
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఫైనల్స్‌కు చేరుకుంది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (సెప్టెంబర్ 20) ఉదయం జరిగిన రెండో క్వాలిఫయర్‌లో సెయింట్ లూసియా కింగ్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.
అలెక్స్ హేల్స్ (44 బంతుల్లో 58 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ పూరన్ (32 బంతుల్లో 50; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో పోలార్డ్ (26 బంతుల్లో 35; 4 సిక్సర్లు), రసెల్ (12 బంతుల్లో 28; ఫోర్, 3 సిక్సర్లు) విరుచుకుపడ్డారు. లూసియా కింగ్స్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, ఖారీ పియెర్, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీశారు.
అనంతరం 195 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లూసియా కింగ్స్ చేతులెత్తేసింది. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. నిదానంగా ఆడుతూ, బంతులు వృధా చేసుకుని ఆఖరికి మూల్యం చెల్లించుకుంది. ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (40 బంతుల్లో 57; 8 ఫోర్లు, సిక్స్) ఒక్కడే తూతూమంత్రంగా గెలుపు కోసం ప్రయత్నించాడు. మిగతా ఆటగాళ్లంతా నిరాశపరిచారు.
జాన్సన్ ఛార్లెస్ 17, టిమ్ డేవిడ్ 28, రోస్టన్ ఛేజ్ 16, ఆరోన్ జోన్స్ 12, టైమాల్ మిల్స్ 6 పరుగులు చేయగా.. అకీమ్ అగస్టీ, కెప్టెన్ డేవిడ్ వీస్ డకౌట్లయ్యారు. నైట్‌రైడర్స్ స్పిన్నర్లు సునీల్ నరైన్ (4-1-18-3), ఉస్మాన్ తారిక్ (4-0-35-4) లూసియా కింగ్స్ బ్యాటర్ల నడ్డి విరిచారు.
నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరగులు మాత్రమే చేసిన కింగ్స్ 56 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. సెప్టెంబర్ 22న జరిగే ఫైనల్లో నైట్‌రైడర్స్ గయానా అమెజాన్ వారియర్స్‌తో టైటిల్ కోసం పోటీపడుతుంది.