
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం కీరన్ పొలార్డ్ (Kieron Pollard) సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో ఆల్‌టైమ్ ప్రపంచ రికార్డు (T20 World Record) నెలకొల్పాడు. టీ20లలో పద్నాలుగు వేలకు పైగా పరుగులు చేయడంతో పాటు.. మూడు వందల వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
నైట్ రైడర్స్‌కు పొలార్డ్ ప్రాతినిథ్యం
కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)-2025లో భాగంగా బార్బడోస్ రాయల్స్‌తో శనివారం ఉదయం జరిగిన మ్యాచ్ సందర్భంగా.. పొలార్డ్ ఈ ఫీట్ అందుకున్నాడు. కాగా 2022లోనే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన ఈ ఆల్‌రౌండర్.. సీపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో.. కోల్‌కతా నైట్ రైడర్స్ సిస్టర్ ఫ్రాంఛైజీ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు పొలార్డ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
రాయల్స్@ 178 పరుగులు
ఈ క్రమంలో ట్రినిడాడ్ వేదికగా.. బార్బడోస్ రాయల్స్‌తో నైట్ రైడర్స్ శనివారం తలపడింది. టాస్ గెలిచిన రైట్ రైడర్స్ తొలుత బౌలింగ్ చేసింది. బ్యాటింగ్‌కు దిగిన బార్బడోస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది. షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (22 బంతుల్లో 45), కదీమ్ అలినే (41), కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (15 బంతుల్లో 31) కారణంగా ఈ మేర గౌరవప్రదమైన స్కోరు చేసింది.
మున్రో, పూరన్ ధనాధన్
నైట్ రైడర్స్ బౌలర్లలో ఆండ్రీ రసెల్ మూడు వికెట్లు తీయగా.. ఆమిర్ రెండు, అలీఖాన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన నైట్ రైడర్స్ 17.5 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి పనిపూర్తి చేసింది. ఓపెనర్ కొలిన్ మున్రో (44 బంతుల్లో 67) ధనాధన్ దంచికొట్టగా.. మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ (19), వన్‌డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ (1) మాత్రం విఫలమయ్యారు.
ఇక నికోలస్ పూరన్ (40 బంతుల్లో 65 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించగా.. పొలార్డ్ (9 బంతుల్లో 19 నాటౌట్) కూడా వేగంగా ఆడాడు. ఈ క్రమంలో 17.5 ఓవర్లలో 179 పరుగులు చేసిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
చరిత్ర సృష్టించిన పొలార్డ్
ఇక ఈ మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ టీ20 ఫార్మాట్లో 14 వేల పరుగుల మైలురాయిని తాకాడు. అంతేకాదు.. అతడి ఖాతాలో 332 టీ20 వికెట్లు కూడా ఉన్నాయి. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్ పొలార్డ్ కావడం విశేషం.
అత్యధిక పరుగుల వీరుడు గేల్
మొత్తంగా ఇప్పటి వరకు 712 టీ20 మ్యాచ్‌లు ఆడిన పొలార్డ్ ఈ మేర పరుగులు, వికెట్లు రాబట్టాడు. ఇదిలా ఉంటే.. పొట్టి ఫార్మాట్లో 14 వేల మైలురాయిని చేరుకున్న తొలి బ్యాటర్‌గా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ నిలిచాడు.
వికెట్ల ధీరుడు ఎవరంటే
మొత్తంగా 22 శతకాలు, 88 ఫిఫ్టీల సాయంతో గేల్ 14562 పరుగులు సాధించి.. టీ20 క్రికెట్‌లో అత్యధిక రన్‌స్కోరర్‌గా రికార్డులకెక్కాడు. పొలార్డ్ గేల్ కంటే ప్రస్తుతం 563 పరుగుల దూరంలో ఉన్నాడు. మరోవైపు.. పొట్టి ఫార్మాట్లో 488 మ్యాచ్‌లలో కలిపి 661 వికెట్లు తీసిన అఫ్గనిస్తాన్ స్పిన్ దిగ్గజం రషీద్ ఖాన్ హయ్యస్ట్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.
చదవండి: 'నా కెరీర్‌లో సెహ్వాగ్ త్యాగం మరువలేనిది.. ఎప్పుడూ రుణపడి ఉంటా'