
ఆసియా కప్ జట్టుకు తనను ఎంపిక చేయలేదన్న కసితో రగిలిపోతున్న పాకిస్తాన్ వన్డే కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్, తాజాగా ఆ దేశ సెలెక్టర్లకు బ్యాట్‌తో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఫార్మాట్ ఏదైనా తాను విలువైన ఆటగాడిగేనని బ్యాట్‌తో సందేశం పంపాడు.
ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌కు ఆడుతున్న రిజ్వాన్.. ఇవాళ (సెప్టెంబర్ 8) గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసినంత పని చేసి (62 బంతుల్లో 85; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆసియా కప్‌కు తనను ఎంపిక చేయని వారు పశ్చాత్తాపపడేలా చేశాడు.
ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ ఇన్నింగ్స్ కారణంగానే పేట్రియాట్స్ మ్యాచ్ గెలిచింది. రిజ్వాన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఈ మ్యాచ్ మొత్తంలో రిజ్వాన్ మినహా ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. కష్టమైన పిచ్‌పై రిజ్వాన్ అద్భుతంగా ఆడి ప్రశంసలందుకున్నాడు.
రిజ్వాన్ వన్డే జట్టు కెప్టెన్ అయినా ఫామ్ లేని కారణంగా పాక్ సెలెక్టర్లు అతన్ని ఆసియా కప్‌కు ఎంపిక చేయలేదు. టీ20 ఫార్మాట్‌కు రిజ్వాన్ సరిపొడపడన్నది వారి వాదన. ఆసియా కప్‌కు పాక్ సెలెక్టర్లు రిజ్వాన్‌తో పాటు మరో స్టార్ బ్యాటర్ అయిన బాబర్ ఆజమ్‌ను కూడా ఎంపిక చేయలేదు.
బాబర్‌ను అయితే పాక్ సెలెక్టర్లు చాలాకాలం నుంచే పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు దూరం పెట్టారు. అన్ని ఫార్మాట్లలో అతని దారుణమైన ఫామే ఇందుకు కారణం. అంతర్జాతీయ క్రికెట్‌లో అతను సెంచరీ చేసి రెండేళ్లు పూర్తైంది. సీనియర్లైన రిజ్వాన్, బాబర్‌పై వేటు వేసిన పాక్ సెలెక్టర్లు.. సల్మాన్ అఘా నేతృత్వంలోని యువ జట్టును ఆసియా కప్‌కు ఎంపిక చేశారు.
కరీబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ విషయానికొస్తే.. రిజ్వాన్ (85) చెలరేగినా, తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో వారియర్స్ కూడా తడబడి లక్ష్యానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది. వారియర్స్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. 31 పరుగులు చేసిన షాయ్ హోప్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.