
వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం క్రిస్ గేల్ (Chris Gayle) టీమిండియా సెలక్టర్ల తీరును విమర్శించాడు. టెస్టు జట్టులో ఉండేందుకు సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan) అర్హుడని.. అతడికి వరుస అవకాశాలు ఇవ్వాలని పేర్కొన్నాడు. బరువు అనేది పెద్ద సమస్య కాదని.. ఆటగాడు ఫిట్‌గా ఉంటే చాలంటూ సర్ఫరాజ్‌కు మద్దతుగా నిలిచాడు.
న్యూజిలాండ్‌తో చివరగా..
కాగా 2024లో ఇంగ్లండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఆరు టెస్టులు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఓ శతకం, మూడు అర్ధ శతకాల సాయంతో 371 పరుగులు చేశాడు. చివరగా న్యూజిలాండ్‌తో గతేడాది నవంబరులో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ ఆడాడు.
ఆ తర్వాత ఇంగ్లండ్-‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్ ఆడిన భారత్-‘ఎ’ జట్టుకు ఎంపికైన సర్ఫరాజ్.. ప్రధాన జట్టు (టీమిండియా)లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. తదుపరి ఆస్ట్రేలియా- ‘ఎ’తో మ్యాచ్‌కు కూడా ఈ ముంబైకర్ దూరమయ్యాడు. గాయం వల్ల అతడు సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయినట్లు సమాచారం.
అతడు బాగా బరువు తగ్గాడు
ఈ నేపథ్యంలో క్రిస్ గేల్ సర్ఫరాజ్ ఖాన్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలంటూ టీమిండియా సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. ‘‘అతడు భారత టెస్టు తుదిజట్టులో ఉండాలి. లేదంటే కనీసం జట్టులోనైనా అతడికి చోటివ్వాలి. సొంతగడ్డపై ఇంగ్లండ్ మీద సెంచరీ చేసిన ఆటగాడిని పక్కనపెట్టారు.
కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియాలో ఓ పోస్టు చూశాను. అతడు బాగా బరువు తగ్గాడు. అసలు బరువు అనేది సమస్యే కాదు. అతడు ఫిట్‌గా ఉన్నాడు. పరుగులు చేస్తున్నాడు. అదే కదా అన్నింటికంటే ముఖ్యమైనది.
టెస్టు జట్టులో ఉండాల్సిందే
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీలు బాదిన ఆటగాడు. కానీ బరువును సాకుగా చూపి అతడిని జట్టు నుంచి తప్పించినట్లయితే అది నిజంగా విచారించదగ్గ విషయం. వందకు వంద శాతం అతడు టెస్టు జట్టులో ఉండాల్సిందే.
ఇండియాలో ప్రతిభకు కొదువలేదు. అయితే, ఇలాంటి ప్రత్యేకమైన ఆటగాడు మాత్రం అవకాశాలకు అర్హుడు’’ అంటూ గేల్ టీమిండియా సెలక్టర్ల తీరును విమర్శించాడు. శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
అతడే నా అభిమాన క్రికెటర్
ఇక భారత క్రికెటర్లలో సర్ఫరాజ్ ఖాన్ తన అభిమాన క్రికెటర్ అని గేల్ ఈ సందర్భంగా తెలిపాడు. విరాట్ కోహ్లి వంటి దిగ్గజ క్రికెటర్‌ను కాదని.. గేల్ సర్ఫరాజ్ పేరు చెప్పడం విశేషం. కాగా ఐపీఎల్‌లో గేల్- సర్ఫరాజ్ ఖాన్ ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. టీమిండియా చివరగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడింది. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీని 2-2తో సమం చేసింది. తదుపరి టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్-2025 ఆడిన అనంతరం.. స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టులు ఆడనుంది.
చదవండి: కుంబ్లేకి చెప్పి ఏడ్చాను.. అయినా పట్టించుకోలేదు.. కేఎల్ రాహుల్ కాల్ చేసి: క్రిస్ గేల్