
సాక్షి, పిఠాపురం/తూర్పుగోదావరి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ నిప్పులు చెరిగారు. టీడీపీ నాయకులను పదేపదే బ్రోకర్లు అని సంబోధిస్తున్న తీరు సరిగా లేదని అన్నారు. పవన్ కల్యాణ్‌కు భాషా సంస్కారం తెలియదని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్ పరుష పదజాలాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు.
లోకేష్ గెలవలేదు.. అయితే..
మీ దగ్గర ఏం పని చేశామని బ్రోకర్లం అయ్యామంటూ వర్మ విమర్శలు గుప్పించారు. ఏ పార్టీలో అయినా విలీనమయ్యామా? లేక అమ్ముడు పోయామా? అంటూ ప్రజారాజ్యంపై విమర్శలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెసోళ్ల పంచలు ఊడదీస్తామని భారీ డైలాగులు చెప్పిన పవన్ తర్వాత అదే కాంగ్రెస్‌తో చేరిపోయారని ఎద్దేవా చేశారు. లోకేష్‌పై అనుచిత విమర్శలు చేయనిదే పవన్‌కు నిద్ర పట్టేలా లేదని వ్యాఖ్యానించారు. లోకేష్ పంచాయతీ మెంబర్ కూడా కాలేదు.. మరి మీరు దేనికి మెంబర్ అయ్యారని చురకలంటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మీలా సినిమాలు, నటన తెలియదని అన్నారు.