కూలీ నంబర్‌ 1.. ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో బస

Chandrababu Spent The State Treasury On Unnecessary Events - Sakshi

సాక్షి, అమరావతి : పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడంలో దిట్ట.. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడంలో ఆయన స్టైలే వేరు.. కళ్లార్పకుండా కమిట్‌మెంట్‌తో అబద్ధాలు చెప్పడంలో తనకు తానే సాటి.. బ్రిటిషర్లతో పోరాడానని బీరాలు పలికినా..  బాహుబలి సినిమాకు ఆస్కార్‌ ఇప్పిస్తానని నమ్మబలికినా.. రాజధానికి 7 శంకుస్థాపనలు చేసినా.. విదేశీ పర్యటనలకు కోట్లు ఖర్చు చేసినా.. ఆయనకే చెల్లింది. కూలీ నెంబర్‌ 1నని చెప్పుకుంటూ.. ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో నివాసముండే ఘనాపాటి.. ఎవరి ఘనతనైనా తన ఖాతాలో వేసుకోవడం ఆయన సహజ నైజం.. తిమ్మిని బమ్మిని చేస్తూ.. మసిపూసి మారేడు కాయగా మారుస్తూ... పరనింద.. ఆత్మస్తుతితో ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లగలిగే నేర్పరి.. నదుల అనుసంధానం, కరువుపై రెయిన్‌గన్, దోమలపై దండయాత్ర, ప్రాజెక్టుల నిద్ర, నవనిర్మాణ దీక్ష, నీరూ– చెట్టూ అంటూ.. పాలనను ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌గా మార్చేసిన  ఓ ప్రచార మేఘం.. మొత్తంగా ఆయనో ఈవెంట్‌ మేనేజర్‌.. ఆయనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు.  

ఒక పక్క రాష్ట్రం రెవెన్యూ లోటును ఎదుర్కొంటూ ఆర్థిక కష్టాల్లో ఉందంటూనే.. మరోవైపు అనవసర ఆర్భాటాలకు, సొంత ప్రచారాలకు భారీఎత్తున ప్రజాధనం దుబారాకు పాల్పడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గత 58 నెలల్లో ప్రచార ఆర్భాటాలకు, తాత్కాలిక నిర్మాణాలకు కలిపి మొత్తం రూ.3,628.17కోట్ల ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారు. గత ఐదేళ్లుగా ప్రచారమే పరమావధిగా పాలన సాగిస్తున్నారు. సమస్యల్ని పక్కదారి పట్టిస్తూ.. పాలనలో వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు అనుసరిస్తున్న మార్గం ఈవెంట్ల నిర్వహణ. ప్రజల దృష్టి మరల్చేందుకు రోజుకో మార్గం ఎంచుకుంటున్నారు.  కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతూ అవే నిజమని నమ్మించేలా పదేపదే వల్లె వేయడం ఆయనకు రివాజుగా మారింది. 

గోదావరి, కృష్ణా పుష్కరాలు మొదలు.. రాజధాని శంకుస్థాపనలు, విదేశీ పర్యటనలు, నదుల అనుసంధానం, కరవుపై యుద్ధం, దోమలపై దండయాత్ర, ప్రాజెక్టుల నిద్ర, నవ నిర్మాణ దీక్ష, హ్యాపీ సండే, భాగస్వామ్య సదస్సులు.. ఇలా ప్రతి కార్యక్రమాన్ని ఈవెంట్‌ మాదిరిగా నిర్వహించి ఆ తర్వాత పట్టించుకోలేదు. కేవలం ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కోసం కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ప్రచారమే ప్రభుత్వంగా నాలుగున్నరేళ్ల కాలం గడిపారు. తానేం చేసినా.. ‘ఇది ఒక చరిత్ర’ అంటూ సొంతడబ్బాతో ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లడం పరిపాటిగా మారింది. దేశంలో సీఎంలలో తానే సీనియర్‌ అని చెప్పుకునే చంద్రబాబు.. మొదట్నుంచీ ప్రచారం కోసం తప్ప, ప్రజలకు మేలు చేసే ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ప్రజల సొమ్మును నీళ్లలా ఖర్చు చేస్తూ.. సొమ్మొకరిది సోకొకరిది అనే మాటను నిజం చేశారు. 

