డిసెంబర్ 2 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20) నాలుగో సీజన్ కోసం మాజీ ఛాంపియన్ ఎంఐ ఎమిరేట్స్ భారీ బలాన్ని చేకూర్చుకుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ పేరిట విధ్వంసకర ఆటగాళ్లు, విండీస్ ప్లేయర్లు కీరన్ పోలార్డ్ (Kieron Pollard), నికోలస్ పూరన్‌ను (Nicholas Pooran) రీటైన్ చేసుకుంది.
పోలార్డ్, పూరన్ కొద్ది రోజుల కిందట మేజర్ లీగ్ క్రికెట్‌లో ఎంఐ ఎమిరేట్స్ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన ఎంఐ న్యూయార్క్‌కు టైటిల్‌ను అందించారు. ILT20-2025లో ఈ ఇద్దరు మరోసారి జత కట్టబోతున్నారు. ఈ ఎడిషన్‌ను ఎంఐ ఎమిరేట్స్ డిసెంబర్ 4న గల్ఫ్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలుపెడుతుంది. ఓపెనర్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ దుబాయ్ క్యాపిటల్స్, రన్నరప్ డెసర్ట్ వైపర్స్ తలపడతాయి.
వాస్తవానికి ILT20 లీగ్ వచ్చే ఏడాది జరగాల్సి ఉండింది. అయితే 2026 టీ20 ప్రపంచకప్ దృష్ట్యా దీన్ని ముందుకు జరిపారు. ఈ ఎడిషన్‌కు సంబంధించి ఈ నెల 1వ తేదీన వేలం జరిగింది. నాలుగేళ్ల లీగ్ చరిత్రలో వేలం జరగడం ఇదే మొదటిసారి.
రిటెన్షన్లు, డైరెక్ట్ సైనింగ్‌ల పేరిట ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్లతో ఒప్పందాలు చేసుకున్నాయి. తాజాగా ఎంఐ ఎమిరేట్స్ ఫ్రాంచైజీ వైల్డ్ కార్డ్‌ను ఉపయోగించి పోలార్డ్, పూరన్‌ను తిరిగి దక్కించుకుంది. గతంలో డ్రాఫ్టింగ్ సిస్టమ్ ద్వారా ఆటగాళ్లతో ఒప్పందాలు చేసుకునే వారు.
ఇదిలా ఉంటే, వైల్డ్ కార్డ్ ద్వారా ఎం ఎమిరేట్స్ రిటైన్ చేసుకున్న పోలార్డ్, పూరన్‌కు ఘనమైన టీ20 ట్రాక్ రికార్డు ఉంది. పోలార్డ్ ఇప్పటివరకు 18 టీ20 టైటిళ్లు గెలిచి, పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు గెలిచిన ప్లేయర్‌గా చలామని అవుతుండగా.. పూరన్ కూడా తానేమీ తక్కువ కాదన్నట్లు ఇప్పటికే 3 టీ20 టైటిళ్లు సొంతం చేసుకున్నాడు. అవి కూడా ఎంఐ ఫ్రాంచైజీల తరఫునే కావడం విశేషం.
పూరన్‌ను ఎంఐ ఎమిరేట్స్ వైల్డ్ కార్డ్‌ను ఉపయోగించి రీటైన్ చేసుకున్నా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌తో ఇదివరకే కుదిరిన ఒప్పందం కారణంగా ఈ సీజన్ మొత్తానికే దూరం కానున్నాడు. ఈసారి ILT20, SA20 షెడ్యూల్ తేదీలు క్లాష్ అవుతున్నాయి.
కరీబియన్లతో నిండిపోయింది
ఎంఐ ఎమిరేట్స్ స్క్వాడ్ కరీబియన్ ప్లేయర్లతో నిండిపోయింది. ఆండ్రీ ఫ్లెచర్, రొమారియో షెపర్డ్, అకీమ్ ఆగస్టే వంటి స్టార్స్ ఇప్పటికే జట్టులో ఉన్నారు. వీరితో పాటు టామ్ బాంటన్, జానీ బెయిర్‌స్టో, షకీబ్ అల్ హసన్, క్రిస్ వోక్స్ వంటి అంతర్జాతీయ స్టార్స్ కూడా ఉన్నారు.
చదవండి: ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం


