
గుంటూరులో జరిగిన ప్రజా చైతన్య సభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ
కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను చేపట్టిన పథకాలపై.. చంద్రబాబు తన స్టిక్కర్ వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారు. అద్భుతమైన అమరావతి నిర్మాణమంటూ వ్యక్తిగత అభివృద్ధిలో బిజీ అయిపోయారు. చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు.. కూలిపోతున్న తన పార్టీ నిర్మాణం.
– ప్రధాని మోదీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తండ్రీ, కొడుకుల (చంద్రబాబు, లోకేశ్) ఆధ్వర్యంలోని అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు త్వరలోనే మట్టి కరిపించనున్నారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జోస్యం చెప్పారు. పోలవరం నుంచి అమరావతి వరకు అన్నిటిలోనూ అనేక అక్రమాలతో చంద్రబాబు తన సంపదను పెంచుకున్నారని ఆరోపించారు. అవినీతి, అక్రమాల్లో చంద్రబాబు సీనియర్ అని మండిపడ్డారు. కేంద్రం నుంచి తీసుకున్న నిధులకు లెక్కలు అడుగుతుండడంతో ఆయనకు నిద్రపట్టడం లేదన్నారు. ఓటమి భయంతో పాటు చౌకీదార్‌గా ఉన్న నన్ను చూసి చంద్రబాబు వణికిపోతున్నారని పేర్కొన్నారు. ఆదివారం గుంటూరులో బీజేపీ నిర్వహించిన ‘ప్రజా చైతన్య సభ– సత్యమేవ జయతే’ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. వివిధ రకాల హావభావాలు, ముక్కుసూటి వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలు, ప్రశ్నలతో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
ఏ సమయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అని సంబోధించకుండా ‘అరే బాబుగారూ!’ ‘లోకేశ్ పితా’ అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీనియార్టీ దేనిలో ఉందో వివరిస్తూ మోదీ విసిరిన వ్యంగ్యాస్త్రాలకు సభలో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబు, లోకేశ్‌ల అవినీతి, అక్రమాల లక్ష్యంగానే మోదీ ప్రసంగం ఆసాంతం సాగింది. ఇన్నాళ్లూ రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసిన వారు ఇప్పుడు అసత్య ప్రచారం ద్వారా పబ్బం గడుపుకుందామనుకుంటున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా తాను చేపట్టిన పథకాలపై.. చంద్రబాబు తన స్టిక్కర్ వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు ఏపీ అభివృద్ధిని వదిలేసి నన్ను తిట్టే పని పెట్టుకున్నారని విమర్శించారు. ఏపీ మౌలిక వసతులను గొప్పగా మారుస్తామని వాగ్దానం చేసిన బాబు వాటన్నిటినీ వదిలేసి యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. అద్భుతమైన అమరావతి నిర్మాణమంటూ వ్యక్తిగత అభివృద్ధిలో బిజీ అయిపోయారని, చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు.. కూలిపోతున్న తన పార్టీ నిర్మాణమని ఎద్దేవా చేశారు. మోదీ ప్రసంగం పూర్తి సారాంశం ఆయన మాటల్లోనే..
మీలాంటి సీనియార్టీ నాకు లేదు బాబుగారూ..
‘నా కంటే సీనియర్ అని చంద్రబాబు పదేపదే ప్రచారం చేసుకుంటున్నారు. అవును.. మీరు నా కన్నా సీనియర్.. అందుకే మీకు ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడూ ఇచ్చాం. కానీ మీరు మాత్రం కూటములు మారడంలో సీనియర్. కొత్త పొత్తులు పెట్టుకోవడంలో సీనియర్. సొంత మామకు వెన్నుపోటు పొడవడంలో సీనియర్. ఒక ఎన్నికల తరువాత మరో ఎన్నికల్లో ఓడిపోవడంలో మీరు సీనియర్. ఈరోజు ఎవరిని తిడతారో రేపు మళ్లీ వారి ఒళ్లోనే కూర్చోవడంలో సీనియర్. ఆంధ్రా ప్రజల కలçల్ని వంచించడంలో సీనియర్. ఇలాంటి సీనియార్టీ నాకు లేదు. ఢిల్లీలోని ఓ కుటుంబం ఎప్పుడూ దేశంలోని పెద్ద నేతలను అవమానించింది.
ఈ అవమానాల నుంచే ఎన్టీఆర్ ఆత్మగౌరవం పేరుతో టీడీపీ పెట్టారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడాల్సిన టీడీపీ ఈరోజు అదే పార్టీ ముందు మోకరిల్లింది. ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని తీసుకున్న చంద్రబాబు ఆయన ఆశయాలను నిలబెట్టలేకపోయారు. నేనే సీనియర్‌ను అని చెప్పుకుంటున్న వ్యక్తికి ఈ విషయం ఎందుకు అర్థం కావడం లేదు? ఏపీని అవమానించిన కాంగ్రెస్‌ను ఎన్టీఆర్ దుష్ట కాంగ్రెస్ అంటే.. చంద్రబాబు నేడు దోస్త్ కాంగ్రెస్ అంటున్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపెట్టుకోవడం చూసి ఎన్టీఆర్ ఆత్మ ఎంత క్షోభిస్తోందో!. ఎన్టీఆర్ పార్టీని లాక్కున్న వ్యక్తి తన తప్పులను దాచుకోవడానికి ఇతరులను ఇష్టానుసారం తిడుతున్నారు. పదేపదే అబద్ధాలు ఆడుతున్నారు. నిజాలను దాచేందుకు ఓ ముఖ్యమంత్రి పదేపదే అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటే ఏదో తప్పు చేశారని, ఎక్కడో ఏదో లోపం ఉందని అర్థమవుతోంది. తమ రాజకీయ అవసరాల కోసం ఇన్నేళ్లూ ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వారంతా కలసి మహాకల్తీ కూటమిని ఏర్పాటు చేశారు. అందులో చంద్రబాబు కూడా చేరారు.
నాకు వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం రాదు..
నాకు సంపద పెంచడం రాదని చంద్రబాబు అంటున్నారు. అవును, నాకు చంద్రబాబులా వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం చేతకాదు. అమరావతి నుంచి పోలవరం దాకా చంద్రబాబు కేవలం తన ఆస్తులు పెంచుకొనే ప్రయత్నం చేశారు. నిజాయితీగా దేశంలోని యువత, మహిళలు, రైతులు, కష్టపడి దేశ సంపదను పెంచడానికి కృషి చేస్తున్నారు. వారికి పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేయడమే ప్రధానిగా నా బాధ్యత. నాయకులు తమ బిడ్డల ఆస్తులు పెంచుకోవడానికి కాదు.. ప్రజల ఆస్తులు పెరగడానికి కృషి చేయాలి.
ప్యాకేజీకి ధన్యవాదాలు చెప్పారు..
55 నెలల్లో ఏపీకి నిధులు కేటాయించడంలో ఎలాంటి లోపం చేయలేదు. నిధుల విషయాన్ని ఇక్కడి ప్రభుత్వం ప్రజలకు చెప్పడం లేదు. కేంద్ర నిధులను సరిగా వినియోగించడం లేదు. ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా కేవలం తన స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ ఏపీని విభజించింది. 2014లో మా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏపీ కోసం ప్రత్యేక హోదాతో జరిగే లబ్ధికి సమానంగా నిధులు వచ్చేలా ప్రత్యేక ప్యాకేజీని రూపొందించాం. 2016 సెప్టెంబర్‌లో కేంద్రం ప్యాకేజీ ప్రకటించగానే చంద్రబాబు సంతోషించి కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు చెప్పారు. అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం కూడా చేశారు. ఈ ప్యాకేజీ కింద కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా దాదాపు 3 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఏపీకి ఇచ్చాం. ఇందులో కేంద్ర విద్యాసంస్థలు, అభివృద్ధి పథకాలు ఉన్నాయి. తిరుపతిలో ఐఐటీ, అనంతపురంలో సెంట్రల్ వర్సిటీ, మంగళగిరిలో ఎయిమ్స్, వైజాగ్–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, మూడు కొత్త ఎయిర్‌పోర్టుల విస్తరణ, మెట్రో రైల్ ఇలా ఎన్నో ప్రారంభం అయ్యాయి. విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టులు పదేళ్ల కాలంలో పూర్తవ్వాలి. కానీ మా ప్రభుత్వం ముందుగానే వీటిని పూర్తిచేసింది.
చంద్రబాబు ఓటమి భయంతో వణుకుతున్నారు
ఎన్నికల్లో వరుసగా గెలిచే సత్తా చంద్రబాబుకు లేదు. అందుకే ఆయనకు ఓటమి భయం పట్టుకుంది. తనకొడుకును రాజకీయాల్లో పైకి తేవాలనే తాపత్రయం మరోపక్క ఉంది. ప్రజల సేవకుడిగా ఉన్న నన్ను చూసి చంద్రబాబుకు నిద్రపట్టడం లేదు. ప్రతిక్షణం భయంతో వణికిపోతున్నారు. ఇన్నాళ్లూ తాను చేసిన ఖర్చులకు లెక్కలు చెప్పకుండానే చంద్రబాబు మేనేజ్‌చేసుకుంటూ వచ్చారు. అక్రమ సంపాదన చేసిన ఆయన.. మా ప్రభుత్వం ఇచ్చిన నిధులకు లెక్కలు అడుగుతుంటే భయపడుతున్నారు. అవును నేను చౌకీదార్‌నే. ప్రజల డబ్బులకు నేను కాపలాదారునే. వారికి జవాబు చెప్పాల్సిందే. ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి అయ్యే ఖర్చు మా కార్యకర్తల కష్టార్జితంతో చేస్తున్నది.
ఢిల్లీ దీక్షకు ప్రజల డబ్బు..
ఫొటోలకు ఫోజులు ఇవ్వడానికి, తన అనుచరులతో కలసి నన్ను తిట్టడానికి చంద్రబాబు ఢిల్లీకి వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ప్రజాధనాన్ని తన ప్రచారానికి, పార్టీ ప్రచారాల కోసం చంద్రబాబు దుబారా చేస్తున్నారు. ఏపీ ప్రజల సంస్కారం, వివేకం, సంస్కృతి ప్రపంచానికి ఆదర్శం. కానీ చంద్రబాబు కొంతకాలంగా డిక్షనరీలోని ఉన్న అన్ని తిట్లను నాపై ఉపయోగిస్తున్నారు. చంద్రబాబు వాడుతున్న భాషను చూస్తే ఏపీ సంస్కృతినిè కించపరుస్తున్నట్లు కనిపిస్తోంది. తండ్రీ కొడుకులు చేస్తున్న ఈ తిట్ల దండకాన్ని ఏపీ ప్రజలు చీదరించుకుంటున్నారు. అందుకే ఇంత పెద్ద సంఖ్యలో నా సభకు ప్రజలు వచ్చారు. తండ్రీ కొడుకుల ఈ అవినీతి ప్రభత్వం త్వరలోనే ప్రజల చేతిలో మట్టి కరవనుంది. నేను ఇక్కడికి వస్తుంటే టీడీపీ నాయకులు నల్లబెలూన్లు ఎగురవేశారు. ఏదైనా శుభకార్యంలో దిష్టికోసం నల్లచుక్కను పెడుతుంటారు. నల్లబెలూన్లు నాకు దిష్టితీసినట్లు భావిస్తున్నా. టీడీపీ నేతలు తనను గోబ్యాక్ అంటున్నారు.. నిజమే నేను మళ్లీ వెనక్కు వెళ్లి ఢిల్లీ పీఠంపై కూర్చుంటాను. ఇది తథ్యం. ఈ దేశ ప్రజలపై నాకు నమ్మకం ఉంది.’ అని ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.
రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసిన బాబు: కన్నా
గుంటూరు సభకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ప్రధాని మోదీ చెప్పబోయే వాస్తవాలు వినడానికి బీజేపీ వీరసైనికులతో పాటు సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడం సంతోషాన్ని కలిగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి నిత్యం కేంద్రంపైనా, మోదీపైనా అసత్యాలు ప్రచారం చేయడానికే పరిమితమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో తండ్రీ కొడుకుల అవినీతి, అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికార యంత్రాంగం టీడీపీ తొత్తుగా పనిచేస్తోందని, అధికారం ఏ పార్టీకీ శాశ్వతం కాదన్న విషయం వారు తెలుసుకోవాలన్నారు.
మోదీ పర్యటనను భగ్నం చేయాలనే దురుద్దేశంతో సీఎం చంద్రబాబు మూడు రోజులుగా రహస్య స్నేహితులతో కలిసి కుట్రలు పన్నారని ఎమ్మెల్సీ సోమువీర్రాజు దుయ్యబట్టారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల తర్వాత స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోకుండా సీఎం చంద్రబాబు తిరిగి కేంద్రంపైనే నిందలు చేస్తున్నారని బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. నిజం చెప్తే తల వేయి వక్కలవుతుందనే శాపం చంద్రబాబుకు ఉందని, భూమ్మీద ఆయనంత అబద్ధాలకోరు మరొకరు లేరని బీజేపీ నేత సత్యకుమార్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన హామీలను పదేళ్లలో చేయవచ్చని ఉన్నా.. మోదీ ఐదేళ్లలోనే రాష్ట్రానికి అన్నీ చేశారని ఎస్సీ విభాగం నాయకుడు నిమ్మ జయరాజ్ పేర్కొన్నారు.