కేటీఆర్‌కు కాంగ్రెస్‌ గురించి బాగా తెలుసు : కోమటిరెడ్డి

KomatiReddy Venkat Reddy Comments About KCR In Party Meeting - Sakshi

సాక్షి, రంగారెడ్డి : టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఫార్మాసిటీ పేరిట ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిబట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలతో కోమటిరెడ్డి గురువారం సమావేశమయ్యరు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. కేసీఆర్‌కు పేద, బడుగు, బలహీన వర్గాలంటే పట్టింపు లేదని అందుకే రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, రైతు బందు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.

మా పార్టీ ఇంకా ప్రజల గుండెల్లో ఉందన్న విషయం కేటీఆర్‌కు తెలుసు కాబట్టే కాంగ్రెస్‌ను తక్కువ అంచనా వేయడం లేదంటూ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేసీఆర్‌ గుర్తుంచుకోవాలని, ఎందుకంటే రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుక ఉంటేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని కోమటిరెడ్డి తెలిపారు. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఐటీ కంపెనీలు, ఔటర్‌ రింగ్‌ రోడ్లును ఏర్పాటు చేసి అభివృద్ధి అంటే ఏంటో చూపామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్‌రెడ్డి రంగారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.(చదవండి : కాంగ్రెస్ పార్టీకి అంతం లేదు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top