టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్‌గా.. | Alex Hales Creates History In T20 Cricket Becomes First To Achieve This | Sakshi
Sakshi News home page

టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్‌గా..

Sep 1 2025 3:35 PM | Updated on Sep 1 2025 3:47 PM

Alex Hales Creates History In T20 Cricket Becomes First To Achieve This

టీ20 ఫార్మాట్లో ఇంగ్లండ్‌ స్టార్‌ అలెక్స్‌ హేల్స్‌ (Alex Hales) సరికొత్త చరిత్ర లిఖించాడు. పొట్టి క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన.. తొలి వెస్టిండేతర ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా టీ20లలో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు రెండేళ్ల క్రితమే వీడ్కోలు పలికిన అలెక్స్‌ హేల్స్‌.. ఫ్రాంఛైజీ క్రికెట్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ ప్రస్తుతం కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (CPL)-2025తో బిజీగా ఉన్నాడు. ఈ టీ20 లీగ్‌లో నికోలస్‌ పూరన్‌ కెప్టెన్సీలోని ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌కు హేల్స్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

43 బంతుల్లోనే
ఈ క్రమంలో గయానా అమెజాన్‌ వారియర్స్‌ (Guyana Amazon Warriors)తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నైట్‌ రైడర్స్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ అలెక్స్‌ హేల్స్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 43 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 74 పరుగులు సాధించాడు. హేల్స్‌తో పాటు మరో ఓపెనర్‌ కొలిన్‌ మున్రో అర్ధ శతకం (30 బంతుల్లో 52)తో రాణించగా.. ఆండ్రీ రసెల్‌ 14 బంతుల్లో 27 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఈ ముగ్గురి అద్భుత ఆట తీరు కారణంగా.. గయానా విధించిన లక్ష్యాన్ని 164 పరుగుల లక్ష్యాన్ని నైట్‌ రైడర్స్‌ 17.2 ఓవర్లలోనే ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో గయానాపై విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

ప్రపంచంలోనే రెండో ప్లేయర్‌గా
ఇదిలా ఉంటే.. గయానా అమెజాన్‌ వారియర్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా మెరుపు హాఫ్‌ సెంచరీ సాధించిన అలెక్స్‌ హేల్స్‌.. టీ20 క్రికెట్‌లో పద్నాలుగు వేల పరుగుల మైలురాయిని దాటేశాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 14024 పరుగులు ఉన్నాయి. 

ఇక వెస్టిండీస్‌ దిగ్గజం, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ 14562 పరుగులతో.. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగుల వీరుడిగా ఉండగా.. హేల్స్‌ అతడి తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. మరోవైపు.. మూడో స్థానంలో మరో విండీస్‌ లెజెండ్‌ కీరన్‌ పొలార్డ్‌ (14012 పరుగులు)ఉన్నాడు.

కాగా 36 ఏళ్ల అలెక్స్‌ హేల్స్‌.. 2011- 2022 వరకు ఇంగ్లండ్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు. మొత్తంగా 70 వన్డేలు, 75 టీ20లు, 11 టెస్టుల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించిన హేల్స్‌.. ఆయా ఫార్మాట్లలో 2419.. 2074.. 573 పరుగులు సాధించాడు. 2022లో ఇంగ్లండ్‌ టీ20 ప్రపంచ కప్‌ గెలిచిన తర్వాత ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

చదవండి: IND vs AUS: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్టులో పాసైన కెప్టెన్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement