
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్‌లకు సవాల్‌గా మారిన సంగతి తెలిసిందే. అందుకే ఈ రెండు పార్టీలు ఈ ఎన్నికల్లో గెలిచేందుకు వీలైనన్ని వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. అందులో ఒకటి. సెల్‌ఫోన్‌తో ప్రజలకు చేరువవ్వడం. నేరుగా పార్టీ నాయకత్వం ప్రజలను చేరుకోవడం కష్టం కనుక.. క్షేత్రస్థాయి కార్యకర్తల ద్వారా ప్రతి ఓటరును చేరుకునేందుకు ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నంలో భాగంగానే.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈమధ్య ఎక్కడకు ప్రచారానికి వెళ్లినా.. కార్యకర్తలతో ఫోన్లో మాట్లాడుతూ సభకు వస్తున్నారా? అని వాకబు చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పట్టుకోసం కాంగ్రెస్..
కాంగ్రెస్ పార్టీ గతంలో అనుసరించిన వ్యూహాలకు భిన్నంగా క్షేత్రస్థాయిపై పట్టుకోసం కొత్త ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా బూత్ స్థాయిలో కార్యకర్తల మద్దతు సాధనకు ‘విద్య’ పేరుతో రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఇలాంటి ప్రయత్నాలు చేయడం కాంగ్రెస్‌కు ఇదే ప్రథమం. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఈ పని నడుస్తోంది. డేటా విశ్లేషణ విభాగం అధిపతి ప్రవీణ్ చక్రవర్తి కనుసన్నల్లో ఆయన బృందం మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలోని ప్రతీ బూత్‌స్థాయిలోని కార్యకర్తల వివరాలు నిక్షిప్తం చేశారు. ఏ పోలింగ్‌బూత్‌లో పార్టీ బలంగా ఉంది, ఎక్కడెక్కడ ఏయే కార్యకర్తలపై ఆధారపడవచ్చో.. పార్టీ అభ్యర్థులకు సమాచారం అందజేస్తున్నారు. దీంతో ఈ వివరాలు కావాలంటూ అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని ప్రవీణ్ చక్రవర్తి చెబుతున్నారు. పార్టీ కార్యకర్తల భర్తీకి ఉపయోగిస్తున్న ‘శక్తి’ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా సేకరిస్తున్న డేటాబేస్‌నే విద్య సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచారు.
పాతవ్యూహానికి బీజేపీ పదును
ఇలాంటి సాంకేతికతను బీజేపీ గత ఎన్నికల్లోనే వినియోగించింది. అయితే.. 2019 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావడంలో భాగంగా కొత్తగా‘సెల్‌ఫోన్ ప్రముఖ్’ పేరిట ప్రచారాన్ని ప్రారంభించింది. దేశంలోని 9,27,533 పోలింగ్‌బూత్‌లకు ఒక్కో సెల్‌ఫోన్ ప్రముఖ్‌ను నియమించింది. ఈ కార్యకర్తకు ఓ స్మార్ట్‌ఫోన్‌ను ఇచ్చి దీని ద్వారా వాట్సాప్ ఆధారిత ప్రచారాన్ని కొనసాగిస్తారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా రూపొందించిన పోలింగ్ బూత్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా దీనిని అమలుచేస్తున్నారు. ప్రధాని మోదీ కూడా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా బూత్‌స్థాయి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.