మమతతో పోటీకి సై అన్న శివసేన!

Shiv Sena Announces It Will Contest Lok Sabha Seats In West Bengal - Sakshi

కోల్‌కతా : మహారాష్ట్రలో బీజేపీతో అధికారం పంచుకుంటున్న హిందుత్వ పార్టీ శివసేన మరోసారి మిత్రపక్షానికి గట్టి షాక్‌ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించి బీజేపీని సవాల్‌ చేసింది. మమతా బెనర్జీ ఇలాఖాలో తమ పార్టీ తరఫున 15 మంది అభ్యర్థులను నిలుపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు.. శివసేన రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ అశోక్‌ సర్కార్‌ గురువారం మాట్లాడుతూ.. ‘ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అసంతృప్త నేతలను చేర్చుకుని బెంగాల్‌ బీజేపీ నాయకులు.. అధికార పార్టీకి షాడోగా మారుతున్నారు. వాళ్లు తృణమూల్‌తో ఎప్పటికీ యుద్ధం చేయలేరు. అందుకే మేము రంగంలోకి దిగాం. ఈరోజు పశ్చిమబెంగాల్‌లోని 11 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాం. మరో నాలుగు చోట్ల కూడా పోటీ చేయనున్నాం అని తెలిపారు.(చదవండి : పొత్తు ఫైనల్‌ : బీజేపీ 25, శివసేన 23 స్ధానాల్లో పోటీ)

ఈ క్రమంలో పశ్చిమబెంగాల్‌ని తమ్‌లూక్‌, కొంటాయి, మిడ్నాపూర్‌, ఉత్తర కోల్‌కతా, పురులియా, బరాక్‌పూర్‌, బంకుర, బరాసత్‌, బిష్ణుపూర్‌, ఉత్తర మాల్దా, జాదవ్‌పూర్‌ తదితర లోక్‌సభ స్థానాల్లో శివసేన అభ్యర్థులు బరిలో దిగుతారని సర్కార్‌ ప్రకటించారు. అదేవిధంగా తాను మిడ్నాపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని పేర్కొన్నారు. కాగా ఈ స్థానం నుంచి కోల్‌కతా బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌, టీఎంసీకి చెందిన మనాస్‌ భునియా పోటీ చేస్తున్నారు. ఇక 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా శివసేన 18 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన సంగతి తెలిసిందే.(చదవండి :దీదీకీ ఎదురుదెబ్బ‌.. బీజేపీలోకి కీలక నేత!)

కాగా బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా విపక్ష కూటమి ఏర్పాటు చేస్తానన్న బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి చెక్‌ పెట్టేందుకు బీజేపీ అధిష్టానం చురుగ్గా పావులు కదిపింది. అమిత్‌ షా నేతృత్వంలోని నాయకులు పలువురు టీఎంసీ ఎంపీ, ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుని పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించింది. అయితే ప్రస్తుతం శివసేన నిర్ణయంతో బీజేపీకి పెద్దగా నష్టం లేకపోయినప్పటికీ హిందూ ఓట్లు మాత్రం చీలే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీని ఎదుర్కునేందుకు దీదీ కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.  42 లోక్‌సభ స్థానాలున్న తమ రాష్ట్రంలో 41 శాతం సీట్లు మహిళలకు కేటాయించడం, పలువురు సినీ నటులను అభ్యర్థులను నిలపడం ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top