గేల్‌.. ఇక నీ కామెంట్స్‌ చాలు..!

Jamaica Tallawahs Hit Back At Chris Gayle - Sakshi

నిన్ను తీసివేయడానికి సవాలక్ష కారణాలున్నాయి

బహిరంగ విమర్శలు సరికాదు

నిన్ను తప్పించడంలో శర్వాణ్‌ పాత్ర లేదు: జమైకా తలవాస్‌

ఆంటిగ్వా: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో జమైకా తలవాస్‌ జట్టు నుంచి తనను తొలగించడానికి ఆ జట్టు కోచ్‌ రామ్‌ నరేశ్‌ శర్వాణ్‌ కారణమంటూ క్రిస్‌ గేల్‌ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఆ జట్టు తనను కొనసాగించకపోవడానికి రామ్‌ నరేశ్‌ పాత్ర కీలకమని,అతను కరోనా కంటే ప్రమాదమని గేల్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.  పాము కంటే శర్వాణ్‌ చాలా విషపూరితమన్నాడు. వెన్నుపొటు పొడవడంలో రామ్‌ నరేశ్‌ సిద్ధ హస్తుడని విమర్శించాడు. ఈ వాఖ్యలను జమైకా తలవాస్‌ ఖండించింది. ఇక గేల్‌ తన వ్యాఖ్యలకు ఫుల్‌స్టాప్‌ పెడితే మంచిదని హెచ్చరించింది. ఒక ఆటగాడ్ని రీటైన్‌ చేసుకోవాలా.. వద్దా అనే విషయంలో ఫ్రాంచైజీతో పాటు సెలక్షన్‌ కమిటీ పాత్ర కూడా ఉంటుందనే విషయాన్ని గేల్‌ గ్రహించాలని చురకలంటించింది. ఇక్కడ గేల్‌ను తప్పించడంలో రామ్‌ నరేశ్‌ శర్వాణ్‌ పాత్ర ఏమీలేదని స్పష్టం చేసింది. బహిరంగ ప్రకటనలు చేసేముందు కాస్త సంయమనం పాటిస్తే మంచిదని గేల్‌కు హితబోధ చేసింది. ('ఇంత చెత్త ఫ్రాంచైజీని నేనెప్పుడు చూడలేదు')

‘ గేల్‌ కాస్త తగ్గి మాట్లాడితే మంచిది. నిన్ను తీసివేయడానిక సవాలక్ష కారణాలున్నాయి. బహిరంగ విమర్శలు సరికాదు. నిన్నుతప్పించడంలో శర్వాణ్‌ పాత్ర ఏమీ లేదు. ఇక్కడ సెలక్షన్‌ కమిటీ ఉంది.. ఫ్రాంచైజీ కూడా ఉంది. నిన్నుఫ్రాంచైజీ కొనసాగించకూడదని నిర్ణయించుకుంది. దాంతో కొనసాగించలేదు. అంతే కానీ ఏ ఒక్కరూ నిన్ను తీసివేయడానికి కారణం కాదు’ అని తలవాస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.2019లో జమైకా తలవాస్‌ జట్టులోకి తిరిగి వచ్చిన గేల్‌.. అంతకుముందు 2013 నుంచి 2016 వరకూ  ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. గతేడాది గేల్‌ తిరిగి జమైకాకు  వచ్చిన క్రమంలో మూడేళ్ల పాటు కాంటాక్ట్‌ కుదుర్చుకున్నాడు. తన సీపీఎల్‌ కెరీర్‌ను హోమ్‌ టౌన్‌ ఫ్రాంచైజీతోనే ముగించాలనే ఉద్దేశంతోనే జమైకాకు ఆడుతున్నానని గేల్‌ తెలిపాడు. అయితే తాజా సీజన్‌లో గేల్‌ను జమైకా తలవాస్‌ వదిలేసుకుంది. అతన్ని తిరిగి రీటైన్‌ చేయలేదు.దాంతో సెయింట్‌ లూసియా జట్టుతో గేల్‌ ఒప్పందం చేసుకున్నాడు. గతేడాది జమైకాకు తిరిగి వచ్చిన క్రమంలో గేల్‌ సెంచరీతో మెరిశాడు. కానీ తర్వాత విఫలమైన గేల్‌ పెద్దగా పరుగులు చేయలేదు. కేవలం 10 ఇన్నింగ్స్‌ల్లో 243 పరుగులు చేయడంతో సదరు ఫ్రాంచైజీ గేల్‌తో ఉపయోగం లేదనుకునే అతన్ని విడిచిపెట్టింది. (రాస్‌ టేలర్‌కు ‘టాప్‌’ అవార్డు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top