
గేల్- రాహుల్- కుంబ్లే (PC: IPL/BCCI)
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ (Chris Gayle) ఐపీఎల్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను అగౌరవపరిచారని.. యాజమాన్యం వ్యవహారశైలి కారణంగా తాను డిప్రెషన్‌లో కూరుకుపోయే పరిస్థితి తలెత్తిందని తెలిపాడు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 2008లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు.
2021లో ఐపీఎల్‌కు వీడ్కోలు..
క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తంగా 142 మ్యాచ్‌లు ఆడిన క్రిస్ గేల్.. ఆరు శతకాల సాయంతో 4965 పరుగులు సాధించాడు. పంజాబ్ కింగ్స్ తరఫున తన చివరి మ్యాచ్ ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 2021లో ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. పంజాబ్ ఫ్రాంఛైజీ (అప్పడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్)కి 2018- 2021 వరకు ప్రాతినిథ్యం వహించిన గేల్.. మొత్తంగా ఆ జట్టు తరఫున 41 మ్యాచ్‌లు ఆడి 1304 పరుగులు చేశాడు.
ఇందులో ఓ సెంచరీ, పదకొండు అర్ధ శతకాలు కూడా ఉండటం విశేషం. ఇక పంజాబ్ తరఫున గేల్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 104. అయితే, జట్టు కోసం ఇంతచేసినా.. ఫ్రాంఛైజీ మాత్రం తనకు కనీస మర్యాద ఇవ్వలేదని గేల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
గౌరవం, మర్యాద ఇవ్వలేదు
‘‘పంజాబ్ ఫ్రాంఛైజీ కారణంగా నా ఐపీఎల్ కెరీర్ ముందుగానే ముగిసిపోయింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో నన్ను అగౌరవపరిచారు. ఓ సీనియర్ ఆటగాడిగా నాకు ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద ఇవ్వలేదు.
జట్టుతో పాటు లీగ్‌కు కూడా విలువ తెచ్చిన నాలాంటి ఆటగాడి పట్ల అలా ఎవరూ వ్యవహరించరు. నన్నో చిన్నపిల్లాడిలా చూశారు. వారి వైఖరి వల్ల.. జీవితంలో తొలిసారి నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది.
కుంబ్లేకి చెప్పి ఏడ్చాను.. అయినా పట్టించుకోలేదు
నా మనసు బాగా గాయపడింది. ఇదే విషయాన్ని అనిల్ కుంబ్లేకు చెప్పాను. అతడితో మాట్లాడుతూ గట్టిగా ఏడ్చేశాను. కానీ అతడు కూడా నన్ను పూర్తిగా నిరాశపరిచాడు. ఫ్రాంఛైజీని యాజమాన్యం నడిపిస్తున్న తీరు నన్ను నిరాశకు గురిచేసింది.
కేఎల్ రాహుల్ ఫోన్ చేసి..
అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్ నాకు ఫోన్ చేసి.. ‘క్రిస్.. నువ్వు తదుపరి మ్యాచ్ ఆడబోతున్నావు’ అని చెప్పాడు. నేను మాత్రం.. ‘మీకు ఆల్ ది బెస్ట్’ అని చెప్పేసి బ్యాగ్ సర్దేసుకున్నాను. ఫ్రాంఛైజీ నుంచి బయటకు వచ్చేశాను’’ అని శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో గేల్ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించాడు.
కాగా కేకేఆర్, పంజాబ్ జట్లతో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా గేల్ ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవల ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆర్సీబీ ట్రోఫీ గెలిచినప్పుడు విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌తో కలిసి మైదానమంతా కలియదిరుగుతూ సందడి చేశాడు. ఇదిలా ఉంటే.. పంజాబ్‌పైన గేల్ 16 ఇన్నింగ్స్ ఆడి 797 పరుగులు చేయడం గమనార్హం.
చదవండి: సెలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పాకిస్తాన్ కెప్టెన్