రాజధాని తెరపై సింగపూర్‌ సినిమా

రాజధాని శంకుస్థాపనలకు తొలుత రూ.250 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఆ తరువాత పరిపాలన భవనం, సీడ్‌ కేపిటల్, రహదారుల శంకుస్థాపనల పేరుతో మరో రూ.100 కోట్ల వ్యయం చేసింది. ఇప్పటివరకు రాజధానిలో శాశ్వత భవనం ఒక్కటి కూడా నిర్మాణం చేపట్టలేదు. రాజధాని పేరుతో ఇన్నాళ్లు వర్షం వస్తే నీరు లోపలకు వచ్చేసే తాత్కాలిక నిర్మాణాలతో చంద్రబాబు సర్కారు కాలక్షేపం చేసింది. ఎన్నికల ముందు రాజధాని తెరపై సింగపూర్‌ సినిమా చూపించేందుకు రంగం సిద్ధం చేసింది.

అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పేరుతో వెల్‌కమ్‌ గ్యాలరీ అంటూ కొత్త ఎగ్జిబిషన్‌ను తెరమీదకు తీసుకువచ్చి రూ.44.50 కోట్లు వృథా చేస్తున్నారు. వాస్తవంగా ఈ వెల్‌కమ్‌ గ్యాలరీ అంతా సెట్టింగులతో మినీ రాజధాని ఊహా చిత్రాన్ని చూపించడమే తప్ప మరొకటి కాదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాజధాని నిర్మాణానికి డబ్బుల్లేవంటూ ప్రజల నుంచి విరాళాలు.. డబ్బుల రూపంలోను, ఇటుకలను స్వీకరించారు. అక్కడ నిర్మించిన తాత్కాలిక భవనాలు చూపించడానికి, పునాదులను ప్రజలకు చూపించడానికి కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు. రాజధాని అమరావతి సినిమాను చూపించేందుకు ఏకంగా రూ. 39.88 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

విదేశీ పర్యటనలకు వంద కోట్లు

చంద్రబాబు రెగ్యులర్‌ విమానాల్లో వెళ్లడం ఎప్పుడో మానేశారు. ఏ సీఎం చేయని విధంగా జిల్లాలకు వెళ్లినా, ఢిల్లీకి వెళ్లినా రెగ్యులర్‌ విమానాల్లో కాకుండా.. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరగడానికి ఐదేళ్లలో రూ.100 కోట్లు ఖర్చు అయింది.  భాగస్వామ్య సదస్సుల పేరుతో రూ.150 కోట్లు  నీళ్లలా ఖర్చుపెట్టారు. మందీ మార్బలంతో హంగూ ఆర్భాటాలతో..  సింగపూర్‌కు నాలుగుసార్లు, ప్రపంచ ఆర్థిక సదస్సుకు మూడుసార్లు, జపాన్, బ్రిటన్, చైనా, రష్యా, అమెరికా పర్యటనలకు వెళ్లి వచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు పేరుతో, విదేశీ యాత్రల పేరుతో చంద్రబాబు బృందం ఏకంగా వంద కోట్ల రూపాయలను వ్యయం చేసింది.  మంత్రులు, అధికారులు విహార యాత్రలతో ఎంజాయ్‌ చేశారు. కానీ ఒక్క కంపెనీ తెచ్చిందిలేదు. పైసా పెట్టుబడి వచ్చింది లేదు. 

పుష్కరాల ప్రచారానికి రూ.160 కోట్లు  

గోదావరి పుష్కరాల ప్రచారం కోసం 110 కోట్ల రూపాయలను.. కృష్ణా పుష్కరాల ప్రచారం కోసం రూ.47 కోట్లు వ్యయం చేశారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్నానం ఖరీదు 2.41 కోట్ల రూపాయలవడం విశేషం. ఇవి కాకుండా గోదావరి, కృష్ణా పుష్కరాలకు అవసరమైన మౌలిక వసతులకు రూ.3వేల కోట్లు ఖర్చు చేశారు. పుష్కరాల సమయంలో వేసిన రోడ్లు నామినేషన్‌ విధానంలో అస్మదీయులకు కట్టబెట్టగా..పనులన్నీ నాసిరకంగానే జరిగాయి. ఇదిలా ఉంటే  గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు ప్రచార కండూతి కారణంగా తొక్కిసలాట జరిగి 29 మంది  ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.  

