
తాజాగా జరిగిన ఓ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో (CPL) పాల్గొంటున్న ఇద్దరు స్టార్ ఆటగాళ్లు (సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియట్స్), ఓ సీపీఎల్ అధికారి తుపాకీ బెదిరింపులకు గురయ్యారు. ఈ ఘటన సెప్టెంబర్ 9వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది. పైన పేర్కొన్న వారు ఓ ప్రైవేట్ ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఆటగాళ్లను బెదిరించింది దొంగలై ఉండవవచ్చు. నగలు మరియు ఇతర విలువైన వస్తువుల కోసం ఇలా చేసి ఉంటారు. ఘటనా స్థలంలో ఓ తుపాకీ లభించింది. అది దొంగలదిగా భావిస్తున్నాం. ఈ ఘటనలో బాధితులు ఎవరూ గాయపడలేదు. విచారణ వేగవంతగా జరుగుతుంది.
తాజా ఉదంతంతో సీపీఎల్ నిర్వహకులు అలర్ట్ అయ్యారు. ఆటగాళ్లు సహా సీపీఎల్‌లో భాగమైన వారందరికీ భద్రత పెంచారు. ఆటగాళ్ల సంక్షేమం తమకు చాలా ముఖ్యమని ప్రకటించారు. బాధితుల గోప్యతను గౌరవిస్తూ వారి పేర్లను వెల్లడించడం లేదని తెలిపారు.
కాగా, తుపాకీ బెదింపుల ఘటన తర్వాత పేట్రియట్స్ ఇవాళ (సెప్టెంబర్ 11) జరుగబోయే మ్యాచ్‌కు ప్రిపేర్ అవుతుంది. ఆ జట్టు బార్బడోస్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. ఈ సీజన్‌లో పేట్రియాట్స్ ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది.
పేట్రియాట్స్ సెప్టెంబర్ 7న జరిగిన తమ చివరి మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌పై 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లో పాక్ ఆటగాడు రిజ్వాన్ (62 బంతుల్లో 85) ఒంటరిపోరాటం చేసి పేట్రియాట్స్ను గెలిపించాడు. రిజ్వాన్ ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన పాక్ జట్టుకు ఎంపిక కాలేదు. వన్డే జట్టు కెప్టెన్ అయినా పాక్ సెలెక్టర్లు ఫామ్‌ను సాకుగా చూపుతూ రిజ్వాన్ను పక్కన పెట్టారు.