దీదీకీ ఎదురుదెబ్బ‌.. బీజేపీలోకి కీలక నేత!

Trinamool Lawmaker Joins BJP - Sakshi

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ముఖ్య నాయకుడు, భత్‌పరా ఎమ్మెల్యే అర్జున్‌ సింగ్‌ గురువారం బీజేపీలో చేరారు. బీజేపీ నాయకుడు ముకుల్‌ రాయ్‌తో ఢిల్లీలో భేటీ అయిన అనంతరం సీనియర్‌ నాయకుల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకొన్నారు. ఆయనతో పాటు తృణమూల్‌ బహిష్కృత నేత, బోల్‌పూర్‌ ఎమ్మెల్యే అనుపమ్‌ హజ్రా, సీపీఎం నాయకుడు ఖగేన్‌ మెర్ము కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

అనంతరం అర్జున్‌ సింగ్‌ మాట్లాడుతూ... డబ్బులు ఇస్తేనే తృణమూల్‌ కాంగ్రెస్‌లో మనుగడ సాధించవచ్చని పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని విమర్శించారు. ‘ నేను 40 ఏళ్లుగా మమతా జీ దగ్గర పనిచేశాను. కానీ బాలాకోట్‌లో వైమానిక దళం జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ విషయంలో భారత సైన్యం విశ్వసనీయతను ఆమె ప్రశ్నించడం నన్ను కలచివేసింది. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా దేశమంతా ఒక్కటూ మాట్లాడుతుంటే మమతా జీ మాత్రం.. మెరుపు దాడుల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశం ఏమిటని అడగటం నిజంగా దురదృష్టకరం. ఈరోజు బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉంది’ అని అర్జున్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌..బీజేపీలోకి సోనియా అనుచరుడు! 

కాగా నాలుగుసార్లు ఎమ్మెల్యే గెలుపొందిన అర్జున్‌ సింగ్‌ ఈసారి లోక్‌సభ బరిలో దిగాలని ఆశించారు. ఈ మేరకు గతంలో తాను ఓటమి చవిచూసిన..  బారక్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. నియోజకవర్గంలోని దాదాపు అన్ని శాసన సభ స్థానాల్లో పట్టు ఉన్న అర్జున్‌ సింగ్‌.. సిట్టింగ్‌ ఎంపీ దినేశ్‌ త్రివేదిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూపి.. ఆ స్థానం నుంచి టికెట్‌ తనకే కేటాయించాలని మమతను కోరారు. అయితే అందుకు నిరాకరించిన మమత ఆ టికెట్‌ను దినేశ్‌కు కేటాయించారు. పార్టీ ముఖ్య నేతగా ఉన్న తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో నిరాశ చెందిన అర్జున్‌ సింగ్‌ బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది. ఒక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార బీజేపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ అనుచరుడు టామ్‌ వడక్కన్‌ ఇప్పటికే బీజేపీలో చేరగా.. ఇప్పుడు తృణమూల్‌ కాంగ్రెస్‌ ముఖ్య నేత అర్జున్‌ సింగ్‌ కూడా కాషాయ కండువా కప్పుకోవడంతో మరిన్ని చేరికల కోసం అమిత్‌ షా తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు సమాచారం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top