నడ్డివిరిచా’ అని అశ్విన్‌ చెప్పుకొచ్చాడు. (గేల్‌.. ఇక నీ కామెంట్స్‌ చాలు..!)

ఆ మ్యాచ్‌లో భారత్‌ గెలిచి రేసులో నిలిచింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకు ఆలౌటైతే, ఆసీస్‌ 276 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 274 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆసీస్‌కు 188 పరుగుల టార్గెట్‌ను మాత్రమే మనోళ్లు నిర్దేశించారు. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ ఆరు వికెట్లతో చెలరేగడంతో ఆసీస్‌ను 112 పరుగులకు కుప్పకూలింది. దాంతో  టీమిండియా 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఉమేశ్‌ యాదవ్‌ రెండు వికెట్లు సాధించగా, ఇషాంత్‌ శర్మ, రవీంద్ర జడేజాలు తలో వికెట్‌ తీశారు. ఆ నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-1తో గెలుచుకుంది. తొలి టెస్టులో ఆసీస్‌ విజయం సాధించగా, రెండో టెస్టులో భారత్‌ గెలిచాయి. మూడో టెస్టు డ్రా కాగా, నాల్గో టెస్టులో భారత్‌నే విజయం వరించింది. (రాస్‌ టేలర్‌కు ‘టాప్‌’ అవార్డు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top