చంద్రబాబు రాజకీయ దళారీ | Gadikota Srikanth Reddy Fires on Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు రాజకీయ దళారీ

Oct 31 2019 5:56 AM | Updated on Oct 31 2019 5:56 AM

Gadikota Srikanth Reddy Fires on Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి వినియోగించాల్సిన లేబర్‌ సెస్‌ను ఐదేళ్ల పాటు పక్కదారి పట్టించి స్వప్రయోజనాలకు వాడుకున్న చంద్రబాబు ఇప్పుడు లోకేశ్‌తో దీక్ష చేయిస్తూ.. ఇసుక కార్మికులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం కోసం వాడాల్సిన నిధులను వేసవిలో చంద్రన్న మజ్జిగ పంపిణీ పేరిట హెరిటేజ్‌ సంస్థకు దోచి పెట్టారని, మేడే ఉత్సవాలంటూ ప్రచారం కోసం ఫ్లెక్సీలకు వినియోగించారని తెలిపారు. రూ.వందల కోట్ల లేబర్‌ సెస్‌ పక్కదారి పట్టించిన విషయాన్ని బయటపెడితే చంద్రబాబు, లోకేశ్‌ను భవన నిర్మాణ కార్మికులే విజయవాడ నుంచి తరిమికొడతారని అన్నారు. దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. చంద్రబాబు ఓ రాజకీయ దళారీ అని, అలాంటి వ్యక్తిని రాష్ట్ర ప్రజలు ఇంతకాలం భరించారంటే వారి ఓపికకు మెచ్చుకోవాలని అన్నారు. ఐదేళ్లలో టీడీపీ ఎమ్మెల్యేలు, తెలుగు తమ్ముళ్లు తీవ్ర స్థాయిలో ఇసుకను దోపిడీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం వెనుకే ధూళిపాళ నరేంద్ర ఇసుక మాఫియా నడిపిన మాట వాస్తవం కాదా? చంద్రబాబుకు తెలియకుండానే రోజూ ఇసుక లారీలు పోతాయా? అని అప్పటి బీజేపీ ఎంపీ గోకరాజు ప్రశ్నించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 

టీడీపీ మాఫియానే ఇసుక కొరత సృష్టిస్తోంది 
వైఎస్సార్‌ హయాంలో మాదిరిగానే వైఎస్‌ జగన్‌ పాలనలో వర్షాలు కురిసి వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయని, దానివల్లే కొంతమేర ఇసుక కొరత ఏర్పడిందని గడికోట చెప్పారు. టీడీపీ మాఫియానే ఇసుక కొరతను సృష్టిస్తూ భవన కార్మికుల మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు. పేద ప్రజలకు ఇసుక అందించాలనే ఉద్దేశంతోనే ఒక పాలసీ కోసం జగన్‌ ఆలోచన చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు మాటలు భవన నిర్మాణ కార్మికుల నైతిక స్థైర్యం దెబ్బతీస్తూ, వారిని ఆత్మహత్యల వైపు పురిగొల్పుతున్నాయన్నారు. 

వరదలు తగ్గగానే ఇసుక కొరత శాశ్వత నివారణ 
వరదలు తగ్గాక ఇసుక కొరతను శాశ్వతంగా నిర్మూలిస్తామని గడికోట చెప్పారు. ఇందుకు గ్రామ సచివాలయాల సిబ్బందిని ఉపయోగించాలని, అవసరమైతే ప్రజలకు ఇసుక ఉచితంగా ఇవ్వండని కలెక్టర్లకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలిచ్చారన్నారు. ఈ వార్తను బయటకు రానివ్వకుండా పచ్చ మీడియా ద్వారా చంద్రబాబు కుట్ర పన్నారని శ్రీకాంత్‌ అన్నారు. లోకేష్‌ పెరిగిన శరీరం తగ్గించుకోవడానికే డైటింగ్‌ ప్రోగ్రామ్‌లా దొంగ దీక్ష పెట్టాడని విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement