ప్రేమికుల లక్ష్యం | Manasa Vacha Telugu Movie Team Press Meet | Sakshi
Sakshi News home page

ప్రేమికుల లక్ష్యం

Feb 16 2019 3:07 AM | Updated on Feb 16 2019 3:07 AM

Manasa Vacha Telugu Movie Team Press Meet - Sakshi

నిశ్చల్‌ దేవా

‘‘లైఫ్‌ స్టైల్, తులసీదళం’ వంటి చిత్రాల్లో హీరోగా నటించిన నేను కథ నచ్చడంతో ‘మనసా.. వాచా’  సినిమాతో నిర్మాతగా మారాను. దర్శకుడు ఎం.వి.ప్రసాద్‌ ప్రాణం పెట్టి ఈ సినిమా తెరకెక్కించారు. సినిమా మొత్తం లండన్‌లో తీశాం’’ అని నిశ్చల్‌ దేవా అన్నారు. తేజస్‌ హీరోగా, కరిష్మా కర్పాల్, సీమా పర్మార్‌ హీరోయిన్లుగా ఎం.వి. ప్రసాద్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘మనసా.. వాచా’. గణేష్‌ క్రియేషన్స్‌ పతాకంపై నిశ్చల్‌ దేవా, లండన్‌ గణేష్‌ నిర్మించిన ఈ చిత్రం ‘ఎం.జి.ఎం (మినిమమ్‌ గ్యారంటీ మూవీస్‌) ద్వారా మార్చి 1న విడుదలవుతోంది. ఎం.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘విభిన్న ప్రేమ కథా చిత్రమిది.

జ్వరం, జలుబు వంటి వ్యాధులు వచ్చినప్పుడు మందులు వేసుకుని నయం చేసుకుంటాం. అలాగే క్యాన్సర్‌ సోకినప్పుడు కూడా అంతే సులభంగా నయం చేసుకునేలా ఉండాలనే లక్ష్యంతో పనిచేసే ప్రేమికులకు ఎదురయ్యే కొన్ని అనూహ్య సంఘటనలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్‌గారు నా పాత్రని చాలా అందంగా తీర్చిదిద్దారు’’ అని కరిష్మా కర్పాల్‌ అన్నారు. ‘‘మనసా.. వాచా’ వంటి మంచి సినిమాని మా సంస్థ ద్వారా విడుదల చేస్తుండటం సంతోషంగా ఉంది’’ అని ఎం.జి.ఎం అధినేత అచ్చిబాబు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement