రత్నంలాంటి నటుడు

Veteran Telugu Actor Rallapalli Narasimha Rao Passes Away - Sakshi

సినిమాల్లో వేషాలు కావాలంటే ఎలా అడగాలి? ఉన్న ప్లస్‌ పాయింట్‌లన్నీ చెప్పాలి. కానీ ‘నా ఎత్తు ఆరడుగులు ఉండదు. నా ముఖం అందంగా ఉండదు’ అని మైనస్‌ పాయింట్లు చెప్పుకుంటారా? రాళ్లపల్లి చెప్పారు. ఈ రెండు మైనస్‌లతో పాటు ఒక ప్లస్‌ చెప్పారు. ‘15 ఏళ్ల రంగస్థలం అనుభవం ఉంది’.. ఇదొక్కటే రాళ్లపల్లి ప్లస్‌ పాయింట్‌. మైనస్, ప్లస్‌ రాసి దర్శకుడు ప్రత్యగాత్మకి ఓ జాబు పంపించారు రాళ్లపల్లి. ఆ ఉత్తరం ప్రత్యగాత్మకి నచ్చింది. రాళ్లపల్లికి కబురు వచ్చింది. హైదరాబాద్‌ నుంచి మద్రాస్‌ రైలెక్కారు రాళ్లపల్లి.

అది ప్రసాద్‌ స్టూడియో. రచయిత సి. నారాయణరెడ్డి (సినారె), దర్శకుడు ప్రత్యగాత్మ కూర్చుని ఉన్నారు. ‘ఏదీ నువ్వు చేసిన నాటకాల్లో ఒక్క డైలాగ్‌ చెప్పు’ అన్నారు. చెప్పారు రాళ్లపల్లి. ‘పనికొస్తాడు’ అని కితాబు ఇచ్చారు సినారె. ఓకే అన్నారు ప్రత్యగాత్మ. ‘స్త్రీ’ (1973) చిత్రంలో అవకాశం ఇచ్చారు. అప్పటినుంచి ‘భలే భలే మగాడివోయ్‌’ (2015) వరకూ దాదాపు 850 చిత్రాల్లో నటించిన రాళ్లపల్లి (73) ఇక లేరు. కొంత కాలంగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు.

అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. అనంతపురం జిల్లాలోని కంబదూరులో 1945 ఆగస్ట్‌ 15న జన్మించారు రాళ్లపల్లి వెంకట నరసింహారావు. 1958లోనే హైదరాబాద్‌లో వీరి కుటుంబం స్థిరపడింది. చిన్నప్పటి నుంచి రాళ్లపల్లికి నాటక రంగంపట్ల ఆసక్తి ఎక్కువ. పదో తరగతిలో ఉన్నప్పుడే ‘కన్యాశుల్కం’ నాటకం ద్వారా రంగస్థల ప్రవేశం చేశారు.  చదువుకుంటూ, నాటకాల్లో నటిస్తూ బీఎస్సీ పూర్తి చేశారు. నటుడే కాదు రాళ్లపల్లిలో మంచి రచయిత కూడా ఉన్నారు.

కాలేజీ రోజుల్లో ఆయన రాసి, నటించిన ‘మారని సంసారం’ నాటికకు ఉత్తమ రచన, నటుడు అవార్డులు లభించాయి. అప్పటి బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి చేతుల మీదుగా అ అవార్డులు అందుకున్నారాయన. బీఎస్సీ పూర్తయ్యాక తన అన్నయ్య సలహా మేరకు రైల్వేలో ప్యూన్‌ జాబ్‌లో చేరారు రాళ్లపల్లి. కుర్చీలు, బల్లలు తుడవడం, కాఫీ కప్పులు కడగడం.. ఇలా అన్నీ చేశారు. ఓ సందర్భంలో పై అధికారి ఏదో అంటే సీరియస్‌గా ఇంగ్లిష్‌లో సమాధానం చెప్పారు రాళ్లపల్లి.