తాత్కాలిక సోకులకు వందల కోట్లు 

హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయం భవనాలకు కోట్ల రూపాయల వ్యయంతో సోకులు చేశారు. ఓటుకు కోట్లు కేసుతో ఆ భవనాలను వదిలేసి విజయవాడకు తరలి వచ్చేశారు. క్యాంపు కార్యాలయాలకు, ఉండవల్లిలోని అక్రమ నిర్మాణంలో సీఎం ఉంటున్న ఇంటికి సోకుల పేరుతో కోట్లు వెచ్చించారు. మరో పక్క రాజధానిలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక భవనాల పేరుతో వందల కోట్ల రూపాయలను వ్యయం చేశారు.  

జన్మభూమి అంటూ రూ.150 కోట్లు ఖర్చు 
జన్మభూమి అంటూ ఆరుసార్లు నిర్వహించి అందుకోసం ఇప్పటివరకు రూ.150 కోట్లు వ్యయం చేశారు. జన్మభూమి కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా బాబు ప్రచారానికి వినియోగించుకున్నారు. కృష్ణా–గోదావరి నదుల అనుసంధానం పేరుతో ఈవెంట్లను నిర్వహించి పెద్ద ఎత్తున ఖర్చుచేశారు. నవ నిర్మాణ దీక్ష పేరుతో ఏటా రూ.20 కోట్లను వ్యయం చేశారు. వీటివల్ల ప్రచారం తప్ప ఎటువంటి ఫలితం కనిపించలేదు. హ్యాపీ సిటీ సదస్సును తెరమీదకు తెచ్చి రూ.100 కోట్లు ఖర్చు చేశారు.  

రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ పేరిట వందల కోట్లు  

రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ పేరుతో వందల కోట్ల రూపాయలను నీళ్లలా ఖర్చు చేస్తూ ప్రచారానికి వినియోగించారు. ఈ దుబారా, ఆర్భాటపు ప్రచారాల వల్ల ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగమైంది. నాలుగున్నరేళ్ల పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అంటకాగినప్పుడు నవ నిర్మాణ దీక్షల పేరుతో భారీగా వ్యయం చేశారు. బీజేపీ నుంచి బయటకు వచ్చేసిన నాటి నుంచి ధర్మపోరాట దీక్షల పేరుతో ప్రభుత్వం భారీగా వెచ్చించింది. ఢిల్లీలో ఒక రోజు పది కోట్లు వెచ్చించి రాజకీయ సభలను ఏర్పాటు చేసింది. సొంత మీడియా సంస్థలకు భారీఎత్తున ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ.. తక్కిన మీడియా పట్ల చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపిందని కాగ్‌ తప్పుపట్టిన సంగతి తెలిసిందే. 

ఎన్నికల ముందు ప్రచారానికి రూ.582 కోట్లు
ఎన్నికల ముందు ప్రజాధనాన్ని ఇష్టానుసారం సొంత ప్రచారం కోసం వాడుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తువేశారు. ఎన్నికల ముందు బాబు ప్రచారానికి రూ.528 కోట్ల అదనపు బడ్జెట్‌కు సమాచార శాఖ ప్రతిపాదించింది. ఇందులో ముఖ్యమంత్రి సూచనతో సమాచార శాఖ ఈ ఏడాది మార్చిలోగా ఔట్‌డోర్, ఇన్‌డోర్‌ పేరుతో ప్రచారానికి ఏకంగా రూ.482 కోట్ల ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ ఏడాది బడ్జెట్‌లో సమాచార శాఖ ప్రచారం కోసం కేటాయించిన రూ.121.72 కోట్ల వ్యయం చేసేశామని తెలిపింది. చెల్లించాల్సిన బకాయిలు రూ.100 కోట్లతోపాటు మార్చి నెలాఖరు వరకు ప్రచారానికి రూ.482 కోట్లు కలిపి.. మొత్తం రూ.582  కోట్లను అదనంగా కేటాయించాల్సిందిగా సమాచార శాఖ.. ఆర్థిక శాఖకు ప్రతిపాదనలను పంపించింది. 

పోలవరంలో రూ.273.81 కోట్లు దుబారా
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండానే.. ఏదో అయిపోతున్నట్లు విహారయాత్రల పేరుతో ఏకంగా రూ.121.81 కోట్లు వ్యయం చేశారు. అది కాకుండా ముఖ్యమంత్రి నిర్వహించిన ఈవెంట్లు, సమీక్షలకు మరో రూ.152 కోట్ల ఖర్చయింది. ఈ మొత్తం ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరుగా మారిందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు సినిమా చూపించేందుకు కోట్ల రూపాయలు వ్యయం చేయడంపై అధికార వర్గాల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 

తీవ్రంగా తప్పు పట్టిన కాగ్‌

సుప్రీంకోర్టు నిబంధనలకు తూట్లు పొడుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఇమేజ్‌ పెంచుకోవడానికి రూ.13.76 కోట్లు ప్రజాధనం వృథా చేయడాన్ని కాగ్‌ తీవ్రంగా తప్పుపట్టింది. ప్రభుత్వ ధనాన్ని రాజకీయంగా వ్యక్తిగత ఇమేజ్‌ పెంచడానికి వ్యయం చేయడాన్ని కాగ్‌ ఎత్తి చూపింది. ఇది ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడమేనని పేర్కొంది.

చంద్రబాబు ఆర్భాటపు వ్యయాల వివరాలు (రూ. కోట్లలో) 

ప్రత్యేక విమానాల ప్రయాణం 100
హైదరాబాద్‌లో సీఎం కార్యాలయానికి (ఎస్‌ బ్లాకు) 14.63
హైదరాబాద్‌లో తొలుత సీఎం కార్యాలయం హెచ్‌ బ్లాకుకు 6.29
లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌ (హైదరాబాద్‌) 9.47

సీఎం కార్యాలయ ఫర్నిచర్‌

10
మదీనాగూడ ఫాం హౌస్, జూబ్లీహిల్స్‌ అద్దె ఇంటికి 4.37
ఇరిగేషన్‌ గెస్ట్‌ హౌస్, సీఎం క్యాంపు ఆఫీస్‌ విజయవాడ 42
సీఎం ప్రత్యేక బస్సు 5.50
రాజధాని నిర్మాణానికి ప్రధాన శంకుస్థాపన 250
ఆ తరువాత మూడు శంకుస్థాపనలకు 100

రాజధాని కన్సల్టెంట్లు

300
తాత్కాలిక సచివాలయం  ఇతర మరమ్మతులు 1,100
రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ కోసం 115
జన్మభూమి కార్యక్రమాలకు 150
నవ నిర్మాణ దీక్షల కోసం (రూ. కోట్లలో) 80
విదేశీ పర్యటనలు (అందరూ కలిసి) 120
పోలవరం బస్సు యాత్ర  121.81
పోలవరం ఈవెంట్ల కోసం 152
గోదావరి పుష్కరాల ప్రచారానికి  -110
కృష్ణా పుష్కరాల ప్రచారానికి 47
రాజధాని బస్సుయాత్రలకు  39.88
రాజధానిలో సింగపూర్‌ సెట్టింగులకు 44.50
ఎన్నికల ముందు 
బాబు ప్రచారానికి
582
హ్యాపీ సిటీస్‌ సదస్సుల కోసం 100
బాబు పాల్గొన్న గుంటూరు జిల్లాలో ఈవెంట్ల వ్యయం 23.72
బాబు ఆర్భాటాలకు అయిన మొత్తం వ్యయం 3,628.17

- సీహెచ్‌. మాణిక్యాలరావు, సాక్షి, అమరావతి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top