
ఇమ్రాన్ తాహిర్ నేతృత్వంలోని గయానా అమెజాన్ వారియర్స్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్ ఫైనల్స్‌కు చేరింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (సెప్టెంబర్ 18) ఉదయం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఆ జట్టు సెయింట్ లూసియా కింగ్స్‌పై 14 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది.
తొలుత బ్యాటింగ్ చేసిన గయానా.. తబ్రేజ్ షంషి (4-0-33-3), డేవిడ్ వీస్ (3-0-14-2), అల్జరీ జోసఫ్ (3-0-34-2), తైమాల్ మిల్స్ (3.5-0-38-2), రోస్టన్ ఛేజ్ (2-0-15-1) ధాటికి 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది.
గయానా ఇన్నింగ్స్‌లో బెన్ మెక్‌డెర్మాట్ (34), షాయ్ హెప్ (32) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఆఖర్లో రొమారియో షెపర్డ్ (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్), ప్రిటోరియస్ (8 బంతుల్లో 17; 2 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో గయానా గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.
మోటీ మాయాజాలం
అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లూసియా కింగ్స్.. గుడకేశ్ మోటీ మాయాజాలం (4-0-30-4) దెబ్బకు 19.1 ఓవర్లలో 143 పరుగులకే చాపచుట్టేసింది. ఇమ్రాన్ తాహిర్ (4-0-22-2), ప్రిటోరియస్ (4-0-24-2), రొమారియో షెపర్డ్ (4-0-36-1), హస్సన్ ఖాన్ (2.1-0-21-1) కూడా లూసియా కింగ్స్‌ను డ్యామేజ్ చేశారు.
గయానా బౌలర్ల ధాటికి ఓ దశలో లూసియా కింగ్స్ ఇన్నింగ్స్ 100లోపే ముగుస్తుందని అనుకున్నారు. అయితే ఖారీ పియెర్ (29 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), తైమాల్ మిల్స్ (18 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) వీరోచితంగా పోరాడి గాయానా శిబిరంలో ఓటమి భయం పుట్టించారు. మోటీ పియెర్‌ను.. హస్సన్ ఖాన్ మిల్స్‌ను ఔట్ చేయడంతో లూసియా కింగ్స్ పోరాటం ముగిసింది.
ఈ మ్యాచ్‌లో ఓడినా లూసియా కింగ్స్‌కు టైటిల్ రేసులో ఉండేందుకు మరో అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 20న జరిగే క్వాలిఫయర్-2లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెప్టెంబర్ 22న జరిగే ఫైనల్లో గయానాతో అమీతుమీ తేల్చుకుంటుంది.