మెగా బ్రదర్స్ మెగాఫోన్ పడుతున్నారా? | Chiranjeevi 150th Film Details | Sakshi
Sakshi News home page

మెగా బ్రదర్స్ మెగాఫోన్ పడుతున్నారా?

Oct 28 2014 10:35 PM | Updated on Mar 22 2019 5:33 PM

మెగా బ్రదర్స్ మెగాఫోన్ పడుతున్నారా? - Sakshi

మెగా బ్రదర్స్ మెగాఫోన్ పడుతున్నారా?

ఒకేసారి రెండు ఆసక్తికరమైన వార్తలు.చిరంజీవి తన 150వ సినిమా కోసం మెగాఫోన్ పట్టనున్నారట. అలాగే ఎన్నాళ్లనుంచో ఊరిస్తూ వస్తున్న ‘గబ్బర్ సింగ్-2’ను పవన్ కల్యాణ్ తనే సొంతంగా

ఒకేసారి రెండు ఆసక్తికరమైన వార్తలు.చిరంజీవి తన 150వ సినిమా కోసం మెగాఫోన్ పట్టనున్నారట.  అలాగే ఎన్నాళ్లనుంచో ఊరిస్తూ వస్తున్న ‘గబ్బర్ సింగ్-2’ను పవన్ కల్యాణ్ తనే సొంతంగా డెరైక్ట్ చేసుకోబోతున్నారట. ఈ రెండు వార్తలూ ప్రస్తుతం ఫిలిమ్‌నగర్‌లో హాట్ టాపిక్‌గా నిలిచాయి. ఇంతకూ ఈ వార్తలు నిజమేనా? మొదట చిరంజీవి సినిమా విషయానికొద్దాం. ‘శంకర్‌దాదా జిందాబాద్’ తర్వాత చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేయడం, దాంతో సినిమాలకు ఏడేళ్లు ఆయన దూరం కావడం, మళ్లీ ఇటీవలే ఆయన తన 150వ సినిమాకు సంబంధించి ప్రయత్నాలు మొదలుపెట్టడం తెలిసిందే.
 
  ఇప్పుడు చిరంజీవి దృష్టి అంతా ఈ 150వ సినిమా మీదే. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. మునుపటి స్థాయిలో తన శరీరాన్ని తీర్చిదిద్దుకుని సన్నబడ్డారు కూడా. మరో పక్క కథల వేటలో నిమగ్నమయ్యారు. అయితే ఇంతవరకూ ఏదీ ఓకే కాలేదట. చారిత్రక నేపథ్యం ఉన్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చేస్తారని ప్రచారం జరిగినా, చిరంజీవి మనసులో మాత్రం పక్కా మాస్ ఎంటర్‌టైనర్ చేయాలనే ఉంది. ఆ మధ్య బర్త్‌డే స్పెషల్ ఇంటర్వ్యూల్లో కూడా ఈ విషయాన్ని చిరంజీవి స్పష్టం చేశారు.
 
  2015లో తాను మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోవడం ఖాయమని చెప్పారు. ఈ 150వ సినిమాను వీవీ వినాయక్ డెరైక్ట్ చేస్తారని చాలా కాలంగా వార్త వినిపిస్తోంది. మధ్య మధ్యలో కృష్ణవంశీ లాంటి దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజాగా వినవచ్చిన వార్త ఏమిటంటే - చిరంజీవి తానే సొంతంగా ఈ సినిమా డెరైక్ట్ చేయనున్నారట. అయితే ఇది ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తే తప్ప, ఇంతవరకూ అధికారిక సమాచారం లేదు. తీయబోయే సినిమాకు ఇప్పటికీ కథ ఓకే కాలేదు... కథ నిర్ణయం కాకుండా చిరంజీవి డెరైక్షన్ చేస్తారని చెప్పడం తొందరపాటే అవుతుందని కొంతమంది సినీ పెద్దలు చెబుతున్నారు. అయితే డిసెంబరు నాటికి ఈ సినిమా ప్రాజెక్ట్ విషయంలో ఓ స్పష్టత వస్తుందంటున్నారు.
 
 ఇక పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్-2’ విషయానికొస్తే - ‘రచ్చ’ ఫేమ్ సంపత్ నంది దర్శకత్వంలో ఈ చిత్రం చాలా నెలల క్రితమే ప్రారంభోత్సవం జరుపుకుంది. అయితే పవన్‌కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం, ఈలోగా హిందీ ‘ఓ మై గాడ్’ రీమేక్‌గా రూపొందుతోన్న ‘గోపాల... గోపాల’కు పవన్ కమిట్ కావడంతో ‘గబ్బర్‌సింగ్-2’ వెనక్కు వెళ్లిపోయింది. త్వరలోనే ప్రారంభం అని ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి కానీ, ఇంతవరకూ షూటింగ్ మొదలు కానే కాలేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ని తానే డెరైక్ట్ చేయాలని పవన్‌కల్యాణ్ నిశ్చయించుకున్నట్టు ఫిలిమ్‌నగర్ సమాచారం. పవన్ ఇంతకుముందు ‘జానీ’ సినిమా డెరైక్ట్ చేశారు. ఆ సినిమా వాణిజ్యపరంగా విఫలమైనా, పవన్‌లో మంచి దర్శకుడు ఉన్నాడని నిరూపించింది. ఏది ఏమైనా మెగా బ్రదర్స్ మెగా ఫోన్ పట్టనున్నారన్న వార్త తెలుగు చిత్రపరిశ్రమలో హల్‌చల్ చేస్తోంది. అయితే ఇందులో నిజానిజాల గురించి తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. అప్పటి వరకూ ఈ సస్పెన్స్ తప్పదు!
 

Advertisement
 
Advertisement
Advertisement