న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం కేన్ విలియమ్సన్ (Kane Williamson) అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) టోర్నమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.
ఇదే సరైన సమయం
‘‘నాకు.. జట్టుకు ఈ నిర్ణయం ఎంతో ముఖ్యమైనది. రిటైర్మెంట్ ప్రకటనకు ఇదే సరైన సమయం. వచ్చే టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి జట్టును సంసిద్ధం చేసే విషయంలో వారికి ఇప్పుడు ఒక స్పష్టత వస్తుంది.
జట్టులో టీ20 ప్రతిభకు కొదవలేదు. ప్రపంచకప్ టోర్నీకి వారిని ఇప్పటి నుంచి సిద్ధం చేయాల్సి ఉంది. మిచ్ (మిచెల్ సాంట్నర్) అద్భుతమైన సారథి. జట్టుకు నా వంత సహకారం ఉంటుంది. సుదీర్ఘ కెరీర్‌లో నాకెన్నో అనుభవాలు, జ్ఞాపకాలు ఉన్నాయి’’ అంటూ కేన్ విలియమ్సన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
టెస్టులకు మాత్రం కొనసాగుతా
కాగా వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగబోయే టీ20 సిరీస్‌కు ముందు విలియమ్సన్ ఈ విషయం వెల్లడించాడు. అదే విధంగా.. విండీస్‌తో వన్డే సిరీస్‌కు కూడా దూరం కానున్నట్లు తెలిపాడు.
అయితే, వెస్టిండీస్‌తో డిసెంబరులో జరుగబోయే మూడు టెస్టులకు మాత్రం తాను అందుబాటులో ఉంటానని విలియమ్సన్ స్పష్టం చేశాడు. కాగా విలియమ్సన్ టీ20 రిటైర్మెంట్‌పై న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కాట్ వీనింక్ స్పందించాడు.
కేన్ కెరీర్ అద్భుతంగా సాగిందని.. తను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు తమ మద్దతు ఉంటుందని స్కాట్ తెలిపాడు. ఏదేమైనా కేన్ చాన్నాళ్లపాటు క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నామని.. అయితే, ఆటకు వీడ్కోలు పలికే విషయంలో అతడికి పూర్తి స్వేచ్ఛ ఉందని పేర్కొన్నాడు. కేన్ న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజంగా చరిత్రలో గుర్తుండిపోతాడని ప్రశంసించాడు.
సెంట్రల్ కాంట్రాక్డు నుంచి వైదొలిగి..
కాగా మొట్టమొదటి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో కెప్టెన్ హోదాలో న్యూజిలాండ్‌ను విజేతగా నిలిపాడు కేన్ విలియమ్సన్. ఆ తర్వాత టెస్టు, వన్డే, టీ20 జట్ల కెప్టెన్సీ వదులుకున్న కేన్ మామ.. న్యూజిలాండ్ క్రికెట్ సెంట్రల్ కాంట్రాక్డు నుంచి వైదొలిగాడు.
కుటుంబానికి సమయం కేటాయించడం, ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడే క్రమంలో ఈ మేరకు స్వేచ్ఛను కోరుకున్న 35 ఏళ్ల కేన్.. క్యాజువల్ కాంట్రాక్టు కుదుర్చుకోవడం ద్వారా తనకు వీలైనపుడు దేశం తరఫున ఆడుతున్నాడు.
సెకండ్ హయ్యస్ట్ రన్ స్కోరర్‌గా
ఇక కివీస్ జట్టు తరఫున ఎన్నో రికార్డులు సాధించిన కేన్ మామ.. అంతర్జాతీయ టీ20లలో 93 మ్యాచ్‌లు ఆడి.. 2575 పరుగులు సాధించాడు. ఇందులో 18 అర్ధ శతకాలు ఉన్నాయి. 2021 టీ20 ప్రపంచకప్ టోర్నీలో కివీస్ కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్.. ఆస్ట్రేలియాతో ఫైనల్లో 85 పరుగులు చేశాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాడు.
ఇక 2016, 2022 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లోనూ కేన్ కివీస్ జట్టుకు సారథ్యం వహించాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేన్ రెండో స్థానంలో నిలిచాడు. కాగా 2011లో కివీస్ తరఫున టీ20లలో అరంగేట్రం చేసిన కేన్.. గతేడాది జూన్‌లో తన చివరి మ్యాచ్ ఆడాడు.
చదవండి: ICC: గెలిచిన జట్టుకు కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ!.. బీసీసీఐ బంపరాఫర్


