
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2025 తుది దశకు చేరింది. భారతకాలమానం ప్రకారం ఇవాల్టి నుంచి (సెప్టెంబర్ 17) ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. ఇవాళ జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌పై ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఘన విజయం సాధించి, క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. నైట్‌రైడర్స్ చేతిలో ఓడిన ఫాల్కన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
రేపు జరుగబోయే క్వాలిఫయర్-1లో సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్ తలపడతాయి. ఈ మ్యాచ్‌లో విజేత సెప్టెంబర్ 22న జరిగే ఫైనల్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు సెప్టెంబర్ 20న జరిగే క్వాలిఫయర్-2లో నైట్‌రైడర్స్‌తో పోటీపడుతుంది. ఇక్కడ గెలిచిన జట్టు క్వాలిఫయర్-1 విజేతతో ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.
ఎలిమినేటర్ మ్యాచ్ విషయానికొస్తే.. ఫాల్కన్స్‌పై నైట్‌రైడర్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్.. ఆమిర్ జాంగూ (55), ఆండ్రియస్ గౌస్ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.
ఆఖర్లో షకీబ్ అల్ హసన్ (9 బంతుల్లో 26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో సౌరభ్ నేత్రావల్కర్ 3 వికెట్లు, ఉస్మాన్ తారిఖ్, ఆండ్రీ రసెల్ తలో 2, సునీల్ నరైన్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన నైట్‌రైడర్స్.. అలెక్స్ హేల్స్ (54 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), నికోలస్ పూరన్ (53 బంతుల్లో 90 నాటౌట్; 3 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో ఆడుతుపాడుతూ విజయతీరాలకు చేరింది. ఆ జట్టు 17.3 ఓవర్లలో కొలిన్ మున్రో (14) వికెట్ మాత్రమే కోల్పోయి అద్భుత విజయం సాధించింది. పూరన్ సిక్సర్ల సునామీ సృష్టించి మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు.