అక్రమార్క'గణ'మా.. ప్రగతి 'ప్రసాద్‌'మా..

TDP Candidate And YSRCP Candidate Difference in Visakhapatnam - Sakshi

మీకు ఎవరు కావాలి..

చెట్టు పేరి చెప్పి కాయలమ్ముకున్న చందాన.. మంచి పేరున్న తండ్రికి రాజకీయ వారసుడిగా తెరపైకి వచ్చిన పెతకంశెట్టి గణ వెంకటరెడ్డినాయుడు అలియాస్‌ గణబాబుకు తండ్రి గుణగణాలు ఒక్కటీ అబ్బలేదు. పైకి పెద్ద మనిషిలా చెలామణీ అవుతూ.. మంచితనమనే ముసుగు వేసుకొని కబ్జా కాండలకు తెగబడ్డారు. అక్రమాల భాగోతాన్ని  నడిపించారు.. నడిపిస్తున్నారు..  ఐదేళ్లలో ఐదు తరాలకు సరిపడా కొల్లగొట్టారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. తన అనుచరగణంతో కబ్జా చేయించి.. సర్కారు స్థలాలు సొంత జాగీరులా మార్చేశారు. ప్రజాప్రతినిధి అని చెప్పుకుంటూ.. ప్రతి పనికీ పర్సంటేజీలు వసూలు చేసిన ఘనత ఒక్క గణబాబుకే దక్కింది.  ఇప్పుడు ఇదే గణబాబు విశాఖ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తుండగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయ్‌ప్రసాద్‌ బరిలో ఉన్నారు. విజయవంతమైన వ్యాపారవేత్తగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలతో మమేకమై నిత్యం ప్రజాసమస్యలపై పోరాడే నేతగా ఎదిగిన మళ్ళ ఈ ఎన్నికల్లో ముందంజలో దూసుకుపోతున్నారు. అసలు వీరిద్దరిలో ఎవరిని ఎన్నుకోవాలి.. నిర్ణయానికి ముందు వారికి సంబంధించి కొన్ని అంశాలు పరిశీలించాల్సిందే..–సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

అవినీతి ఘనంపీవీజీఆర్‌నాయుడు, టీడీపీ అభ్యర్థి
గత ఐదేళ్ళలో గణబాబు అండతో పశ్చిమ నియోజకవర్గంలో అక్రమాలకు అంతులేకుండా పోయింది.
సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వాటర్‌ బాడీస్‌గా పరిగణించే చెరువులు, వాగులు, వంకలు. గెడ్డల రూపు కూడా మార్చడానికి వీల్లేదు. కానీ ఆ నిబంధనలను బేఖాతరు చేస్తూ పశ్చిమ టీడీపీ నేతలు దర్జాగా చెరువుకే ఎసరు పెట్టారు.
చినగదిలి మండలం వెంకటాపురం రెవెన్యూ పరిధిలో సర్వే నెం. 170 లో 53.98 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో కొంతభాగాన్ని గణబాబు అనుచరగణం కబ్జా చేసింది.
66వ వార్డు పరిధిలోని సంతోష్‌నగర్‌ చెరువు గర్భాన్ని సైతం ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేసేశారు.
జీవో 296 ప్రకారం క్రమబద్ధీకరిస్తామంటూ ఖాళీ స్థలాల్లో లబ్ధిదారులను నిల్చోబెట్టి ఫోటోలు తీయించి వారి వద్ద రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు అడ్వాన్స్‌ తీసుకున్నారు.
సర్వే నెం.170లో ఉన్న చెరువును చదును చేసి.. వంద గజాలు చొప్పున ప్లాట్స్‌ వేసి షెడ్లు వేసి అమ్మేశారు.  ఇలా సుమారు రెండున్నర ఎకరాలను చదును చేసి ఎకరన్నరకు పైగా భూమిని ప్లాట్స్‌గా మార్చేసి షెడ్లు కూడా వేసి సొమ్ము చేసుకున్నారు.
రామ్మూర్తిపంతులుపేటలో పోర్టు ట్రస్టుకు చెందిన ఏడున్నర ఎకరాల భూమిని  నాలుగు దశాబ్దాల క్రితం ఏపీఈపీడీసీఎల్‌కు లీజుకు ఇచ్చింది. ఇక్కడ విద్యుత్‌ శాఖ జోన్‌–2 కార్యాలయం కొనసాగుతోంది. పోర్టు నిర్మించిన పురాతన భవనాల్లోనే డీఈ, ఏఈ కార్యాలయాలతో పాటు సిబ్బంది క్వార్టర్స్‌ ఉండేవి. ఇందులో కోట్ల విలువైన ఏకరానికి పైగా స్థలాన్ని ఎమ్మెల్యే గణబాబు బంధువులు..అనుచరులు కబ్జా చేశారు.
ప్రహరీ గోడను కూల్చి కార్యాలయంలో చొచ్చుకొచ్చి మరీ బహుళ అంతస్తుల భవనాలను నిర్మించేశారు. కబ్జా చేసిన ఈపీడీసీఎల్‌ స్థలం మళ్లీ చేజారిపోకుండా సీసీ రోడ్డుకు, విద్యుత్‌ శాఖ కార్యాలయానికి మధ్యలో భారీ ప్రొటెక్షన్‌ వాల్‌ కూడా నిర్మించేశారు. ఎమ్మెల్యే ఒత్తిడితో మెయిన్‌రోడ్డును తలపించే స్థాయిలో రూ.30 లక్షలతో 40 అడుగుల వెడల్పుతో పక్కా సీసీ రోడ్డు తయారైపోయింది. విచిత్రంగా ఈ రోడ్డుకు ఎమ్మెల్యే తండ్రి పెతకంశెట్టి అప్పలనర్సింహం పేరు పెట్టేశారు.
ప్రభుత్వ పోరంబోకు స్థలానికి ఆనుకొని సర్వే నెం.75/1ఏ కింద 986 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న బొడ్డ చెరువు కూడా తనదేనని ఎమ్మెల్యే అనుచరుల్లో ఒకరైన నరసింహారావు వాదిస్తున్నారు. ఇలా మొత్తం 3,586 గజాల ప్రభుత్వ భూమిని తన గుప్పిట్లో పెట్టుకుని అధికారుల అండదండలతో బహుళ అంతస్తుల నిర్మాణానికి రంగం సిద్ధం చేశారు. పక్కనే సర్వే 75/1లో 75 గజాల్లో 35 ఏళ్లుగా ఉంటున్న మేకల లక్ష్మీ ఇంటిని ఇటీవలే క్రమబద్ధీకరించారు. ఈ స్థలం కూడా తనదేనని,  క్రమబద్దీకరణ పట్టాను రద్దు చేయాలంటూ ఆయన ఒత్తిడి చేయడంతో అధికారులు రద్దు చేసేశారు.
సర్వే నెం.107లో 250 గజాలకు పైగా ప్రభుత్వ స్థలం పలుమార్లు దురాక్రమణకు గురవడంతో జిల్లా కలెక్టర్‌ పేరిట అధికారులు హెచ్చరిక బోర్డు పెట్టారు. స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యే గణబాబు అండదండలతో వార్డు నేత వాటిని పీకేసి ఈ భూమిలో పాగా వేశారు.

అభివృద్ధికి ఆయనదే తొలి బీజం మళ్ల విజయప్రసాద్, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి
మళ్ల విజయ్‌ప్రసాద్‌.. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి.. స్వయం కృషితో విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగిన ప్రస్థానం
ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగాల కోసం వెతుకులాడకుండా సొంతంగా వ్యాపారం చేసి పదిమందికి ఉద్యోగం ఇవ్వాలని భావించారు.
ఆ క్రమంలోనే ట్రాన్స్‌పోర్ట్‌ బిజినెస్‌ చేసే వారు. అనంతరం రియల్‌ఎస్టేట్‌ రంగంలోకి ప్రవేశించి వెల్ఫేర్‌ గ్రూపుతో వేలాదిమందికి వెలుగులు పంచిన వ్యాపారవేత్తగా ఎదిగారు,
ఆ తర్వాత విద్యావేత్తగా...ఇంజనీరింగ్‌ కళాశాల, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశారు.
హోటల్‌ రంగంలోనూ, టూరిజం రంగంలోనూ తనదైన ముద్ర వేసి సినిమారంగంలోకి నిర్మాతగా ప్రవేశించారు. సూపర్‌హిట్‌ సినిమాలు నిర్మించారు.
మొదటి నుంచి సేవాభావం పుణికిపుచ్చుకున్న మళ్ళ ఆర్ధికంగా ఎదిగిన తర్వాత వెల్ఫేర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ స్థాపించారు.
ట్రస్ట్‌ ద్వారా పేద విద్యార్ధులకు ఉచిత విద్యనందిస్తున్నారు. ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు. పెన్షన్లు అందించారు.
రాజకీయాల ద్వారా సేవాకార్యక్రమాలు విస్తరించాలని భావించి మహానేత డాక్టర్‌  వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో 2009 ఎన్నికల్లో  కాంగ్రెస్‌ పార్టీ నుంచి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు.
ఐదేళ్ళ కాలంలో పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రగతిపథంలో పరుగులు తీయించారు.
ఈ ఐదేళ్ళలో టీడీపీ ఎమ్మెల్యే గణబాబు తానే చేశానని చెప్పుకుంటున్న అభివృద్ధి పనులన్నీ నాడు మళ్ళ హయాంలో బీజం పడ్డవే.
గోపాలపట్నం రైల్వే బ్రిడ్జికి 2013లో మళ్ళ కృషితోనే శ్రీకారం చుట్టారు. ఈ మేరకు 1458 జీవో కూడా తీసుకువచ్చారు.
కోటి రూపాయల నిధులతో గర్భిణీ స్త్రీల కోసం ఆస్పత్రి కట్టించారు.
కొండవాలు ప్రాంతాల్లో ఉన్నవారికి మంచినీటి సౌకర్యం కోసం రూ.90కోట్లతో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
ఎన్‌ఎస్‌టిఎల్‌ గోడను తొలగించేందుకు మళ్ళ స్వయంగా రక్షణ శాఖ మంత్రితో మాట్లాడి అనుమతులు తెప్పించారు.
రామ్మూర్తి పంతులు పేట అండర్‌ పాత్‌ నిర్మాణానికి నాడు మళ్ళ హయాంలోనే అనుమతులు తీసుకువచ్చారు.
ఎన్‌ఏడీ కొత రోడ్త్‌ ఫ్లై ఓవర్‌ కోస్‌ం ఆనాటి వుడా వీసీ కోన శశిధర్, జీవీఎంసీ రామాంజనేయులుతో కలిసి ప్రతిపాదనలు చేశారు.
ఎవరు ఏ సమయంలో సాయం కోసం వెళ్ళినా... చేతనైన సాయం చేసే మనస్తత్వం
ఎమ్మెల్యేగా ఒక్కసారే పనిచేసినా నియోజకవర్గ రూపురేఖలు మార్చేసిన మళ్ల విజయ్‌ప్రసాద్‌ కావాలా?.. పదవీకాలమంతా అవినీతి,  అక్రమాలతో నియోజకవర్గాన్ని కొల్లగొట్టిన గణబాబు కావాలా?.. ఓటర్లూ ఆలోచించండి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top