
ఆసియాకప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. మరికాసేపట్లో దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్ధుల పోరుకు తెరలేవనుంది. ఓ వైపు బాయ్‌కాట్ డిమాండ్ వినిపిస్తున్నప్పటికి.. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో తలపడేందుకు ఇరు జట్లు సిద్దమయ్యాయి.
ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, మాజీ క్రికెటర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం,యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ కూడా ఉన్నాడు. భారత్-పాక్ పోరు నేపథ్యంలో గేల్ ఆసక్తికర ట్వీట్ చేశాడు.
"ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఉర్రూతలూగించేందుకు భారత్-పాక్ జట్లు మరోసారి సిద్దమయ్యాయి. ఇరు జట్లు కూడా తమ సూపర్ స్టార్లు లేకుండా ఆడుతున్నాయి. దీంతో భారత్-పాక్ రైవలరీలో కొత్త శకం ప్రారంభం కానుంది. సీనియర్ ప్లేయర్లు లేనప్పటికి ఈ రోజు మ్యాచ్ అదరిపోతుందని ఆశిస్తున్నాను" గేల్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తమ స్టార్ ప్లేయర్లు లేకుండా ఆడుతున్నాయి.
భారత దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ మెగా టోర్నీలో భాగం కావడం లేదు. మరోవైపు పాక్ స్టార్ ప్లేయర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజంలను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఇటీవల కాలంలో ఈ నలుగురు క్రికెటర్లు లేకుండా భారత్-పాక్ మ్యాచ్ జరగనుండడం ఇదే తొలిసారి. కాగా ఆసియాకప్‌లో పాక్‌పై భారత్‌దే పై చేయిగా ఉంది.
ఆసియా కప్‌లో ఇప్పటి వరకు 19 మ్యాచ్‌ల్లో భారత్, పాక్ ముఖాముఖి తలపడ్డాయి. టీమిండియా 10 మ్యాచుల్లో విజయం సాధిస్తే.. పాక్ ఆరు మ్యాచుల్లో గెలిచింది. 3 మ్యాచ్‌ల్లో మాత్రం ఫలితం తేలలేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, గిల్, సామ్సన్, తిలక్, శివమ్ దూబే, పాండ్యా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, వరుణ్.
పాకిస్తాన్: సల్మాన్ ఆగా (కెప్టెన్), ఫర్హాన్, అయూబ్, ఫఖర్, హసన్, హారిస్, నవాజ్, ఫహీమ్, అఫ్రిది, ముఖీమ్, అబ్రార్
చదవండి: పాక్‌తో మ్యాచ్ బహిష్కరించాలంటూ విజ్ఞప్తులు!.. ఆటగాళ్లకు గంభీర్ మెసేజ్ ఇదే..