ఆ తర్వాత ఆయన రాళ్లపల్లి వివరాలు కనుక్కుంటే బీఎస్సీ చదువుకున్నాడని తెలుసుకుని, అప్పటినుంచి చదువుకు తగ్గ పనులు మాత్రమే చెప్పడం మొదలుపెట్టారు. ప్యూన్‌ ఉద్యోగం చేస్తుండగానే ‘సాంగ్‌ అండ్‌ డ్రామా డివిజన్‌’లో రాళ్లపల్లికి జాబ్‌ వచ్చింది. 1970 జనవరి 4న ఢిల్లీలో కొత్త ఉద్యోగంలో చేరిన ఆయన జాతీయ సమైక్యత, కుటుంబ నియంత్రణ.. ఇలా సామాజిక అంశాలతో నాటకాలు వేశారు. ఎనిమిదేళ్ల పాటు నిరవధికంగా నాటకాలు వేశారు రాళ్లపల్లి. ఆయన జీవితకాలంలో దాదాపు 8 వేల నాటకాల్లో నటించారు.

నాటకాలతో బిజీగా ఉన్నప్పుడే నూతన హీరో హీరోయిన్లతో కె. ప్రత్యగాత్మ దర్శకత్వంలో ‘హారతి’ నవలను సినిమాగా తీయనున్నట్లు వచ్చిన పత్రికా ప్రకటన రాళ్లపల్లి దృష్టిలో పడింది. ‘మీరెలాగూ హీరోగా పనికి రారు. వేరే ఏదైనా పాత్రలకు పనికొస్తారేమో.. ఓ ఉత్తరం రాయొచ్చు’గా అని భార్య స్వరాజ్యలక్ష్మి చెప్పిన మీదట.. ‘నా ఎత్తు అంతంత మాత్రమే.. ’ అంటూ ప్రత్యగ్మాతకు రాశారు. అలా ‘స్త్రీ’ సినిమాకి అవకాశం తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశారు. రాళ్లపల్లి కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘ఊరుమ్మడి బతుకులు’ (1976). అందులో రాళ్లపల్లి చేసిన తాగుబోతు హరిశ్చంద్రుడు పాత్ర ఆయనకు నంది అవార్డు తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత ‘చిల్లర దేవుళ్లు’లో చేసిన వీరిగాడి పాత్ర, ‘చలి చీమలు’ కూడా రాళ్లపల్లికి మంచి పేరు తెచ్చాయి. ‘సీతాకోక చిలుక’, ‘అభిలాష’, ‘కంచు కాగడా’, ‘రేపటి పౌరులు’, ‘అన్వేషణ’, ‘శుభలేఖ’ వంటి చిత్రాలు రాళ్లపల్లిలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించాయి. ‘అభిలాష’ సినిమాలో చిరంజీవిని కాపాడే జైలు వార్డన్‌ శర్మగా ఆయన చేసిన నటన విపరీతంగా ఆకట్టుకుంది. ఇంకా వంశీ సినిమాలు ‘ఆలాపన, ఏప్రిల్‌ 1 విడుదల, శ్రీ కనకమహాలక్ష్మీ రికార్డింగ్‌ డ్యాన్స్‌ ట్రూప్‌’లో మంచి పాత్రలు చేశారు. జంధ్యాల ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘అహ నా పెళ్లంట’, ‘రెండు రెళ్ల ఆరు’లో మంచి పాత్రలు చేశారు. మణిరత్నం ‘బొంబాయి’లో చేసిన హిజ్రా క్యారెక్టర్‌ రాళ్లపల్లికి పలు ప్రశంసలు తెచ్చిపెట్టింది.

సినీ కెరీర్‌ ఆరంభించిన తొలి నాళ్లలో టైటిల్‌ కార్డ్స్‌లో ‘ఆర్‌.వి. నరసింహారావు’ అని వేసేవారు. ‘తూర్పు వెళ్లే రైలు’ సినిమా చేసేటప్పుడు ఆ చిత్రదర్శకుడు బాపు.. అంత పొడవాటి పేరు ఎందుకు? అని ‘రాళ్లపల్లి’ అని వేశారు. అప్పటినుంచి ‘రాళ్లపల్లి’గా గుర్తుండిపోయారు. కళాకారులు నిరంతర విద్యార్థులు అంటారు రాళ్లపల్లి. అది ఆచరణలోనూ చూపెట్టారాయన. 70 ఏళ్లకు దగ్గరపడుతున్న సమయంలో తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల శాఖలో ఎంఫిల్‌ చేశారాయన.

800 పై చిలుకు చిత్రాల్లో నటించిన రాళ్లపల్లి కెరీర్‌పరంగా హ్యాపీ. వ్యక్తిగతంగా 1994లో ఓ విషాదం చోటు చేసుకుంది. ఆయన పెద్ద కుమార్తె విజయ మాధురి మెడిసిన్‌ చదవడానికి రష్యా ప్రయాణం అయినప్పుడు మార్గ మధ్యలో వైరల్‌ ఫీవర్‌ ఎటాక్‌ కావడంతో చనిపోయారు. తన జీవితంలో జరిగిన అతి పెద్ద దుర్ఘటన అది అని పలు సందర్భాల్లో రాళ్లపల్లి ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయన చిన్నకుమార్తె రష్మిత ఎంసీఏ చేశారు.  ప్రస్తుతం కుటుంబంతో సహా రష్మిత అమెరికాలో ఉన్నారు. ఆమె హైదరాబాద్‌ చేరుకున్నాక రాళ్లపల్లి అంత్యక్రియలు 20న మహాప్రస్థానంలో జరుగుతాయని ఆయన సన్నిహితులు తెలిపారు.

తెలుగు సినిమా పరిశ్రమ మంచి సహాయనటుడు, హాస్య నటుడిని కోల్పోయింది. రత్నం లాంటి నటుడు రాళ్లపల్లి. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఆయన చేసిన పాత్రలు గుర్తుండిపోతాయి. కళాకారుడు కన్నుమూసినా, తాను చేసిన పాత్రల్లో జీవించే ఉంటాడు. ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచే ఉంటాడు.

రాళ్లపల్లి మృతికి  పలువురు చిత్రరంగ, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం తెలిపారు.
నాటకం, సినిమా, టీవీ రంగాల్లో నటుడిగా, కథా రచయితగా, దర్శకుడిగా రాళ్లపల్లిగారు కోట్లాది అభిమానులను సంపాదించారు. ఆయన మృతి చెందడం నన్ను తీవ్ర విచారానికి గురి చేసింది. వాళ్ల కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను.
– వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

చెన్నైలోని వాణి మహల్‌లో డ్రామాలు వేస్తున్నప్పుడు రాళ్లపల్లి గారిని కలిశాను. ఆయన నటన చూసి ముగ్ధుడినయ్యాను. నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. చక్కని స్నేహశీలి. చాలా రోజుల తర్వాత ఆ మధ్య ’మా’ ఎన్నికల సందర్భంగా కలుసుకున్నాను. ‘ఎలా ఉన్నావు మిత్రమా?’ అంటూ ఇద్దరం ఒకరిని ఒకరం పరస్పరం పలకరించుకున్నాం. అదే ఆఖరి చూపు. ఇంతలో ఆయన తనువు చాలించారంటే బాధగా అనిపిస్తోంది. 
– నటుడు చిరంజీవి

సినిమాల్లోని పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడమే కాదు. వంటగదిలోని పాత్రలతో భోజనప్రియులతో ‘ఆహా.. ఏమి రుచి’ అనిపించగలరు రాళ్లపల్లి. నటుడు కమల్‌హాసన్, దర్శకుడు వంశీలకు రాళ్లపల్లి వంటకాలంటే చాలా మక్కువ. ‘‘మీకు ఎప్పుడూ సినిమాలుండాలనేది నా ఆకాంక్ష. ఒకవేళ లేకపోతే నా దగ్గరకొచ్చేయండి.. వారానికి రెండు రోజులు వండి పెట్టండి చాలు. జీవితాంతం మిమ్మల్ని చూసుకుంటాను’’ అని రాళ్లపల్లితో కమల్‌ ఓ సందర్భంలో అన్నారు. ఇక దర్శకుడు వంశీ అయితే షూటింగ్‌ స్పాట్‌కే కూరగాయలు తెప్పించి మరీ రాళ్లపల్లితో వంట చేయించుకుని ఎంతో ఇష్టంగా తీనేవారు. ఇంకా రాళ్లపల్లి వంటలను ఇష్టంగా ఆరగించిన ప్రముఖులు చాలామందే ఉన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top